ఒకే దేశం.. ఒకే ఎన్నిక దిశగా కేంద్రం అడుగులు.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం పొడిగించే ఛాన్స్‌..!

దేశంలో ఒకే దేశం–ఒకే ఎన్నికలు (One Nation One Election) విధానం అమలు దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. 2029 నుంచి తొలి దశ ప్రారంభించి.. 2034 నాటికి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే లక్ష్యంతో జేపీసీ (JPC) సమగ్ర రోడ్‌మ్యాప్‌పై కసరత్తు చేస్తోంది.

ఒకే దేశం.. ఒకే ఎన్నిక దిశగా కేంద్రం అడుగులు.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం పొడిగించే ఛాన్స్‌..!

One Nation-One Election | దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ‘జమిలి ఎన్నికలు’ దిశగా కేంద్ర ప్రభుత్వం మళ్లీ వేగం పెంచుతోంది. ఈ వ్యవస్థను దశలవారీగా అమలు చేయాలన్న ప్రతిపాదనపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లో లోతైన చర్చలు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా మార్పు తీసుకురావడం కంటే రెండు విడతలుగా ముందుకు సాగితేనే ఆచరణ సాధ్యమని కమిటీ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. 2029 నుంచి ప్రారంభించి, 2034 నాటికి దేశవ్యాప్తంగా ఒకే సమయానికి ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ప్రణాళిక ప్రకారం జమిలి ఎన్నికలను పూర్తిగా అమలు చేయడానికి రెండు దశలు ప్రతిపాదించారు. మొదటి దశ 2029 లోక్‌సభ ఎన్నికలతో కలిపి అమలులోకి రావొచ్చు. అప్పటికి సుమారు 20 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కూడా అదే సమయంలో నిర్వహించే అవకాశం ఉందని అంచనా. దాంతో దేశంలో ఎన్నికల క్యాలెండర్‌ను ఒకే చట్రంలోకి తీసుకురావడానికి తొలి అడుగు పడుతుంది. రెండో దశలో 2034 నాటికి మిగిలిన రాష్ట్రాలను కూడా ఈ వ్యవస్థలోకి చేర్చి, దేశమంతటా ఒకేసారి పోలింగ్ నిర్వహించాలన్నది లక్ష్యం. దశలవారీగా ముందుకు వెళ్లడం వల్ల పాలనాపరమైన ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

Read Also : ఏపీలో కొత్త‌గా 38 ఎంఎస్ఎంఈ పార్కులు.. గ్రోత్ స‌మ్మిట్‌లో చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌..

రాష్ట్రాల పదవీకాలంపై మార్పుల ప్రభావం

ఈ ప్రతిపాదనలో అత్యంత సున్నితమైన అంశం రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాల సర్దుబాటు. ఒకే ఎన్నికల చక్రంలోకి తీసుకురావాలంటే కొన్ని రాష్ట్రాల్లో పదవీకాలాన్ని పొడిగించాల్సి వస్తుంది. మరికొన్ని రాష్ట్రాల పదవీకాలాన్ని తగ్గించాల్సిన పరిస్థితి ఉంటుంది. 2028 ఎలక్ట్రోరల్‌ సైకిల్‌లోకి వచ్చే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ కాలపరిమితిని సుమారు ఐదు నెలల నుంచి ఏడాది వరకు పొడిగించే అవకాశం ఉంది. ఇక 2029లో ఎన్నికల షెడ్యూల్‌కు సరిపోయే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం పదవీకాలంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని అంచనా. అదే సమయంలో 2030–31లో ఎన్నికలు జరగాల్సిన బిహార్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఢిల్లీ, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ కాలపరిమితిని ఒకటి నుంచి రెండేళ్ల వరకు తగ్గించాల్సిన పరిస్థితి రావొచ్చనే చర్చ సాగుతోంది. ఈ మార్పులు సాధ్యమేనా అన్న ప్రశ్నపై నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంలో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయని, ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీల కాలపరిమితిని సవరించవచ్చని వారు సూచిస్తున్నారు. గతంలో కూడా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల కాలవ్యవధుల్లో అనేక సందర్భాల్లో మార్పులు జరిగిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అయితే, ఇంత భారీ స్థాయి వ్యవస్థ మార్పు కోసం కేవలం చట్టపరమైన ఏర్పాట్లు సరిపోవని, విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం కూడా అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read Also : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి నుంచి కొత్తగా వీక్లీ ట్రైన్స్‌..!

చారిత్రక నేపథ్యం..

దేశంలో 1952 నుంచి 1967 వరకు లోక్‌సభతో పాటు చాలా రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ కాలంలో ఎన్నికల ప్రక్రియ సమన్వయంగా కొనసాగింది. అయితే 1967 తర్వాత రాజకీయ పరిస్థితులు మారడంతో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మధ్యలోనే కూలిపోవడం, అసెంబ్లీలు రద్దు కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1970లో లోక్‌సభ కూడా కాలపరిమితికి ముందే రద్దు కావడంతో జమిలి ఎన్నికల వ్యవస్థకు విరామం వచ్చింది. 1971 మధ్యంతర లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రాల్లో ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరగడం ప్రారంభమైంది. అప్పటి నుంచి సంకీర్ణ రాజకీయాలు, రాష్ట్రపతి పాలన, ముందస్తు ఎన్నికలు వంటి కారణాలతో ఈ గ్యాప్ మరింత పెరిగింది. జమిలి ఎన్నికలపై రాజకీయ వర్గాలు, నిపుణుల మధ్య స్పష్టమైన విభేదాలు కనిపిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రభుత్వాలు నిరంతర పాలనపై దృష్టి పెట్టగలవని, తరచూ ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి పనులు ఆగిపోకుండా ఉంటాయని అనుకూలులు వాదిస్తున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణ ఖర్చు, యంత్రాంగంపై ఒత్తిడి కూడా తగ్గుతుందని వారు చెబుతున్నారు. అదే సమయంలో వ్యతిరేక వర్గం మాత్రం ఇది ఫెడరల్ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రాల ప్రత్యేక సమస్యలు జాతీయ రాజకీయాల ప్రభావంలో మసకబారే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రజా తీర్పు విభిన్న సమయాల్లో రావడం వల్లే ప్రజాస్వామ్యానికి బలం వస్తుందని వారి వాదన. ప్రస్తుతం ఈ ప్రతిపాదన చుట్టూ చర్చలు కొనసాగుతున్నప్పటికీ, తుది రూపు తీసుకోవడానికి ఇంకా విస్తృత స్థాయి రాజకీయ చర్చలు, సమన్వయం అవసరమని స్పష్టమవుతోంది.

Read Also : చంద్రుడి ద‌క్షిణ ధ్రువంలో మూన్ బేస్ ఏర్పాటు చేయ‌నున్న నాసా.. ప్రైవేటు సంస్థ‌ల‌తో కీల‌క ఒప్పందాలు..!

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »