New Trains | తెలంగాణ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి కొత్తగా రెండు వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం పండుగలు, సెలవులు, ప్రత్యేక దినాల్లో తిరుమల మార్గంలో రైళ్లలో భారీగా రద్దీ ఉంటోంది. రిజర్వేషన్ టికెట్లు దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సర్వీసులు ప్రారంభించడంతో ప్రయాణ భారం కొంతవరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
Read Also : ఇక మూడుజోన్లకే దక్షిణ మధ్య రైల్వే.. జూన్ నుంచి కొత్త పరిపాలన వ్యవస్థ..!
తిరుపతికి వీక్లీ రైలు..
ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న సర్వీసును రైల్వే శాఖ రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చింది. 17444 నంబర్ గల చర్లపల్లి–తిరుపతి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 29 నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అదే రైలు తిరుగుప్రయాణంలో 17443 నంబర్ రైలు ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు చర్లపల్లికి చేరుతుంది. ఈ సర్వీసు వల్ల వారాంతాల్లో తిరుమలకు వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యం కలగనుంది.
తిరుచానూరుకు మరో ప్రత్యేక సర్వీసు
తిరుమల యాత్రికులను దృష్టిలో పెట్టుకుని చర్లపల్లి–తిరుచానూరు మధ్య మరో వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. 17059 నంబర్ గల ఈ రైలు ప్రతి ఆదివారం రాత్రి 9.30 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17060 నంబర్ రైలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటలకు తిరుచానూరు నుంచి బయలుదేరి, మంగళవారం ఉదయం 8 గంటలకు చర్లపల్లికి చేరుతుంది. ఈ కొత్త రైలులో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వివిధ తరగతుల కోచ్‌లను ఏర్పాటు చేశారు. రెండు ఏసీ 2-టైర్, ఏడు ఏసీ 3-టైర్, ఏడు స్లీపర్ క్లాస్, నాలుగు జనరల్ బోగీలు అందుబాటులో ఉంటాయి. దాంతో సాధారణ ప్రయాణికుల నుంచి కుటుంబాలతో వెళ్లే భక్తుల వరకు అందరికీ సౌకర్యవంతమైన ప్రయాణం కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
Read Also : రసవత్తరంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్.. నాలుగో బెర్త్ కోసం బరిలో నాలుగు జట్లు..!
భక్తులకు భారీ ఊరట
ప్రత్యేకంగా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు, విద్యార్థులు, ఉద్యోగులు ఈ రెండు కొత్త రైలు సర్వీసుల వల్ల లాభపడే అవకాశం ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో రద్దీ తగ్గడంతో పాటు చర్లపల్లి టెర్మినల్ వినియోగం కూడా పెరుగుతుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. తిరుమల మార్గంలో ప్రయాణించే వారికి ఇది మరింత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది. ఆయా రైలు సేవలను భక్తులు ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.
Read Also : కాంగ్రెస్ సర్కారు తెలంగాణ గొంతు కోసేందుకు రెడీ అయ్యింది.. మాజీ మంత్రి సింగిరెడ్డి విమర్శలు..


