దసరా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ | ఇంటి వద్దకే ప్రత్యేక బస్

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పిస్తోంది. కనీసం 30 మంది ఒకే మార్గంలో ప్రయాణిస్తే హాస్టల్, కాలేజీ, కాలనీ వద్దకే బస్‌ను రప్పించుకునే అవకాశం ఉంది.

TGSRTC Dussehra Buses
TGSRTC Dussehra Buses

దసరా సెలవులకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. బస్ టైమ్ దాటిపోతుందని, బస్ స్టాండ్‌కు వెళ్లడం ఆలస్యం అవుతుందని ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల సంఖ్య కనీసం 30 మంది ఉంటే వారు ఉన్న ప్రాంతానికే ఆర్టీసీ ప్రత్యేక బస్సును పంపించి డోర్‌స్టెప్ పికప్ సదుపాయం కల్పించనుంది. ముఖ్యంగా విద్యార్థుల కోసం హాస్టళ్లు, కాలేజీల నుంచే నేరుగా బస్సులను నడపాలని నిర్ణయించింది.

తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. ఉద్యోగాలు, చదువుల కోసం నగరాల్లో ఉండే లక్షలాది మంది ఈ సమయంలో సొంత ఊళ్లకు బయలుదేరుతారు. ముఖ్యంగా హైదరాబాద్‌ లాంటి మహానగరంలో చదువుకునే వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ఒకేసారి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు ప్రయాణం అవుతారు. దీంతో నగరంలో రద్దీ పెరుగుతుంది.

ప్రతి ఏడాది దసరా సెలవుల సమయంలో బస్‌స్టాండ్లలో రద్దీ, ప్రైవేట్ వాహనాల అధిక చార్జీలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మహాత్మా గాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్‌ వంటి ప్రధాన ప్రాంతాల్లో వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది.

హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, కుటుంబంతో పండుగకు వెళ్లేవారు భారీ లగేజీతో సిటీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు మారి బస్‌స్టాండ్‌కు చేరుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ క్యాబ్ నిర్వాహకులు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తుంటారు. మరోవైపు సిటీలో ట్రాఫిక్ జామ్‌ల కారణంగా అనుకున్న సమయానికి బస్‌స్టాండ్‌కు చేరుకోలేక చాలామంది తాము బుక్ చేసుకున్న బస్సులను మిస్ అవుతుంటారు.

ఈ ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ టీజీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి. వినోద్ కుమార్ ప్రత్యేక సదుపాయాన్ని ప్రకటించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లు, కాలేజీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల నుంచే నేరుగా బస్సులను నడపాలని నిర్ణయించారు.

ఈ విధానం ప్రకారం ఒకే ప్రాంతానికి లేదా ఒకే మార్గంలో ప్రయాణించాలనుకునే వారు కనీసం 30 మంది ఉంటే చాలు. ప్రయాణికులు ఉన్న చోటికే ఆర్టీసీ బస్సు వచ్చి పికప్ చేసుకుంటుంది. దీంతో లగేజీతో బస్‌స్టాండ్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. ట్రాఫిక్‌లో గంటల తరబడి ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, బస్ మిస్ అవుతుందనే భయం కూడా ఉండదు.

ప్రైవేట్ హాస్టళ్లు, కాలేజీల్లో ఉండే విద్యార్థులు గ్రూప్‌గా ఏర్పడి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వారు ఉండే హాస్టల్ గేట్ ముందర నుంచే సొంత ఊళ్లకు నేరుగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ బస్సులో సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.

ఏ ప్రాంతం వారు ఎవరిని సంప్రదించాలి?

పటాన్‌చెరువు, బీరంగూడ, దుండిగల్, కూకట్‌పల్లి, మియాపూర్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, బాలానగర్ ప్రాంతాల వారు కూకట్‌పల్లి డివిజన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్‌ను 9956226144 నంబర్‌లో సంప్రదించాలి.

సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, ఏఎస్‌రావునగర్, రేతిఫైల్, తార్నాక, ఉప్పల్ ప్రాంతాల వారు సికింద్రాబాద్ డీఆర్‌ఎంను 9959226142 నంబర్‌లో సంప్రదించాలి.

దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, ఎల్బీనగర్, బడంగ్‌పేట్, ఆదిబట్ల, మిథాని, సరూర్‌నగర్ ప్రాంతాల వారు హయత్‌నగర్ డివిజన్ డీఆర్‌ఎంను 9959226136 నంబర్‌లో సంప్రదించాలి.

మెహదీపట్నం, రాజేంద్రనగర్, అత్తాపూర్, చార్మినార్, కోటి, కాచిగూడ, నారాయణగూడ ప్రాంతాల వారు చార్మినార్ డిప్యూటీ రీజినల్ మేనేజర్‌ను 9959226129 నంబర్‌లో సంప్రదించాలి.

మీ హాస్టల్, కాలేజీ లేదా కాలనీ నుంచి కనీసం 30 మంది ప్రయాణికులు ఒకే రూట్‌లో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంటే సంబంధిత డీఆర్‌ఎం నంబర్‌కు ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. ప్రయాణ తేదీ, సమయం, పికప్ పాయింట్, వెళ్లాల్సిన గమ్యస్థానం వివరాలను అధికారులకు తెలియజేయాలి. తద్వారా మీ ఇంటి వద్దకే లేదా హాస్టల్ ప్రాంగణానికే ఆర్టీసీ బస్సును రప్పించుకోవచ్చు.

దసరా పండుగ సందర్భంగా ప్రయాణ కష్టాలు లేకుండా సొంత ఊళ్లకు సురక్షితంగా చేరుకోవడానికి ఈ అవకాశాన్ని విద్యార్థులు, నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »