Lancet study | గడిచిన కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతూ వస్తోంది. మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌లాంటి శారీరక సమస్యలతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలు సైతం వేగంగా పెరుగుతున్నాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయుల్లో ఆందోళన (Anxiety), డిప్రెషన్ వంటి సమస్యలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని ప్రముఖ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ వెల్లడించింది. ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ’ ఆధారంగా రూపొందించిన నివేదికలో భారత్‌లో యాంగ్జైటీ డిసార్డర్ కేసులు 1990 నుంచి 2023 మధ్య 123.5 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 1990లో ప్రతి లక్ష మందిలో 2,591 మందికి మానసిక సమస్యలు ఉండగా.. ఈ సంఖ్య 2023 నాటికి 5,792కు చేరింది. ముఖ్యంగా యువతలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుండడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also : ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. భారీగా పెట్టుబడులు పెడుతున్న ద్విచక్ర వాహనాల కంపెనీ..!
యువతలో మానసిక ఒత్తిడి..
ఈ అధ్యయనాన్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవల్యూషన్.. యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ పరిశోధకులతో కలిసి నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 కోట్ల మంది మానసిక ఆరోగ్య సమస్యలతో జీవిస్తున్నారని అధ్యయనం తెలిపింది. 1990తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ప్రస్తుతం గుండెజబ్బులు, క్యాన్సర్, కండరాలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులను మించి మానసిక సమస్యలే ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి ప్రధాన కారకాలుగా మారాయని నివేదిక హెచ్చరించింది. మానసిక సమస్యలే కాకుండా భారతీయుల్లో మరిన్ని సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. 1990లో ప్రతి లక్ష మందిలో 316 మందికి స్కిజోఫ్రేనియా కేసులు నమోదవగా.. 2023 నాటికి అవి 321కి చేరాయి. మేజర్ డిప్రెసివ్ డిసార్డర్ కేసులు 2,147 నుంచి 2,799కి పెరిగాయి. డిస్టైమియా కేసులు కూడా 902 నుంచి 948కు పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది.
Read Also : గంటకు 280 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ట్రైన్ ఇదే..! బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ రివీల్..!
కరోనా తర్వాత మరింత పెరిగిన సమస్య
కోవిడ్ మహమ్మారి తర్వాత ఆంగ్జైటీ, డిప్రెషన్ కేసులు మరింతగా పెరిగాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌లు, ఉద్యోగ భద్రతపై భయాలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం, సోషల్ రిలేషన్స్ తగ్గిపోవడం తదితర అంశాలు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొంటున్నారు. అలాగే, మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగం, సైబర్ బుల్లీయింగ్, చదువుల ఒత్తిడి, కెరీర్‌పై భయం యువతలో ఆందోళనను మరింత పెంచుతున్నాయని అధ్యయనం వెల్లడించింది. ఆందోళనకర అంశం ఏమిటంటే.. 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల యువతలో మానసిక ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండడం. ఈ వయసులో భావోద్వేగ ఒత్తిడి, భవిష్యత్‌పై అనిశ్చితి, సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Read Also : అమరావతిలోకి మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ.. క్వాంటమ్ వ్యాలీ లాబోరేటరీని నెలకొల్పనున్న డీఆర్‌డీవో..!
లక్షణాలు ఏంటీ?
యాంగ్జైటీ అనేది ఒత్తిడికి శరీరం ఇచ్చే సహజ ప్రతిస్పందన. అయితే, ఇది అధికమైతే తీవ్ర భయం, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతినొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రకారం.. యాంగ్జైటీ ఎప్పుడూ అప్రమత్త స్థితిలో ఉంచుతుందని.. దాంతో ఎలాంటి ప్రమాదం లేకపోయినా ఓ వ్యక్తి ఎప్పుడూ భయం, ఒత్తిడిలో ఉంటాడని పేర్కొంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, సరిపడ నిద్రపోవడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా, మొబైల్ స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. యాంగ్జైటీ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిదని సూచించారు.
Read Also : ఆధార్ యూజర్లకు గుడ్‌న్యూస్.. అప్‌డేట్ గడువును మరో ఏడాది పొడిగించిన ఉడాయ్..!


