SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 25, 26 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మె కారణంగా రెండురోజుల పాటు బ్యాంకు సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉండడంతో బ్యాంక్ యాజమాన్యం ఫెడరేషన్‌తో చర్చలు జరిపింది. ఈ క్రమంలో రెండు రోజుల పాటు నిర్వహించాల్సిన సమ్మెను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగ సంఘం తాత్కాలికంగా వాయిదా వేసింది. ఉద్యోగ సంఘ ప్రతినిధులు, బ్యాంక్ యాజమాన్యం మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ అధికారికంగా ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.
Read Also : ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులకు కిసాన్ సమ్మానిధి వస్తుందా..? త్వరలోనే రైతుల ఖాతాల్లోకి 23వ విడత నిధులు..!
ఈ మేరకు ఖాతాదారులకు బ్యాంక్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘మే 25, 26 తేదీల్లో ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) ప్రకటించిన సమ్మెను వాయిదా వేశారు. అన్ని శాఖలు సాధారణంగా పని చేస్తాయి. బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి’ అని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఉద్యోగుల పలు డిమాండ్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఫెడరేషన్ తెలిపింది. ఉద్యోగుల కొరత, శాశ్వత ఉద్యోగాల ఔట్‌సోర్సింగ్, పెన్షన్ సంబంధిత సమస్యలు, వేతన వ్యత్యాసాలు వంటి అంశాలు దీర్ఘకాలంగా పరిష్కారం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తం 16 అంశాల డిమాండ్ల చార్టర్‌ను ఉద్యోగ సంఘం సమర్పించింది. మెసెంజర్లు, గార్డుల నియామకం, ఖాళీల భర్తీ, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని నిలిపివేయడం, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో మరింత సౌలభ్యం కల్పించడం వంటి డిమాండ్లు ఇందులో ఉన్నాయి.
Read Also : పట్టపగలే చుక్కలు కనిపించేలా అలుముకోనున్న చీకట్లు..! శతాబ్దంలోనే సుదీర్ఘ సూర్యగ్రహణం..!
2019 తర్వాత నియమితులైన ఉద్యోగులకు అంతర సర్కిల్ బదిలీల అవకాశాలు కల్పించాలని కూడా ఫెడరేషన్ డిమాండ్ చేసింది. బ్రాంచ్‌లలో గార్డుల కొరతతో భద్రతాపరమైన సమస్యలు పెరుగుతున్నాయని, పని ఒత్తిడి గణనీయంగా పెరిగిందని ఉద్యోగ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. వేతన సవరణల్లో కూడా అధికారులకు, వర్క్‌మెన్ సిబ్బందికి మధ్య తేడాలున్నాయని ఆరోపించింది. సమ్మెకు ముందు దేశవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, సోషల్ మీడియా ప్రచారం చేపట్టాలని కూడా ఫెడరేషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, చివరికి బ్యాంక్ యాజమాన్యంతో జరిగిన చర్చల అనంతరం సమ్మెను తాత్కాలికంగా ఉపసంహరించడంతో, కోట్లాది ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిస్థితి సద్దుమణిగినట్లయ్యింది.
Read Also : 14 ఏళ్లు నరకం అనుభవించా.. కన్నీటి పర్యంతమైన హీరో జయం రవి


