చెపాక్‌లో స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌.. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్ప‌నున్న మ‌హేంద్రుడు..!

చెపాక్‌ (Chepauk Stadium)లో జ‌రుగ‌నున్న చెన్నై సూప‌ర్ కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు ధోనీ ఐపీఎల్‌ (IPL) రిటైర్మెంట్ (Retirement) ఊహాగానాలు జోరందుకున్నాయి. అభిమానుల్లో ధోనీ చివరి మ్యాచ్ (Last Match) చూసేందుకు స్టేడియానికి త‌ర‌లిరానున్నారు.

MSD | మ‌హేంద్ర సింగ్ ధోనీ అనే పేరు విన‌గానే కోట్లాది మంది క్రికెట్ అభిమానుల‌కు ఎన్నో మ‌ధుర జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తుంటాయి. భార‌త క్రికెట్ జ‌ట్లుకు వ‌ర‌ల్డ్ క‌ప్‌లు అందించిన కెప్టెన్‌గా, ఐపీఎల్‌లో చెన్నైని ఐదుసార్లు టైటిల్ సాధించి పెట్టాడు. గొప్ప నాయ‌కుడిగా క్రికెట్ చ‌రిత్ర‌లో ప్ర‌త్యేక స్థానం ఉంది. అలాంటి స్టార్ ప్లేయ‌ర్ ఐపీఎల్‌కు ముంగింపు ప‌ల‌క‌డ‌బోతున్నాడా? అన్న చర్చ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. సోమవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో మ్యాచ్ ఆడ‌నుంది. మ్యాచ్‌పై అసాధార‌ణ హైప్ నెల‌కొన్న‌ది. సాధారణ లీగ్ మ్యాచ్ అయినప్పటికీ, అభిమానుల దృష్టి మాత్రం ధోనీపైనే ఉన్నది. ఈ సీజన్‌లో చెన్నై జట్టు తమ చివరి హోమ్ మ్యాచ్ ఆడుతుండడంతో “ఇదే ధోనీకి చెపాక్‌లో చివరి మ్యాచ్ కావొచ్చు” అన్న ప్రచారం జోరందుకుంది.

Read Also : గేమింగ్ రంగంలోకి ధోనీ సేన.. లైట్‌ఫ్యూరీ ‘ఈక్రికెట్’లో భారీ పెట్టుబడులు పెట్టిన టీమ్ ఇండియా స్టార్స్

ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది సైతం ధోనీ గతంలో చేసిన వ్యాఖ్య‌లే. 2021లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న స‌మ‌యంలో ధోనీ మాట్లాడుతూ “నా చివరి టీ20 మ్యాచ్ చెన్నైలోనే ఆడాలని కోరుకుంటున్నా” అని చెప్పాడు. అప్పట్లో సాధారణ మాట‌ల్లానే తీసుకున్నా.. అవి ఇప్పుడు అభిమానుల్లో భావోద్వేగాలను రేకెత్తిస్తున్నాయి. చెపాక్ స్టేడియం ధోనీకి ఎంత ప్రత్యేకమో.. అక్కడి అభిమానులు అతడిని ఎంతగా ఆరాధిస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చెన్నై జ‌ట్టు అంటే గుర్తుకు వ‌చ్చేది ధోనియే. అందుకే ఆయన చివరి మ్యాచ్ కూడా అదే వేదికపై జరగాలని చాలామంది కోరుకుంటున్నారు. ఈ సీజన్‌లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేక‌పోయాడు. పిక్క కండరాల గాయం కారణంగా దాదాపు మొత్తం సీజన్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, హైదరాబాద్ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో దాదాపు 30 నిమిషాల పాటు ధోనీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం అభిమానుల్లో కొత్త ఆశలు నింపింది. మైదానంలో ధోనీ హెలికాప్టర్ షాట్లు చూడాలని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్‌కు ముందు చెన్నై వీధుల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ధోనీ గురించే చర్చ నడుస్తోంది.

Read Also : రాయదుర్గం భూములు వేలం వేయనున్న కాంగ్రెస్‌ సర్కారు..! ఒక్కో ఎకరానికి రూ.139 కోట్లు..!

టికెట్ల కోసం అభిమానులు భారీగా పోటీపడుతున్నారు. చాలామంది “ధోనీ చివరిసారి చెపాక్‌లో ఆడితే ప్రత్యక్షంగా చూడాలి” ల‌నే కోరిక‌తో టికెట్ల కోసం ఆరాట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హ‌ర్ష‌భోగ్లే చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యంపోసాయి. “చెన్నైలో ఇక ఒకే మ్యాచ్ మిగిలి ఉంది. హఠాత్తుగా ధోనీ మైదానంలోకి వస్తే అది హాలీవుడ్ థ్రిల్లర్ క్లైమాక్స్‌లా ఉంటుంది” అంటూ ఆయ‌న వ్యాఖ్యానించ‌డం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అయితే, ఇప్పటివరకు ధోనీ రిటైర్మెంట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సీఎస్‌కే యాజమాన్యం సైతం ఈ విషయంపై మౌనం పాటిస్తోంది. కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రం గతంలో ధోనీ గాయం ఇంకా పూర్తిగా నయం కాలేదని, అందుకే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని తెలిపాడు. దీంతో ఇప్పుడు అభిమానులందరి దృష్టి మ్యాచ్ టాస్‌పైనే నిలిచింది. ఒకవేళ ధోనీ తుది జట్టులో కనిపిస్తే చెపాక్ స్టేడియం మొత్తం భావోద్వేగాలతో నిండిపోతుంది. అదే సమయంలో నిజంగా మ‌హేంద్రుడికి చివరి మ్యాచ్ అవుతుందా లేదా అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌క‌నున్న‌ది.

Read Also : ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం..! కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »