Electric AC Buses | ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందు ప్రయాణికుల సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విమానాశ్రయానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సులభంగా చేరుకునేలా భారీ స్థాయిలో రవాణా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో విశాఖపట్నం నగరం నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 50 ఎలక్ట్రిక్ ఎయిర్‌కండీషన్డ్ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. జులై తొలి వారంలో విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నందున బస్సులను కూడా అదే సమయంలో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.
Read Also : టాలీవుడ్‌కు ఏపీ నుంచే 75శాతం ఆదాయం.. బాలకృష్ట సంచలన వ్యాఖ్యలు..!
హైదరాబాద్ పుష్పక్ తరహాలోనే..
హైదరాబాద్‌లో విమానాశ్రయానికి నడిచే పుష్పక్ సర్వీసుల తరహాలో ఈ బస్సులు ఉండనున్నాయి. విమాన ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సమయపాలనతో కూడిన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ సేవలను రూపకల్పన చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలనే వినియోగించనున్నారు. జాతీయ రహదారి-16, బీచ్ రోడ్ మార్గాల మీదుగా ఈ బస్సులు ప్రధానంగా నడవనున్నాయి. విశాఖ నగరంలోని రద్దీ ప్రాంతాల నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకునేలా ప్రత్యేక రూట్లను సిద్ధం చేస్తున్నారు. దీంతో వ్యక్తిగత వాహనాల వినియోగం కొంత మేర తగ్గి ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కూర్మన్నపాలెం, గాజువాక, నాడ్ జంక్షన్, మద్దిలపాలెం, మధురవాడ, తగరపువలస వంటి ప్రాంతాల్లో ప్రత్యేక ఏసీ ప్యాసింజర్ లాంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
Read Also : భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుమల తరహాలోనే ప్రముఖ ఆలయాల్లోనూ సేవ భాగ్యం..
2వేల ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్‌పోర్ట్
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 2,200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మితమవుతోంది. ఈ ప్రాజెక్టు దాదాపుగా రూ.4,500 కోట్ల వ్యయంతో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో జీఎంఆర్ గ్రూప్ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. తొలి దశలో ఏడాదికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో ఎయిర్‌పోర్ట్‌ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం విమానాశ్రయ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆధునిక టెర్మినల్ భవనం, విస్తృత రన్‌వేలు, కార్గో సదుపాయాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరణ అవకాశాలతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. విశాఖపట్నానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో నిర్మితమవుతున్న భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ప్రధాన ఏవియేషన్ హబ్‌గా మారనుంది. ప్రస్తుతం విశాఖలో ఉన్న ఎయిర్‌పోర్ట్ నావికాదళానికి చెందిన భూభాగంలో పరిమిత సదుపాయాలతో కొనసాగుతుండగా, భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయంగా సేవలు అందించనుంది. విమానాశ్రయం ప్రారంభమైతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ లభించనుంది. పర్యాటకం, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : ఆక్వా రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం.. విద్యుత్ భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం..!
భోగాపురం చుట్టూ అభివృద్ధికి ఛాన్స్
ఎయిర్‌పోర్ట్‌ను కేంద్రంగా చేసుకుని రహదారుల విస్తరణ, కొత్త కనెక్టివిటీ కారిడార్లు, మాస్టర్ ప్లాన్ రోడ్లు, భవిష్యత్ మెట్రో ప్రాజెక్టులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. విమానాశ్రయానికి చేరుకునే మార్గాలను మెరుగుపరిచేందుకు రూ.వందల కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రం మారిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఉపాధి అవకాశాలు పెరగడం, కొత్త పరిశ్రమలు రావడం, రియల్ ఎస్టేట్ రంగం విస్తరించడం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం ప్రయాణికులకు మరింత ప్రయోజనకరంగా మారనుంది.
Read Also : పెద్దల సభకు వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ అధిష్టానం యోచన..!


