ఆదిలాబాద్ జిల్లా భద్రత, ప్రజా భాగస్వామ్యం, సాంకేతిక వినియోగం కలయికతో రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా ఎదుగుతోందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పోలీస్ శాఖ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను సమీక్షించారు.
ఈ పర్యటనలో భాగంగా మొక్కల నాటే కార్యక్రమంతో ప్రారంభమైన డీజీపీ పర్యటన, చిన్నారుల ట్రాఫిక్ ట్రైనింగ్ పార్క్ ప్రారంభోత్సవం, డీ-అడిక్షన్ సెంటర్ సందర్శన, ఆదిలాబాద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇంటిగ్రేటెడ్ సీసీటీవీ మానిటరింగ్ సిస్టమ్ ప్రారంభంతో కొనసాగింది.
1,800కు పైగా కెమెరాలతో పటిష్ట నిఘా
ఆదిలాబాద్ పట్టణంలో ఇప్పటికే దాదాపు 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, గ్రామీణ ప్రాంతాల్లో మరో 1,200కుపైగా కెమెరాలను సమగ్ర నెట్‌వర్క్‌లో అనుసంధానించారు. ఈ కెమెరాలన్నింటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఒకే వేదికపై పర్యవేక్షించే విధానం అమల్లోకి వచ్చింది.
దీంతో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, అనుమానాస్పద కదలికల గుర్తింపు, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన మరింత సమర్థవంతంగా మారనుంది. స్మార్ట్ పోలీసింగ్ దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది కీలక అడుగుగా అధికారులు పేర్కొంటున్నారు.
పోలీస్ సమీక్షలో ప్రధాన అంశాలు
జిల్లా పోలీస్ సమీక్ష సమావేశంలో సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, కమ్యూనిటీ పోలీసింగ్ బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
ప్రస్తుతం సంప్రదాయ నేరాల కంటే సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరాన్ని డీజీపీ నొక్కి చెప్పారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ మోసాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
గ్రామస్థులతో ముఖాముఖి
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామసభలో భాగంగా తోష గ్రామాన్ని సందర్శించిన డీజీపీ, గ్రామస్తులు, యువత, ప్రజాప్రతినిధులతో నేరుగా మాట్లాడారు. గ్రామాల్లో రోడ్డు భద్రతా కమిటీల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు స్థానిక ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రతి గ్రామం స్వచ్ఛందంగా భద్రతా చర్యల్లో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
రోడ్డు ప్రమాదాల మరణాల్లో భారీ తగ్గుదల
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు డీజీపీ వెల్లడించారు. గత ఏడాది ఇదే కాలంలో 72 మంది ప్రాణాలు కోల్పోగా, ఈసారి ఆ సంఖ్య 48కి తగ్గింది.
ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు కాదని, వాటి వెనుక ప్రాణాలు నిలిచాయని, కుటుంబాలు రక్షించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు, కఠిన అమలు, ప్రజల సహకారం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వివరించారు.
కొత్త సవాళ్లు.. కొత్త వ్యూహాలు
తెలంగాణ ఒకప్పుడు తీవ్రవాదం (లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం) వంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కొని విజయవంతంగా అధిగమించిందని గుర్తుచేసిన డీజీపీ, ఇప్పుడు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, రోడ్డు ప్రమాదాలు కొత్త సవాళ్లుగా మారాయని పేర్కొన్నారు.
ఈ సమస్యలను కేవలం పోలీస్ శాఖ ఒక్కటే ఎదుర్కోలేదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సాధారణ పౌరులు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
సురక్షిత తెలంగాణ లక్ష్యంగా
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పోలీసులు సాంకేతికత, అవగాహన, ప్రజా భాగస్వామ్యాన్ని ఆధారంగా చేసుకుని మరింత సురక్షిత సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్నారని డీజీపీ స్పష్టం చేశారు.
“సురక్షిత తెలంగాణ నిర్మాణం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి భాగస్వామ్యంతో సాధ్యమయ్యే సామూహిక లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.
ఆదిలాబాద్‌లో అమలవుతున్న ఈ నమూనా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.


