Cancer Day Awareness
-
క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
-
పొగాకు, అనారోగ్యకర జీవనశైలి, జంక్ ఫుడ్ వంటి అలవాట్లే క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు.
-
క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, ఆరోగ్యకరమైన ఆహారం క్యాన్సర్‌ను నివారించడంలో కీలకం.
హైదరాబాద్: ప్రస్తుత కాలంలో క్యాన్సర్ అనే పేరు వింటేనే సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే, క్యాన్సర్ అంటే మరణం కాదు.. అవగాహనతో దీనిని ఎదుర్కోవచ్చు. క్యాన్సర్ పట్ల ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రతి ఏటా ఫిబ్రవరి 4న ‘ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం’ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, నివారణ మార్గాలపై వైద్య నిపుణులు అందిస్తున్న విలువైన సమాచారం మీకోసం..
క్యాన్సర్ అంటే ఏమిటి?
సాధారణంగా మన శరీరంలోని కణాలు ఒక క్రమపద్ధతిలో పెరుగుతాయి. కానీ, ఎప్పుడైతే కొన్ని కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా విభజన చెందుతాయో, అది క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఈ కణాలు గడ్డలుగా (Tumors) మారి ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తాయి. రక్తం, ఎముకలు, చర్మం ఇలా ఏ అవయవానికైనా ఈ వ్యాధి సోకవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, రొమ్ము, కడుపు, ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి.
ముందస్తు లక్షణాలను :
క్యాన్సర్ చికిత్సలో అతి ముఖ్యమైనది వ్యాధిని ‘ప్రారంభ దశ’లోనే గుర్తించడం. వైద్య నిపుణుల ప్రకారం ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి డైటింగ్ లేదా వ్యాయామం చేయకుండానే అకస్మాత్తుగా బరువు తగ్గిపోతుంటే అది క్యాన్సర్ సంకేతం కావచ్చు. రొమ్ము భాగంలో లేదా చర్మం కింద అసాధారణ గడ్డలు, వాపులు కనిపించడం. విశ్రాంతి తీసుకున్నా తగ్గని నిరంతర బలహీనత, నీరసం. చర్మం రంగు మారడం, పుట్టుమచ్చల పరిమాణం పెరగడం లేదా తగ్గని గాయాలు. రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం, నిరంతర జ్వరం, రక్తహీనత, తగ్గని కడుపు నొప్పి.
క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు:
- మన జీవనశైలిలో చేసే చిన్న చిన్న తప్పులే ఈ వ్యాధికి కారణమవుతున్నాయి.
- పొగాకు వాడకం: సిగరెట్లు, బీడీలు లేదా పొగాకు నమలడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు అధికం.
- జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, అస్తవ్యస్తమైన జీవనశైలి. కుటుంబంలో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. రేడియేషన్, హానికర రసాయనాల ప్రభావం.
నివారణే మార్గం:
క్యాన్సర్ ఒక సైలెంట్ కిల్లర్. దీనిని జయించాలంటే సరైన సమయంలో చికిత్స అందాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సల ద్వారా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది.
క్యాన్సర్ లక్షణాలపై శ్రద్ధ వహించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ మహమ్మారిని దూరం పెట్టవచ్చు. ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నాడు మనమందరం క్యాన్సర్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేద్దాం.

