హర్మన్‌ప్రీత్ మెడపట్టిందా? వైరల్ వీడియో వెనుక షాకింగ్ నిజం

భారత్-పాక్ మహిళల మ్యాచ్ తర్వాత వైరల్ అయిన హర్మన్‌ప్రీత్-ఫాతిమా సనా గొడవ వీడియో ఏఐతో సృష్టించిన ఫేక్ వీడియోగా తేలింది. పూర్తి వివరాలు చదవండి.

భారత్-పాక్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ ఫైట్? వైరల్ వీడియో అసలు నిజం
భారత్-పాక్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ ఫైట్? వైరల్ వీడియో అసలు నిజం
  • భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా పేర్లు వైరల్ వీడియోలో కనిపించాయి.
  • ఇద్దరు ఆటగాళ్లు కొట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.
  • ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం ఈ వీడియో వైరల్ అయింది.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే అభిమానుల్లో ఉద్వేగాలు ఉప్పొంగుతాయి. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, చారిత్రక ప్రత్యర్థిత్వం కారణంగా క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాంటి నేపథ్యంలో ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా మైదానంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు కనిపించిన ఈ వీడియో అనేకమందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే ఈ వీడియోపై జరిగిన ఫ్యాక్ట్ చెక్‌లో సంచలన నిజం బయటపడింది. వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించబడిందని తేలింది. మ్యాచ్‌లో ఎలాంటి ఘర్షణ జరగలేదని స్పష్టమైంది.

వైరల్ వీడియోలో ఫాతిమా సనా హర్మన్‌ప్రీత్ వైపు ఆగ్రహంగా వస్తుండగా, హర్మన్‌ప్రీత్ ఆమెను మెడ పట్టుకుని నెట్టేసినట్లు చూపించారు. వెంటనే రెండు జట్ల ఆటగాళ్లు అక్కడికి పరుగెత్తుకొచ్చినట్లు, అంపైర్లు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించినట్లు వీడియోలో కనిపించింది. తొలిచూపులో ఇది నిజమైన దృశ్యంలానే అనిపించినా, వీడియోను నిశితంగా పరిశీలిస్తే అనేక లోపాలు బయటపడ్డాయి.

స్కోర్‌బోర్డ్‌లో కనిపించిన వివరాలు అధికారిక ప్రసారానికి సరిపోకపోవడం, ఆటగాళ్ల కదలికలు అసహజంగా ఉండటం, ఫ్రేమ్‌ల మధ్య చిత్రాలు వక్రీకరించబడటం వంటి అంశాలు ఇది ఏఐతో రూపొందించిన ఫేక్ వీడియో అని నిపుణులు గుర్తించారు. సోషల్ మీడియా ఫ్యాక్ట్ చెకర్లు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.

ఇటీవల ఏఐ టెక్నాలజీ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ఇలాంటి నకిలీ వీడియోలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల వంటి భావోద్వేగ అంశాలను టార్గెట్ చేస్తూ కొందరు కావాలనే ఫేక్ కంటెంట్ తయారు చేసి వైరల్ చేస్తున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా వాటిని షేర్ చేయడం వల్ల తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తోంది.

మరోవైపు మ్యాచ్‌లో మాత్రం భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 44 బంతుల్లో 68 పరుగులు చేసి భారత జట్టుకు బలమైన పునాది వేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు ఉన్నాయి.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా బాధ్యతాయుతంగా ఆడి 35 బంతుల్లో 36 పరుగులు చేసింది. చివర్లో రిచా ఘోష్ దూకుడుగా ఆడి కేవలం 17 బంతుల్లో 34 పరుగులు చేసి స్కోరును 170కి చేర్చింది. పాకిస్థాన్ తరఫున ఫాతిమా సనా, సదియా ఇక్బాల్ చెరో రెండు వికెట్లు తీశారు.

171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. మునీబా అలీ ఒక్కరే కొంతసేపు పోరాడినా మిగతా బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. 17 ఓవర్లలోనే 106 పరుగులకు ఆలౌటై 64 పరుగుల తేడాతో ఓటమి చవిచూశారు.

భారత బౌలర్లలో దీప్తి శర్మ అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె కేవలం 10 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది. తెలుగుతేజం శ్రీచరణి కూడా మూడు వికెట్లు తీసి ఆకట్టుకుంది. యువ బౌలర్‌గా ఆమె ప్రదర్శనపై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మ్యాచ్ అనంతరం మరో అంశం చర్చనీయాంశమైంది. భారత్ మహిళల జట్టు కూడా పురుషుల జట్టు మాదిరిగానే పాకిస్థాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ క్రీడా సంబంధాల్లో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం కొనసాగుతోంది. అయితే ఇది మ్యాచ్‌కు ముందు తీసుకున్న నిర్ణయం మాత్రమేనని, మైదానంలో ఎలాంటి వాగ్వాదం లేదా ఘర్షణ జరగలేదని స్పష్టమైంది.

వైరల్ వీడియోలు చూసి వెంటనే నమ్మేయకుండా అధికారిక ప్రసారాలు, ఫ్యాక్ట్ చెక్ సంస్థలు, విశ్వసనీయ మీడియా కథనాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏఐ యుగంలో ఫేక్ వీడియోలు మరింత నమ్మదగిన రీతిలో తయారవుతున్నందున సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »