LPG cylindes Price Hike | దేశీయ చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల ఎల్పీజీ (LPG) సిలిండర్ల ధరలను మరోసారి భారీగా పెంచాయి. పెంచిన ధరలు జూన్ ఒకటి నుంచి అమలులోకి వచ్చినట్లు పేర్కొన్నాయి. అయితే, సాధారణ గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం వల్ల కోట్లాది కుటుంబాలకు కొంత ఊరట లభించింది. తాజా నిర్ణయం ప్రకారం 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.42 వరకు పెంచారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఒక కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,113.50కు చేరుకుంది. కోల్‌కతాలో ఒక్కో సిలిండర్‌పై రూ.53.50 పెరిగి రూ.3,255.50కి చేరుకుంది. అలాగే, చిన్న వ్యాపారులు, తాత్కాలిక ఆహార విక్రయ కేంద్రాలు, చిన్న హోటళ్లు వినియోగించే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (FTL) సిలిండర్ ధరను కూడా రూ.11 పెంచారు. దీంతో ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.821.50కు చేరింది.
Read Also : భారతీయ యువతను వెంటాడుతున్న యాంగ్జైటీ.. మూడు దశాబ్దాల్లో భారీగా పెరిగిన సమస్యలు..!
హోటళ్లు, రెస్టారెంట్లపై అదనపు భారం
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, క్యాటరింగ్ సంస్థలు, టీ స్టాల్స్, చిన్నతరహా ఆహార వ్యాపారాలు ఉపయోగిస్తుంటాయి. ధరల పెంపుతో ఈ రంగాల నిర్వహణ వ్యయం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ముడి సరుకుల ధరలు, కూరగాయల ధరలు, కార్మిక వ్యయం, విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ ధరల పెంపు మరో అదనపు భారం కానుంది. రోజుకు అనేక సిలిండర్లు వినియోగించే పెద్ద హోటళ్లకు ఈ పెంపు గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని చూపే అవకాశముంది. గ్యాస్ ధరల పెంపు దీర్ఘకాలం కొనసాగితే దాని ప్రభావం నేరుగా ఆహార పదార్థాల ధరలపై పడే అవకాశం ఉందని రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత నెలలోనే సిలిండర్ ధరను ఏకంగా ఒకేసారి రూ.వెయ్యి వరకు పెంచింది. దాంతో హోటళ్లు, రెస్టారెంట్లు తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు ధరలను పెంచాయి. పెంచిన ధరల ప్రభావం సామాన్యులపై పడుతోంది. తాజాగా మళ్లీ ధరలు పెంచడంతో మరోసారి ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Read Also : టాలీవుడ్‌కు ఏపీ నుంచే 75శాతం ఆదాయం.. బాలకృష్ట సంచలన వ్యాఖ్యలు..!
గ్యాస్ ధరల పెంపు సవాలుగా..
చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫుడ్ కోర్టులు, మొబైల్ ఫుడ్ వ్యాపారాలు ఇప్పటికే లాభాల మార్జిన్ తక్కువగా ఉండటంతో గ్యాస్ ధరల పెంపు వారికి కొత్త సవాలుగా మారింది. వినియోగదారులపై అదనపు భారం మోపకుండా వ్యాపారం కొనసాగించడం కష్టమని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు నాలుగుసార్లు పెంచాయి. వీటి ప్రభావంపై ధరలపై పడుతోంది. అదే సమయంలో వరుసగా పెరుగుతూ వస్తున్న సిలిండర్ల ధర పెంపు కారణంగా నెలవారీ ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కొందరు వ్యాపారులు ధరలు పెంచాల్సిన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే, 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలను యథాతథంగా కొనసాగించడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉపశమనం ఇచ్చినట్లయ్యింది. ఇటీవల పెరుగుతున్న జీవన వ్యయం మధ్య గ్యాస్ ధరలు గృహిణులు, మధ్య తరగతి కుటుంబాలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించిన ఈ కొత్త ధరలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలను దృష్టిలో పెట్టుకొని ఎల్పీజీ ధరల్లో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also : ఇక మూడుజోన్లకే దక్షిణ మధ్య రైల్వే.. జూన్ నుంచి కొత్త పరిపాలన వ్యవస్థ..!


