Harish Rao | కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వైద్య వ్యవస్థ ఎంత దారుణంగా కుప్పకూలిందో చెప్పడానికి తాజాగా జరిగిన తాండూరు, భద్రాచలం అమానవీయ ఘటనలే సజీవ సాక్ష్యాలని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు. నిరుపేదల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ఎందుకు ఇంత చులకన భావం? అంటూ ఆయన ప్రశ్నించారు. తాండూరు రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి పురిటి నొప్పులతో ఓ నిరుపేద గర్భిణీ ప్రాణాలతో పోరాడుతుంటే.. 108కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి దిక్కుతోచని పరిస్థితిలో రైల్వే ప్లాట్‌ఫాంపైనే ఆ తల్లి ఆడబిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఒక ఆటో డ్రైవర్ చూపించిన కనీస మానవత్వం, స్పందన కూడా ప్రభుత్వ యంత్రాంగానికి లేకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
Read Also : రైతు నోట్లో మట్టికొట్టారు.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ ఘాటు లేఖ..!
గర్భిణులకు అండగా ఉండాల్సిన 108 అంబులెన్సులు, అమ్మఒడి వాహనాలు ఎక్కడ? మాయమయ్యాయి? అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మరణించిన బంధువు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని వేడుకున్నా ఆసుపత్రి సిబ్బంది కనికరించలేదని హరీశ్‌రావు తెలిపారు. ప్రైవేట్ వాహనం మాట్లాడుకునే స్థోమత లేక ఆ నిరుపేద కుటుంబం మృతదేహాన్ని భుజాలపై మోస్తూ వీధుల గుండా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం ప్రతి మనసును కలిచివేస్తోందని ఆయన అన్నారు. ముగ్గురు రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఇంతటి దారుణం జరగడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ‘కేసీఆర్ ప్రభుత్వంలో పేదల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఉచిత ‘హర్స్’ వెహికిల్స్ (పరమపద వాహనాలు) ఏమయ్యాయి? ఎందుకు మూలన పడ్డాయి? అంటూ నిలదీశారు.
Read Also : మద్యం ప్రియులకు షాక్ ఇవ్వబోతున్న సర్కారు.. జూన్ నుంచి ధరల పెంపు..!
బతికించేందుకు 108 అంబులెన్సులు రావు.. చనిపోయాక కడసారి ఇంటికి తీసుకెళ్లేందుకు పరమపద వాహనాలు లేవు.. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే పాలన? అంటూ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషుల ప్రాణాలు అంటే ఈ ప్రభుత్వానికి గౌరవం లేదా? పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలకు అండగా ఉండే బాధ్యత లేదా? అంటూ నిలదీశారు. ఈ ఘటనలు యావత్ ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన అమానవీయ ఘటనలని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రచారాలకే పరిమితం కాకుండా ప్రజల అసలు సమస్యలను చూడాలని సూచించారు. భద్రాచలం ఘటనలో అమానవీయంగా వ్యవహరించిన ఆసుపత్రి అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 108 అంబులెన్సులు, పరమపద వాహన సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.


