వాంఖడేలో హై స్కోరింగ్ థ్రిల్లర్.. ముంబైపై ఆర్సీబీ విజయం, టిమ్ డేవిడ్ ప్రవర్తనతో చెల‌రేగిన వివాదం

వాంఖడే స్టేడియంలో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ను ఓడించింది. మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది.

Virat Kohli and Phil Salt celebrating their partnership during RCB vs MI IPL 2026 match at Wankhede Stadium.
Virat Kohli and Phil Salt celebrating their partnership during RCB vs MI IPL 2026 match at Wankhede Stadium.

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్ అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. భారీ స్కోర్లతో సాగిన ఈ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (36 బంతుల్లో 78) మరియు విరాట్ కోహ్లి (38 బంతుల్లో 50) తొలి వికెట్‌కు 10.5 ఓవర్లలో 120 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత కెప్టెన్ రజత్ పాటిదార్ (20 బంతుల్లో 53) దూకుడుగా ఆడి స్కోర్‌ను మరింత పెంచాడు. చివర్లో టిమ్ డేవిడ్ (16 బంతుల్లో 34 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో ఆర్సీబీ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

బాల్ వివాదం…

చేజింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు మాత్రమే చేసి విజయానికి 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ముంబై బ్యాటర్లు పోరాడినా, లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. అయితే ఈ మ్యాచ్‌లో ఒక చిన్న వివాదం కూడా చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో టిమ్ డేవిడ్ భారీ సిక్సర్ కొట్టడంతో బంతి ఆకారం మారింది. దీంతో అంపైర్లు కొత్త బంతిని తీసుకురావాలని నిర్ణయించారు. ఈ సమయంలో బంతుల బాక్స్‌ను మైదానంలోకి తీసుకురాగానే, టిమ్ డేవిడ్ అందులోని ఒక బంతిని తీసుకుని గాల్లోకి ఎగరేస్తూ, దాని సీమ్ మరియు గ్రిప్‌ను పరీక్షించడం ప్రారంభించాడు.

అంపైర్ సీరియ‌స్..

అంపైర్ స్వరూపానంద్ కన్నూర్ పలుమార్లు బంతిని తిరిగి ఇవ్వాలని చెప్పినా, డేవిడ్ కొంతసేపు పట్టించుకోలేదు. తర్వాత మరో అంపైర్ వీరేందర్ శర్మ జోక్యం చేసుకుని వార్నింగ్ ఇవ్వడంతో డేవిడ్ బంతిని తిరిగి ఇచ్చాడు. ఈ సంఘటనతో కొద్దిసేపు మైదానంలో ఉద్రిక్తత నెలకొన్నా, తర్వాత రోహిత్ శర్మ సరదాగా మాట్లాడడంతో వాతావరణం చల్లబడింది.

ఈ ఘటనపై ఐపీఎల్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ప్రకారం, కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని నిబంధనల ప్రకారం బ్యాటర్‌కు బంతిని చెక్ చేసే హక్కు లేదని, టైమ్ వేస్ట్‌గా పరిగణించి జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లి మరో రికార్డును సృష్టించాడు. ముంబై ఇండియన్స్‌పై 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 37 బంతుల్లో అర్ధ శతకం సాధించిన కోహ్లి, తర్వాత క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కాలి మడమ సమస్య కారణంగా ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు ఆయన దూరంగా ఉన్నాడు.

Also read:

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »