PM Kisan | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు పెట్టుబడి కోసం సహాయాన్ని అందించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఏటా రూ.6వేలు చెల్లిస్తోంది. ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో తరచూ కనిపించే భూ వివాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, కోర్టు కేసుల కారణంగా తమ తదుపరి విడత డబ్బులు నిలిచిపోతాయేమోనని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రైతులు 23వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో పలువురు రైతుల్లోనూ ఇదే సందేహాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో భూ వివాదాలు ఏమైనా పీఎం కిసాన్ ప్రయోజనంపై ప్రభావం చూపుతాయా అనేది తెలుసుకోవడం అవసరమే.
Read Also : నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నయ్.. ఎండలు నుంచి బిగ్ రిలీఫ్..!
రికార్డుల్లో పేరు ఉంటే ఆందోళన వద్దు..
పీఎం కిసాన్ పథకం లబ్ధి పొందాలంటే రైతు పేరు భూమికి సంబంధించిన ప్రభుత్వ ఆదాయ రికార్డుల్లో స్పష్టంగా మీ పేరు నమోదై ఉండాలి. అన్నదమ్ముల మధ్య వివాదం ఉన్నా, భూమి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కొనసాగుతున్నా, రెవెన్యూ రికార్డుల్లో యజమానిగా మీ పేరు ఉంటే మాత్రం సాధారణంగా పథకాన్ని నిలిపివేసేందుకు అవకాశం లేదు. భూ వివాదం కోర్టు వరకు వెళ్లి.. సంబంధిత భూమిపై న్యాయస్థానం ఆంక్షలు విధించినప్పుడు మాత్రం పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. భూమి యాజమాన్యంపై స్పష్టత లేకపోవడం, రికార్డులు వివాదాస్పదంగా ఉండడం, రైతు పేరు రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించడం వంటి సందర్భాల్లో పీఎం కిసాన్ సాయం నిలిచిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే, భూమి వివరాలు సైతం ప్రభుత్వ డేటాతో సరిపోకపోయినా జాప్యం జరిగే అవకాశం ఉంటుంది.
Read Also : ఏపీకి మరో భారీ రైల్వే ప్రాజెక్టు.. విశాఖ-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు ప్రతిపాదన
డబ్బులు ఆగిపోతే ఏం చేయాలంటే..?
భూ వివాదం కారణంగా పీఎం కిసాన్ నిధులు నిలిచిపోయాయని అనుమానం ఉంటే రైతులు వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులను, వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలి. గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), తహసీల్దార్ కార్యాలయం, జిల్లా వ్యవసాయ అధికారులను కలిసి భూమికి సంబంధించిన పత్రాలు, గుర్తింపు కార్డులు అందజేయాల్సి ఉంటుంది. తమకు భూమిలో యాజమాన్య హక్కు ఉందని నిరూపించే పత్రాలు అందజేస్తే.. అధికారులు వాటిని పరిశీలించి మళ్లీ సాయం అందించేందుకు అవకాశం ఉంటుంది. భూ వివాదం లేకపోయినా ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులు, ల్యాండ్ సీడింగ్ ప్రక్రియ పూర్తి చేయని లబ్ధిదారులకు కిసాన్ సమ్మాన్ నిధి ఆగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌లో తమ వివరాలను ఒకసారి పరిశీలించి.. ఏమైనా తప్పులుంటే అప్‌డేట్ చేయడం మంచిది. ముఖ్యంగా బ్యాంకు ఖాతా, ఆధార్, మొబైల్ నంబర్, భూమి రికార్డులు సక్రమంగా లింక్ అయ్యాయో లేదో తెలుసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. అయితే, భూమి వివాదాలు ఉన్న రైతులు ముందుగానే తమ రికార్డులను సరిచేసుకోవడం, ఈ-కేవైసీ పూర్తి చేయడం, ల్యాండ్ సీడింగ్ స్టేటస్‌ని చెక్ చేసుకుంటే ఆర్థిక సాయం నిలిచిపోకుండా చర్యలు తీసుకోవచ్చు. రికార్డుల్లో పేరు సక్రమంగా ఉన్నంత వరకు సాధారణంగా కేవలం భూ వివాదం కారణంగా పథకం ప్రయోజనాలు నిలిచిపోయేందుకు అవకాశం లేదని అధికారులు వివరిస్తున్నారు.
Read Also : జూన్‌లో 11 రోజులు బంకులు బంద్..! అసలు కారణం ఇదే..!


