Chhatrapati Shivaji | భారత్-ఇజ్రాయెల్ మధ్య సాంస్కృతిక, దౌత్య సంబంధాలకు మరోస్థాయికి చేరుకోనున్నాయి. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం, స్మారకాన్ని ఇజ్రాయెల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ కాన్సుల్ జనరల్ యానివ్ రెవాచ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రెండు దేశాల మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే చారిత్రక అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా యానివ్ రెవాచ్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ విగ్రహం కేవలం ఒక సాంస్కృతిక కార్యక్రమం కాదని, భారత్-ఇజ్రాయెల్ ప్రజలను మరింత దగ్గర చేసే స్నేహపూర్వక ప్రాజెక్టుగా తెలిపారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే ప్రతీకగా ఈ విగ్రహం నిలుస్తుందని చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన అనంతరం ఈ ప్రాజెక్టుపై ఆలోచన మొదలైందని తెలిపారు. ఈ ప్రతిపాదనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రాజెక్టు అమలుకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధమని ఫడ్నవీస్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
Read Also : మారుతున్న జీవనశైలి.. పెరుగుతున్న గుండె జబ్బులు.. NFHS నివేదికలో సంచలన విషయాలు..
శివాజీ చరిత్రపై ఆసక్తి
భారత చరిత్ర తనను ఎంతగానో ఆకట్టుకుందని యానివ్ రెవాచ్ పేర్కొన్నారు. దేశ నిర్మాణం, స్వాతంత్ర్య పోరాటం, జాతి గౌరవాన్ని కాపాడుకునే క్రమంలో భారత్, ఇజ్రాయెల్ చరిత్రల్లో అనేక పోలికలు కనిపిస్తాయని అభిప్రాయపడ్డారు. ఆ భావనతోనే శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఇజ్రాయెల్‌లో ఏర్పాటు చేయాలనే ఆలోచనకు రూపం ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా శివాజీ మహారాజ్ జీవిత విశేషాలు, ఆయన ఆలోచనలను ఇజ్రాయెల్ ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఆయనకు సంబంధించిన గ్రంథాలను హీబ్రూ భాషలోకి అనువదించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టును కేవలం విగ్రహ ఏర్పాటుకే పరిమితం చేయబోమని ఇజ్రాయెల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పేరొందిన శిల్పి చేత శివాజీ మహారాజ్ విగ్రహాన్ని రూపొందించి.. ఇజ్రాయెల్‌లోని ప్రముఖ ప్రదేశంలో ప్రతిష్ఠించాలనే ప్రణాళిక సిద్ధమవుతోంది. అలాగే శివాజీ మహారాజ్ జీవితం, నాయకత్వ లక్షణాలు, పరిపాలనా దక్షత గురించి స్థానిక ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా చేపట్టే అవకాశం ఉంది.
Read Also : నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నయ్.. ఎండలు నుంచి బిగ్ రిలీఫ్..!
బలపడుతున్న భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు
గత కొన్నేళ్లుగా రక్షణ, వ్యవసాయం, సాంకేతికత, సైబర్ భద్రత వంటి రంగాల్లో భారత్-ఇజ్రాయెల్ సహకారం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఈ భాగస్వామ్యం సాంస్కృతిక రంగానికీ విస్తరిస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర అవగాహనను మరింత పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా లెబనాన్ పరిస్థితులపై కూడా యానివ్ రెవాచ్ స్పందించారు. లెబనాన్ ప్రభుత్వంతోనూ, అక్కడి ప్రజలతోనూ ఇజ్రాయెల్‌కు ఎలాంటి ప్రత్యక్ష విభేదాలు లేవని, శాంతియుత సంబంధాలనే కోరుకుంటున్నామని తెలిపారు. అయితే, లెబనాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా, ఇరాక్‌కు చెందిన షియా మిలీషియా బలగాలు, యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు, గాజా ప్రాంతంలోని హమాస్ వంటి సంస్థల నుంచి భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఈ సంస్థల దాడుల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఇలాంటి శక్తులకు మద్దతు కొనసాగినంతకాలం ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొల్పడం కష్టమేనని ఇజ్రాయెల్ అభిప్రాయపడుతోందని చెప్పారు.
Read Also : మంచి జీతం ఉన్నా లోన్ రిజెక్ట్ అవుతోందా..? ఇందుకు ఈ ప్రధాన కారణాలు ఇవే..!


