VD Satheesan | కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై గత పది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్ఠానం ముగింపు పలికింది. రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ను ఎంపిక చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు దీపా దాస్ మున్షీ, ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీలో విస్తృత చర్చలు, అంతర్గత లాబీయింగ్ కొనసాగాయి. చివరికి కాంగ్రెస్ హైకమాండ్ సతీశన్ వైపే మొగ్గు చూపింది. ఈ నిర్ణయాన్ని రమేశ్ చెన్నితాలాకు రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి తెలియజేసినట్లు సమాచారం. అలాగే కేసీ వేణుగోపాల్‌తో జరిగిన సమావేశంలోనూ తుది నిర్ణయం ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read Also : థ్యాంక్స్ సీఎం రేవంత్..! సీఎం రేవంత్ చిత్రపటానికి 2008 డీఎస్సీ టీచర్స్ పాలాభిషేకం..!
ఇద్దరిని పక్కన పెట్టి..
సీఎం రేసులో ఉన్న సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితాలా పేర్లను పక్కన పెట్టడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త చర్చ మొదలైంది. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్ వైపే మొగ్గు చూపినప్పటికీ, ప్రజల్లో సతీశన్‌కు ఉన్న బలమైన మద్దతు, గత ఐదేళ్లుగా పార్టీకి ప్రధాన ముఖంగా నిలిచిన పాత్ర నిర్ణయంలో కీలకంగా మారిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 62 ఏళ్ల వీడీ సతీశన్ వృత్తిరీత్యా న్యాయవాది. 2001లో పారావూర్ నుంచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఆయన, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సభలో తన పదునైన ప్రసంగాలు, గణాంకాలతో కూడిన విమర్శలతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వర్గ రాజకీయాలకు అతీతంగా ఉండటం కూడా ఆయన ఎదుగుదలకు దోహదపడింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ ఎదుర్కొన్న పరాజయం తర్వాత ఆయన ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యారు. ఆ పదవిలో ఉండి గోల్డ్ స్మగ్లింగ్ వివాదం నుంచి ఏఐ కెమెరాల వ్యవహారం వరకు పినరయి విజయన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ విపక్షాన్ని బలంగా నడిపించారు. అదే సమయంలో యూడీఎఫ్ 102 సీట్ల విజయానికి వ్యూహాత్మక నాయకత్వం వహించిన నేతగా ఆయనను పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Also : రాయదుర్గం భూములు వేలం వేయనున్న కాంగ్రెస్ సర్కారు..! ఒక్కో ఎకరానికి రూ.139 కోట్లు..!
ప్రతిపక్ష నేత నుంచి సతీశన్ వరకు..
పార్టీ అధికారికంగా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ అందరూ సతీశన్‌కే పదవి వస్తుందని భావించారు. అయితే, చివరి దశలో కేసీ వేణుగోపాల్ రేసులోకి వచ్చారు. దాంతో సీఎం ఎంపిక కాస్త ఆలస్యమైంది. చివరికి ఏకాభిప్రాయంతో సతీశన్ ఎంపిక జరిగినట్లు సమాచారం. ప్రతిపక్ష నేత స్థానం నుంచి ముఖ్యమంత్రి పదవికి చేరుకుంటున్న వీడీ సతీశన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించడంతో పాటు ఎన్నికల పరాజయాల తర్వాత నిస్సత్తువగా ఉన్న పార్టీకి కొత్త ఊపునివ్వడం ఆయన ముందున్న ప్రధాన సవాల్‌గా భావిస్తున్నారు. వామపక్ష ప్రభుత్వ ఆధిపత్యాన్ని ఎదుర్కొనే వ్యూహాన్ని ఎలా రూపొందిస్తారన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
Read Also : జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎదురుదెబ్బ.. ఈడీ కేసులో పిటిషన్ వెనక్కి తీసుకున్న శ్రీలంకన్ బ్యూటీ..!


