- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- లక్ష ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమం ప్రారంభం
- కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కొఠారి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడ
పిల్లల చదువుపై సీఎం ప్రత్యేక సందేశం
“ప్రభుత్వం మీకు ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి సౌకర్యం అందిస్తుంది. కానీ ప్రతిఫలంగా నేను ఒక్కటే కోరుతున్నా… మీరు ఒక పూట ఉపవాసం ఉన్నా పర్వాలేదు, మీ పిల్లలను మాత్రం తప్పకుండా చదివించాలి” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆదివాసీ మహిళలను భావోద్వేగానికి గురిచేశాయి.
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
రెండో విడతగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం
కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించిన పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కొత్తగూడలో నిర్మాణం పూర్తయిన 25 ఇందిరమ్మ ఇళ్లను స్వయంగా ప్రారంభించి పరిశీలించారు.
సిడం కన్నీబాయి, టేకం పగ్గుబాయి, ఆత్రం పోచుబాయి కుటుంబాలకు చెందిన ఇళ్లను ప్రారంభించిన సీఎం, నూతన సాంకేతికతతో నిర్మించిన గృహాలను పరిశీలించి లబ్ధిదారులను అభినందించారు.

Also Read : మహిళల భద్రత కోసం కొత్త అడుగు… 24 గంటల ‘Spandana’ టీమ్‌లు ఏమి చేస్తాయి?
ఆదివాసీల సంప్రదాయ స్వాగతం
ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఆదివాసీలు సంప్రదాయ గుస్సాడి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న సీఎం, మంత్రులకు ఆదివాసీలు సంప్రదాయ పిండి వంటకాలను రుచి చూపించారు.
“చదువే జీవితాలను మార్చగలదు”
గ్రామ మహిళలతో ముఖాముఖి మాట్లాడిన ముఖ్యమంత్రి, విద్య ప్రాధాన్యతను ప్రత్యేకంగా వివరించారు.
“మీ పిల్లలు చదువుకోకపోతే మీ జీవితాల్లో మార్పు రాదు. చదువొక్కటే మీ కుటుంబాల్లో వెలుగులు నింపగలదు. మీ పిల్లలను చదివిస్తామని నాకు మాట ఇవ్వండి” అని కోరారు. మహిళలు కూడా సీఎం విజ్ఞప్తికి స్పందిస్తూ పిల్లలను చదివిస్తామని హామీ ఇచ్చారు.
Also Read : అసెంబ్లీకి రాకుండా కోటి జీతం… కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు
గూడాలు, తండాల్లో ఇళ్లు లేని కుటుంబం ఉండకూడదు
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించినప్పటికీ, ఆదివాసీ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా 21 వేల ఇళ్లను మంజూరు చేశామని సీఎం తెలిపారు.
“రాష్ట్రంలో ఎక్కడా గుడిసెలు ఉండకూడదు. గూడాలు, తండాల్లోని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఏడాది లోపే మళ్లీ వచ్చి గృహప్రవేశాలు చేద్దాం” అని పేర్కొన్నారు.
అధికారులను ఉద్దేశించి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 365 రోజుల్లోగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు.
మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం
మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన సీఎం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లతో పాటు మహిళా సంఘాలకు అందించే రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు.
“ప్రజా ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అందరికీ ఇళ్లు అందిస్తాం. నిర్మాణ పనులను మధ్యలో ఆపకుండా పూర్తి చేయాలి” అని లబ్ధిదారులను కోరారు.
మంత్రుల పాల్గొనిక
ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, డాక్టర్ వివేక్ వెంకటస్వామితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : ధరణి స్థానంలో భూ భారతి: రైతులకు సులభ సేవలు, సదబైనామా సమస్యలకు త్వరిత పరిష్కారం


