వైరస్‌లను అడ్డుకునే జిగురు తరహా ప్రోటీన్లు.. సీసీఎంబీ కీలక అధ్యయనం..

వైరల్‌ (Viral) ఆర్‌ఎన్‌ఏ (RNA) ను బంధించి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే జెల్‌లాంటి ప్రోటీన్‌ నిర్మాణాలను సీసీఎంబీ (CCMB) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అధ్యయనం పంటల సాగులో వచ్చే తెగుళ్లను నివారించడంతో పాటు భవిష్యత్‌ వైద్య పరిశోధనలకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

CCMB
వైరస్‌లను అడ్డుకునే జిగురు తరహా ప్రోటీన్లు.. సీసీఎంబీ కీలక అధ్యయనం..

CCMB | మొక్కలు వైరస్‌ల దాడిని ఎలా తిప్పికొడతాయన్న అంశంపై హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. వైరస్‌లను బంధించి నిర్వీర్యం చేసేందుకు మొక్కలు జిగురు మాదిరిగా పనిచేసే ద్రవరూప ప్రోటీన్ బిందువులను వినియోగిస్తాయని ఇప్పటికే తెలిసిన విషయమే. అయితే, ఈ ప్రక్రియ కణస్థాయిలో ఎలా జరుగుతుందో తాజా పరిశోధన వెల్లడించింది. డాక్టర్‌ మందార్‌ వీ దేశ్‌ముఖ్‌ నేతృత్వంలోని బృందం చేసిన ఈ అధ్యయనం జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ ((JACS)లో ప్రచురితమైంది. చాలా వైరస్‌లు తమ జన్యు పదార్థంగా డబుల్‌ స్ట్రాండెడ్‌ ఆర్‌ఎన్‌ఏను కలిగి ఉంటాయి.

Read Also : బల పరీక్షలో నెగ్గిన విజయ్‌ ప్రభుత్వం.. జ్యోతిష్యుడిని ఓఎస్‌డీగా నియమించడంపై ఆగ్రహం..!

వైరస్‌ సోకినప్పుడు మొక్కలు ప్రత్యేకమైన ఆర్‌ఎన్‌ఏ (RNA)-బైండింగ్‌ ప్రోటీన్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఇవి వైరస్‌ జన్యు పదార్థాన్ని గుర్తించి దానికి అతుక్కుంటాయి. ఈ ప్రోటీన్లు వైరస్‌ ప్రతిరూపణ జరిగే ప్రాంతాల్లో చేరి, వైరల్‌ ఆర్‌ఎన్‌ఏను కట్టడి చేస్తాయి. దీంతో వైరస్‌ తనను తాను పునరుత్పత్తి చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఈ ప్రోటీన్లు తాళం-తాళంచెవి విధానంలో వైరల్‌ ఆర్‌ఎన్‌ఏకు అతుక్కుంటాయని భావించేవారు. అయితే సీసీఎంబీ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనలో మరింత సంక్లిష్టమైన నిర్మాణం వెలుగు చూసింది.

జెల్‌లా మారే ప్రోటీన్‌ బిందువులు

న్యూక్లియర్‌ మాగ్నెటిక్‌ రెసొనెన్స్‌ స్పెక్ట్రోస్కోపీ, ఫ్లోరోసెన్స్‌ మైక్రోస్కోపీ, మాలిక్యులర్‌ డైనమిక్స్‌ సిమ్యులేషన్స్‌ వంటి ఆధునిక పద్ధతులతో శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎన్‌ఏ-బైండింగ్‌ ప్రోటీన్లలో ప్రత్యేకమైన మడత నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు. ఈ నిర్మాణంలో విద్యుత్‌ ఆవేశాలు ప్రోటీన్‌ ఉపరితలంపై జిగురు మాదిరి ప్రాంతాలను సృష్టిస్తాయి. ధన, రుణ ఆవేశాల పరస్పర ఆకర్షణ వల్ల ప్రోటీన్లు ఒకదానికొకటి అతుక్కొని దట్టమైన జెల్‌ తరహా బిందువులుగా మారతాయి.

Read Also : బండి సంజ‌య్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసు జారీ చేయాలి.. క‌విత డిమాండ్‌

ఈ బిందువులు వైరల్‌ ఆర్‌ఎన్‌ఏను బంధించి, అది ప్రతిరూపణ వ్యవస్థతో కలవకుండా అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ అధ్యయనం రచయిత డాక్టర్‌ జయదీప్‌ పాల్‌ మాట్లాడుతూ.. ‘ఈ ప్రోటీన్లు అణు స్థాయిలో జిగురులా పనిచేస్తాయి. జెల్‌లాంటి బిందువులను ఏర్పరచి వైరల్‌ ఆర్‌ఎన్‌ఏను సమర్థంగా బంధిస్తాయి’ అని తెలిపారు. శాస్త్రవేత్తల ప్రకారం.. బయోమాలిక్యులర్‌ కండెన్సేట్స్‌గా పిలిచే ఈ నిర్మాణాలు జీవకణాల పనితీరును అర్థం చేసుకునే విధానంలో కొత్త దిశను చూపుతున్నాయి. కేంద్రకం, మైటోకాండ్రియా వంటి స్థిర నిర్మాణాలకే పరిమితమని భావించిన కణాల్లో, ఇప్పుడు ద్రవరూపంలో మారుతూ ఉండే పొరలులేని నిర్మాణాల ప్రాధాన్యం పెరుగుతోందని డాక్టర్‌ దేశ్‌ముఖ్‌ పేర్కొన్నారు.

వ్యవసాయానికి, వైద్య రంగానికి ఉపయోగం..

ఈ పరిశోధన వ్యవసాయ రంగానికి కూడా కొత్త అవకాశాలను తెరుస్తోంది. వైరస్‌లను తట్టుకునే సహజ రోగనిరోధక శక్తి గల పంట రకాలను అభివృద్ధి చేయడంలో ఈ అధ్యయనం ఉపయోగపడే అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ పంటనష్టాలకు కారణమయ్యే వైరల్‌ వ్యాధులను నియంత్రించేందుకు ఇది తోడ్పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక వైద్య రంగంలోనూ ఈ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. మానవ కణాల్లో ఏర్పడే హానికరమైన ప్రోటీన్‌ గడ్డలను కరిగించడం, కణితులను రక్షించే ద్రవ అవరోధాలను విచ్ఛిన్నం చేయడం వంటి అంశాల్లో ఈ పరిశోధన భవిష్యత్‌లో ఉపయోగపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

Read Also : భ‌విష్య‌త్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »