ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. 10 మంది సజీవదహనం

మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయి 10 మంది సజీవ దహనమయ్యారు. టిప్పర్ ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

Markapuram Bus Accident
Markapuram Bus Accident

మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయి 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. టిప్పర్ ఢీకొన్న తర్వాత బస్సులో మంటలు చెలరేగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఈ ప్రమాదం జరిగింది. చీమకుర్తి వైపు నుంచి కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్‌ను హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదం ఉదయం 6 నుంచి 6.30 గంటల మధ్య జరిగినట్లు సమాచారం. మలుపు తిరుగుతున్న సమయంలో టిప్పర్ అధిక వేగంతో బస్సును ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఢీకొట్టిన వెంటనే బస్సులో మంటలు చెలరేగి, క్షణాల్లోనే పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

వెన‌క‌వారు మంటల్లో..

ప్రమాద సమయంలో బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని సమాచారం. అయితే బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఇప్పటివరకు 10 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మృతులంతా కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందినవారిగా తెలుస్తోంది.

ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.


అతి వేగ‌మే ప్ర‌ధాన కార‌ణం..

మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి టిప్పర్ అతివేగమే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

గత ఏడాది అక్టోబర్‌లో కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో కూడా ఇలాంటి దారుణ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి, 19 మంది సజీవ దహనమయ్యారు.

ప్రయాణికులు నిద్రలో ఉండటంతో బయటకు రాలేకపోవడం ఆ ప్రమాదానికి ప్రధాన కారణమైంది. తాజా ఘటన మరోసారి రోడ్డు భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తోంది. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వంటి అంశాలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తున్నాయి.

Also read: రాత్రంతా అమ్మా లే అమ్మా అంటూ మృతదేహం వద్ద చిన్నారి రోదన

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »