రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఒక చారిత్రక ఘట్టం నమోదైంది. నల్గొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నాగిళ్ల కావేరి సుధాకర్ విజయం సాధించారు. ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన అభ్యర్థి రాష్ట్రంలో కౌన్సిలర్‌గా ఎన్నిక కావడం ఇదే తొలిసారి కావడం ప్రత్యేకత సంతరించుకుంది.
ఈ వార్డులో సీపీఐ మద్దతుతో నగేశ్ పోటీ చేసినప్పటికీ, నాగిళ్ల కావేరి సుధాకర్ 109 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినా, ప్రజల మద్దతు ఆమె వైపు మళ్లడం గమనార్హం. ఈ విజయం ట్రాన్స్‌జెండర్ సమాజానికి మాత్రమే కాకుండా సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.
కాంగ్రెస్ కైవసం..
మరోవైపు చిట్యాల మున్సిపాలిటీ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 12 వార్డుల్లో 9 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ పార్టీ కేవలం రెండు వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి నాగిళ్ల కావేరి సుధాకర్ గెలుపొందడం ఎన్నికల ప్రత్యేకతగా నిలిచింది.
వార్డు వారీగా విజేతలు
1వ వార్డు: నాగిళ్ల కావేరి సుధాకర్ (ట్రాన్స్‌జెండర్ – ఇండిపెండెంట్)
2వ వార్డు: బీఆర్ఎస్ – అజీమ్
3వ వార్డు: కాంగ్రెస్ – గాలి యాదమ్మ లింగయ్య
4వ వార్డు: కాంగ్రెస్ – కోనేటి ఎల్లయ్య
5వ వార్డు: కాంగ్రెస్ – గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు
6వ వార్డు: కాంగ్రెస్ – జెరిపోతుల సత్యనారాయణ
7వ వార్డు: కాంగ్రెస్ – దేశపాక రాజేశ్ లత
8వ వార్డు: కాంగ్రెస్ – కుక్కల మోహన్
9వ వార్డు: కాంగ్రెస్ – ఏర్పుల పరమేశ్
10వ వార్డు: బీఆర్ఎస్ – నిమ్మనగోటి శ్రీను
11వ వార్డు: కాంగ్రెస్ – బొబ్బల రాంరెడ్డి
12వ వార్డు: కాంగ్రెస్ – పందిరి గీతా రమేశ్
ఈ ఫలితాలతో చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించగా, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి గెలుపు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. సామాజిక వర్గాల ప్రతినిధిత్వానికి ఇది ఒక శుభసూచకంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.