హైదరాబాద్, జూన్ 10: నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ నగరం మంగళవారం సాయంత్రం భారీ వర్షానికి తడిసిముద్దైంది. కేవలం రెండు గంటల వ్యవధిలో కురిసిన కుండపోత వర్షం నగరంలోని అనేక ప్రాంతాలను నీటమునిగేలా చేయడంతో పాటు ట్రాఫిక్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదవగా, రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణ వెదర్‌మ్యాన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నగరంలోని వినాయక్ నగర్‌లో అత్యధికంగా 98.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బన్సీలాల్‌పేట్‌లో 87.5 మి.మీ, విఠల్‌వాడిలో 79.8 మి.మీ, బషీర్‌బాగ్‌లో 78.5 మి.మీ వర్షం కురవడం నగరంలో ఈ సీజన్‌లోనే అత్యంత భారీ వర్షపాతంగా నమోదైంది.
ట్రాఫిక్‌కు భారీ అంతరాయం
భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఐకియా వరకు కేవలం 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు కొంతమంది వాహనదారులకు రెండు గంటలకుపైగా సమయం పట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.
మసాబ్‌ట్యాంక్‌లోని మహావీర్ హాస్పిటల్ సమీపంలో భారీగా నీరు నిలవడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని, ట్రాఫిక్ సిబ్బంది సూచనలను పాటించాలని సూచించారు.
#HYDTPinfo
🚨 Traffic Alert🚨
Waterlogging has been reported near Mahaveer Hospital, Masab Tank due to heavy rainfall.Traffic personnel are on-site monitoring the situation and regulating traffic to ensure the safety of commuters.
⚠️ Motorists are advised to drive cautiously,… pic.twitter.com/BVv5SG9ykp
— Hyderabad Traffic Police (@HYDTP) June 9, 2026
వర్షంలోనూ విధుల్లో ట్రాఫిక్ పోలీసులు
భారీ వర్షం కారణంగా ఏర్పడిన సమస్యలను ఎదుర్కొనేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ బృందాలు సమన్వయంతో పనిచేశాయి. నీటమునిగిన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం, రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించడం, నిలిచిపోయిన వాహనాలను తరలించడం వంటి పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వర్షంలోనూ విధులు నిర్వర్తించిన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
చార్మినార్ వద్ద చారిత్రక కట్టడానికి నష్టం
భారీ వర్షాల ప్రభావం నగర వారసత్వ కట్టడాలపై కూడా పడింది. చార్మినార్ సమీపంలోని దివాన్ దేవిడి వద్ద ఉన్న చారిత్రక చార్ కమాన్ నిర్మాణంలోని ఒక భాగం వర్షాల కారణంగా పాక్షికంగా కూలిపోయినట్లు సమాచారం. దీంతో పురావస్తు, వారసత్వ పరిరక్షణ అంశంపై మరోసారి చర్చ మొదలైంది.
బతుకమ్మకుంటలోకి భారీ వరద
అంబర్‌పేటలోని బతుకమ్మకుంటకు భారీగా వరద నీరు చేరింది. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో సమీప బస్తీలు, కాలనీలు ముంపునకు గురయ్యేవి. అయితే ఇటీవల HYDRAA చేపట్టిన చెరువు పునరుద్ధరణ చర్యల కారణంగా వరద నీరు నేరుగా చెరువులోకి చేరడంతో పరిసర ప్రాంతాలకు ముప్పు తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
ఒక్క వర్షానికే చెరువు నీటితో నిండిపోవడం పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన పాత్‌వే వద్ద వాకింగ్‌కు వచ్చినవారు కూడా భారీగా నీరు చేరడాన్ని ఆసక్తిగా వీక్షించారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం
మలక్‌పేట్, చాదర్‌ఘాట్, దబీర్‌పురా, అస్మాన్‌గఢ్ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విద్యుత్ లైన్లపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టీజీఎస్‌పీడీసీఎల్ అధికారులు వెంటనే మరమ్మతు పనులు చేపట్టి విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.
మరిన్ని వర్షాలకు అవకాశం
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
నగరంలో మొదటి భారీ వర్షమే ట్రాఫిక్, మౌలిక వసతుల సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. రానున్న వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


