Padma Awards | దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను అందజేశారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 మంది పేర్లను పద్మ అవార్డులకు ప్రకటించగా, తొలి విడత కార్యక్రమంలో 66 మందికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ ఏడాది పద్మ విభూషణ్‌కు ఎంపికైన వారిలో బాలీవుడ్ సీనియర్ నటుడు స్వర్గీయ ధర్మేంద్రకు అవార్డు ప్రకటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ సినీ పరిశ్రమలో దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసిన ఆయనకు మరణానంతరం ఈ గౌరవం దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయన భార్య, ప్రముఖ నటి హేమమాలిని స్వీకరించారు. ఈ సందర్భంగా కుమార్తె అహనా దేవల్ కూడా ఆమెతో పాటు ఉండటం వేడుకకు భావోద్వేగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. భర్త జ్ఞాపకాలను తలుచుకుంటూ హేమమాలిని కాసేపు ఉద్వేగానికి లోనయ్యారు. ‘షోలే’, ‘చుప్కే చుప్కే’ వంటి క్లాసిక్ చిత్రాలతో కోట్లాది అభిమానులను సంపాదించిన ధర్మేంద్ర గత ఏడాది నవంబర్‌లో కన్నుమూశారు.
ఇదే విభాగంలో ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలు ఎన్ రాజం కూడా పద్మ విభూషణ్ అందుకున్నారు. భారతీయ శాస్త్రీయ సంగీత రంగానికి ఆమె చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ద్వారా గుర్తించింది. పద్మ భూషణ్ పురస్కార గ్రహీతల్లో పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్ పేరు నిలిచింది. కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను దేశంలోని అగ్రగామి ఆర్థిక సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దిన ఆయనను వాణిజ్య, పరిశ్రమల రంగాల్లో చేసిన సేవలకు గాను సత్కరించారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ప్రజా వ్యవహారాల విభాగంలో చేసిన కృషికి పద్మ భూషణ్ అందుకున్నారు. ఇక పద్మశ్రీ అవార్డుల జాబితాలో క్రీడలు, కళలు, సాహిత్యం, సామాజిక సేవ తదితర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీడా రంగంలో సాధించిన విజయాలకు గాను పద్మశ్రీ అందుకున్నారు. బెంగాలీ చిత్రసీమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన ప్రసేన్జిత్ చటర్జీకి కళల విభాగంలో ఈ గౌరవం దక్కింది. మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆయనకు అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఉంది.
Read Also : మద్యం ప్రియులకు షాక్ ఇవ్వబోతున్న సర్కారు.. జూన్ నుంచి ధరల పెంపు..!
ప్రకటనల రంగంలో తనదైన ముద్ర వేసిన స్వర్గీయ పియూష్ పాండేకు కూడా మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు. ఆయన తరఫున భార్య నీతా జోషి అవార్డును స్వీకరించారు. పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, నటుడు-దర్శకుడు అరవింద్ వైద్య కూడా ఈ ఏడాది పద్మశ్రీ గ్రహీతల జాబితాలో నిలిచారు. తెలుగు భక్తి సంగీతానికి విశేష సేవలు అందించిన వాగ్గేయకారుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు కూడా పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన తరఫున కుమారుడు ఈ అవార్డును స్వీకరించారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మిగిలిన అవార్డు గ్రహీతలకు మరో విడత కార్యక్రమంలో పురస్కారాలను అందజేయనున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.


