వీరప్పన్‌ ఇంటర్వ్యూ కేసులో నటి సుకన్యకు ఊరట.. పరిహారం చెల్లించాలని సన్‌ టీవీకి మద్రాస్‌ హైకోర్టు ఆదేశం..!

వీరప్పన్ ఇంటర్వ్యూ (Veerappan Interview) ప్రసారంతో జరిగిన పరువు నష్టం కేసులో నటి సుకన్య (Actress Sukanya)కు మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఊరట కల్పించింది. సన్ టీవీ (Sun TV) నష్టపరిహారం చెల్లించాలని దిగువ కోర్టు తీర్పును సమర్థించింది.

Sukanya | ప్రముఖ నటి సుక్య దాదాపు 30 ఏళ్లుగా సాగిస్తున్న న్యాయపోరాటంలో విజయం సాధించారు. ప్రముఖ నటి సుకన్యకు సంబంధించిన పరువు నష్టం కేసులో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌తో ప్రసారమైన ఇంటర్వ్యూలో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రసారం చేశారన్న ఆరోపణలపై సన్ టీవీ నెట్‌వర్క్‌కు దిగువ కోర్టు విధించిన నష్టపరిహారాన్ని హైకోర్టు సమర్థించింది. దీంతో సుకన్యకు రూ.10 లక్షలకు పైగా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. ఈ వివాదం 1996 ఏప్రిల్ 17న ప్రసారమైన సన్ టీవీ కార్యక్రమం ‘నేరుక్కు నేర్’తో ప్రారంభమైంది. తమిళ పత్రిక ‘నక్కీరన్’ ఎడిటర్ ఆర్ఆర్ గోపాల్ నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలో వీరప్పన్ చేసిన వ్యాఖ్యలు తర్వాత పెద్ద వివాదానికి దారితీశాయి.

Read Also : అమ‌రావ‌తిలోకి మ‌రో కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌.. క్వాంట‌మ్ వ్యాలీ లాబోరేట‌రీని నెల‌కొల్ప‌నున్న డీఆర్‌డీవో..!

ఆ ఇంటర్వ్యూలో వీరప్పన్, నటి సుకన్యపై అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తనయుడితో అక్రమ సంబంధం ఉందంటూ నిరాధార ఆరోపణలు చేశాడు. అలాగే, 1996 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సుకన్య వీడియోలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాడని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, తన వ్యక్తిగత గౌరవానికి తీవ్ర భంగం కలిగించాయని పేర్కొంటూ సుకన్య కోర్టును ఆశ్రయించారు. ఈ ప్రసారంతో తన ప్రతిష్ఠ దెబ్బతిన్నదని, మానసికంగా కూడా తీవ్రంగా ప్రభావితమయ్యానని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం విచారణ అనంతరం 2015లో ట్రయల్ కోర్టు సుకన్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెకు రూ.10,00,500 నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ సన్ టీవీ నెట్‌వర్క్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ కే కుమరేశ్ బాబు నేతృత్వంలోని ధర్మాసనం దిగువ కోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Read Also : కడపలో గౌతమ్‌ అదానీ భారీ పెట్టుబడులు.. ఏపీలో భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..!

ప్రసారానికి ముందు ఇంటర్వ్యూలో ఉన్న పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను ధ్రువీకరించడంలో గానీ, సవరించడంలో గానీ యాజమాన్యం విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది. పూర్తి ఎడిటోరియల్ నియంత్రణ ఉన్నప్పటికీ వివాదాస్పద అంశాలను యథాతథంగా ప్రసారం చేయడం బాధ్యతారాహిత్యమని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ, సుకన్యకు నిర్ణయించిన నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తుది ఆదేశాలు జారీ చేసింది. సుకన్య 1980, 90 దశకాల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల్లో నటించారు. అనేక సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించిన మంచి గుర్తింపును సాధించుకున్నారు. ప్రస్తుతం ఆమె తల్లి పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఈ తీర్పుతో ఆమె దశాబ్దాలుగా సాగిన న్యాయపోరాటానికి ఒక కీలక ముగింపు లభించినట్లయింది.

Read Also : ఏపీకి పెట్టుబడుల ప్రవాహం.. నెల్లూరులో రూ.3వేలకోట్లకుపైగా ఐఎఫ్‌ఎఫ్‌ పెట్టుబడి..

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »