తంగేడు పూలకు కరువు | బతుకమ్మ పండుగ వేళ కనిపించని పూలు

బతుకమ్మ పండుగకు కీలకమైన తంగేడు పూలు ఈసారి దొరకడం కష్టంగా మారింది. చెట్లు తగ్గిపోవడంతో బంతి పూలతో బతుకమ్మలు పేర్చాల్సి వస్తోందని మహిళలు చెబుతున్నారు.

tangedu-flowers-shortage
tangedu-flowers-shortage

ఈ శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. బతుకమ్మ పండుగ అంటేనే తంగేడు పూలు గుర్తొస్తాయి. గతంలో ఎంగిలిపూల బతుకమ్మకు ముందు రోజే అన్నదమ్ములు ఆటోలు, బండ్లు, సైకిళ్లు పట్టుకుని తంగేడు పువ్వుల కోసం పరుగులు తీసేవారు. పోటీలు పడి తంగేడు పూలు తెచ్చేవారు. షర్లలోకి దిగి అల్లి పువ్వులు, బాలచందనం పూలు తెచ్చేవారు. కట్ల పూలు, సీతమ్మ పూలు, గునుగు పూలు, పందిళ్ల మీద పూసే బీర పూలు, గుమ్మడి పువ్వులు, గుమ్మడి ఆకులు కూడా తీసుకొచ్చేవారు.

అందరికన్నా తమ బతుకమ్మ పెద్దగా ఉండాలని పోటీ పడి తంగేడు పూలు కోసుకొచ్చే రోజులవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తంగేడు పువ్వు జాడే కనిపించడం లేదు. ఉన్న తంగేడు పూలు తెద్దామన్నా అన్నదమ్ములకు అంత ఓపిక లేకపోవడంతో అంగట్లో సులభంగా దొరికే బంతి పూలే దిక్కవుతున్నాయి.

బతుకమ్మ అంటే తంగేడు.. తంగేడు అంటే బతుకమ్మ అన్నంతగా ఈ పువ్వుకు ప్రాధాన్యం ఉంది. తంగేడు పువ్వు లేకుండా బతుకమ్మ వేరేలా ఉంటుందని తెలంగాణ మహిళలు భావిస్తారు. గతంలో ఎక్కడ పడితే అక్కడ ఊర్ల పొలిమేరల్లో మొలిచిన తంగేడు చెట్లు కనిపించేవి. ఇప్పుడు వెతికినా కంటికి కనిపించడం లేదని మహిళలు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం నాటిన అడవి తంగేడు చెట్లే కొంతవరకు దిక్కవుతున్నాయి. అయితే ఆ చెట్లు కూడా పెద్దగా పెరగకపోవడంతో తంగేడు పూలకు కొరత ఏర్పడుతోంది. ఈసారి తంగేడు పువ్వులకు మరింత ఇబ్బంది ఉందని మహిళలు చెబుతున్నారు.

ఒకప్పుడు తంగేడు పువ్వులనే పేర్చి పెద్ద పెద్ద బతుకమ్మలు చేసేవారు. ఇప్పుడు మాత్రం శాస్త్రానికి మొత్తంగా తంగేడు పువ్వు దొరికినా మంచిదే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇంట్లో అన్నదమ్ములు తంగేడు పువ్వుల కోసం పోటీలు పడి తెచ్చే జమానా పోయింది. చాలామంది ఇప్పుడు అంగట్లో పూలు కొనుక్కోవడానికే అలవాటు పడ్డారు.

ఊర్లల్లో ఉండేవారు కూడా అన్ని రకాల పువ్వులు కొనుక్కుంటున్నారు కానీ గతంలో మాదిరిగా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి పూలు తెంపుకొచ్చేవారు కనిపించడం లేదు. తంగేడు పువ్వులు దొరకడం లేదని చాలామంది ఇబ్బంది పడుతున్నారు.

ఈ విషయంపై ఉద్యానవన శాఖను అడిగితే తంగేడు చెట్లు నాటామని, కానీ చాలా వరకు అవి పెరగలేదని చెబుతున్నట్లు మహిళలు పేర్కొంటున్నారు. తంగేడు పువ్వులు దొరకకపోవడంతో ఎక్కువగా బంతి పువ్వులతోనే బతుకమ్మలు పేర్చాల్సి వస్తోంది.

తంగేడు పువ్వులను బతుకమ్మలకే కాకుండా మల్లన్న పట్నాల దగ్గర కూడా ఎండబెట్టి, పొడి చేసి ముగ్గుల మాదిరిగా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు వాటికి కూడా తంగేడు పువ్వులు దొరకని పరిస్థితి ఏర్పడింది.
అందుకే ఇప్పటి నుంచైనా తెలంగాణ అటవీ శాఖ, ఉద్యానవన శాఖలు తంగేడు చెట్ల పెంపకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మహిళలు కోరుతున్నారు.

విత్తనాలు వేసి మొక్కలు వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకుండా వదిలేయకుండా, తంగేడు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని చెబుతున్నారు. బతుకమ్మ పేర్చి మొక్కే గౌరమ్మ తల్లికి తంగేడు పూలతో పూజ చేసే సంప్రదాయం కొనసాగాలంటే తంగేడు చెట్లను పెద్దఎత్తున పెంచాలని తెలంగాణ మహిళలు కోరుతున్నారు.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »