భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో గోల్డ్ లోన్ల పేరుతో భారీ స్కామ్ కలకలం రేపుతోంది. సీఎస్‌బీ, శ్రీరామ్ ఫైనాన్స్, ముత్తూట్ సంస్థల ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. తాము లక్ష రూపాయల రుణం తీసుకుంటే రికార్డుల్లో మాత్రం రెండు లక్షలు, రెండు లక్షలు తీసుకున్నట్టుగా మూడు లక్షల వరకు లోన్ చూపిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు తెలియకుండానే అదనపు మొత్తాలతో రుణ ఖాతాలు సృష్టించుకున్నారని, లోన్ క్లోజ్ చేసేందుకు వెళ్లినప్పుడు అసలు తీసుకున్న మొత్తం కంటే కూడా ఎక్కువగా చెల్లించాలని సిబ్బంది కోరుతుండటంతో అనుమానం వచ్చిందని తెలిపారు.
శ్రీరామ్ ఫైనాన్స్‌లో నకిలీ రసీదుల వ్యవహారంపై, ముత్తూట్‌లో గోల్డ్ లోన్లు నెలల తరబడి క్లోజ్ కావడం లేదన్న అంశాలపై బాధితులు ఫిర్యాదులు చేశారు. అశ్వరావుపేట నియోజకవర్గంలో గోల్డ్ లోన్ల పేరుతో సుమారు మూడు కోట్ల వరకు మోసం జరిగి ఉండవచ్చని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒకే రోజు మూడు సంస్థలపై ఫిర్యాదులు రావడంతో అసలు ఎన్ని రుణ ఖాతాల్లో అవకతవకలు జరిగాయి, ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయి అన్నది దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది.
ఒక లక్ష రూపాయలు తీసుకున్న వారికి రెండు లక్షల రూపాయలు అని రాసుకోవడం, రెండు లక్షలు తీసుకున్న వారికి మూడు లక్షలు అని రాసుకోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా దొంగ రసీదులు ఎలా సృష్టించారు? ఇప్పటివరకు అధికారులు ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంలో అశ్వరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన ఈ ఘటనకు సంబంధించి గోల్డ్ మాఫియా మొత్తం కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అక్కడ నమ్మకస్తుడిగా పేరున్న లింగం శెట్టి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని నమ్ముకున్న పేదలు, మిడిల్ క్లాస్ ప్రజలు తమ అవసరాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లి గోల్డ్ లోన్ పెట్టి నగదు తీసుకునే సమయంలో ఆయన పరిచయమయ్యారని చెబుతున్నారు.
పంటలు సాగు చేసుకునేందుకు కావచ్చు లేదా ఇతరత్రా కార్యక్రమాలకు అవసరాల కోసం రుణాలు తీసుకునే సమయంలో సుబ్రహ్మణ్యం తనకు నమ్మకం ఉందని, తెలిసిన వ్యక్తినని చెప్పి మాయ మాటలు చెప్పినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వారి వద్ద నుంచి గోల్డ్, ఆధార్ కార్డులు తదితర వివరాలు తీసుకొని వాటిని మార్చి వేరే వారి పేర్లపై రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఒక వ్యక్తికి రూ.5 లక్షలు అవసరమని బాధితులు చెబితే, వారి వద్ద ఉన్న గోల్డ్‌కు సుమారు రూ.7 నుంచి రూ.8 లక్షలకు పైగా లోన్ వస్తుందని చెప్పి, వారికి రూ.5 లక్షలు ఇచ్చి మిగతా డబ్బులు తానే తీసుకున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఇది ఒకటి రెండు ఘటనలు కాదని, వంద మందికి పైగా బాధితులు ఉన్నారని, సుమారు రూ.3 కోట్లకు పైగా ఈ స్కామ్ జరిగినట్లు వివరాల్లోకి వస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు అశ్వరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఎక్కడా కేసు నమోదు కాలేదని పోలీసులు చెబుతున్నట్లు సమాచారం.
కానీ దీనిపై కొంత రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయ నేతలు రంగంలోకి దిగి దీన్ని సెటిల్ చేసే విధంగా చర్యలు చేపట్టడం, సుబ్రహ్మణ్యం కూడా బాధితులందరికీ త్వరలోనే న్యాయం చేస్తానని, డబ్బులు చెల్లిస్తానని చెప్పడం పలు వివాదాలకు, పలు అనుమానాలకు తావిస్తోంది.
నిజంగా బాధితులకు డబ్బులు చెల్లిస్తారా? లేదా రాజకీయ నేతలు రంగప్రవేశం చేసి వాటిని ఎగ్గొట్టే విధంగా, బాధితులనే కట్టుకునే విధంగా చర్యలు చేపడతారా? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా లోన్లు చాలా మందికి అవసరం. వడ్డీలు చెల్లిస్తూ బయట వ్యక్తుల దగ్గర నుంచి ఎందుకు తీసుకోరు అంటే నమ్మకం లేక. ఇలాంటి సంస్థల్లో ఎందుకు లోన్లు తీసుకుంటారు అంటే నమ్మకం ఉండి, ఇలాంటి అవకతవకలు చేయరు, ఇలాంటి మోసాలు చేయరు అనే నమ్మకం ఉంటుంది. ముత్తూట్ ఫైనాన్స్ కానివ్వండి, శ్రీరామ్ ఫైనాన్స్ కానివ్వండి.. వీటికి సంబంధించి ఎంతో పేరు ఉంది.
ఇలాంటి సంస్థల్లో లక్ష రూపాయలు లోన్ తీసుకున్న వారికి లక్ష రూపాయలు అదనంగా చార్జ్ చేయడం, రెండు లక్షలు తీసుకున్న వారికి మరో లక్ష అదనంగా చార్జ్ చేయడం వంటి ఆరోపణలు వస్తే ఇది ఎంత ఘోరమైన మోసం అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌కు తగ్గట్టుగా సంబంధిత సంస్థలు వ్యవహరించాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు.
అయితే ఈ వ్యవహారం వెనుక ఎవరో ఒక పొలిటిషియన్ హస్తం కూడా ఉండే ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే కేసులు బుక్ అయ్యాయని చెబుతున్నప్పటికీ, అశ్వరావుపేటలో శ్రీరామ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి సంస్థలకు సంబంధించి అసలు ఎవరు వెనుక ఉండి ఇలాంటి దందా మొత్తం నడిపించారన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.


