CM Revanth Reddy | తెలంగాణ భవిష్యత్ గమ్యాన్ని నిర్దేశించే సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ డాక్యుమెంట్ రాష్ట్రాన్ని వచ్చే వందేళ్ల అభివృద్ధి దిశగా నడిపించే మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. 2034 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ స్థాయి సమగ్ర మాస్టర్ ప్లాన్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ అరుదైనదని పేర్కొన్నారు. ‘తెలంగాణ రైజింగ్ – 2047’లో రాష్ట్రాన్ని క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE)గా మూడు భాగాలుగా విభజించినట్లు సీఎం తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అవుటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాన్ని క్యూర్‌గా గుర్తించి, దాన్ని ప్రపంచస్థాయి సర్వీసెస్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాన్ని పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కాలుష్య పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ వెలుపలికి తరలించేందుకు హిల్ట్ పాలసీ తీసుకొచ్చినట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ మినహాయింపులు అందిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సైబరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్ కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించినట్లు వెల్లడించారు. అలాగే పోలీస్ కమిషనరేట్ వ్యవస్థను కూడా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లుగా విభజించినట్లు చెప్పారు. హైదరాబాద్‌ను మళ్లీ “సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్”గా తీర్చిదిద్దే లక్ష్యంతో హైడ్రా ద్వారా సరస్సులు, చెరువుల పునరుద్ధరణ చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన 1045 ఎకరాలకు పైగా చెరువు భూములు, ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Read Also : రోహిణి నక్షత్రంలో సూర్యుడి సంచారం.. మేషం నుంచి కన్యారాశి అంతా అదృష్టమే..!
ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా..
కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం తన ఆస్తులను అమ్ముకోవడమే తప్ప కొత్త ఆస్తులను సృష్టించింది లేదని.. ప్రజా ప్రభుత్వం ఆ పద్ధతికి స్వస్తి చెప్పిందన్నారు. ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ప్రజల ఆస్తిగా మార్చినట్లు సీఎం పేర్కొన్నారు. ఫేజ్-2లో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించినట్లు తెలిపారు. తొలి సారి ప్రైవేటు నుంచి ఆస్తులను ప్రభుత్వ పరం.. అంటే ప్రజల ఆస్తిగా మార్చింది. మూసీ నది ప్రక్షాళనను హైదరాబాద్ అభివృద్ధి, ఉపాధి, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేసే ప్రాజెక్టుగా చేపడుతున్నామని చెప్పారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్-1గా పనులు జరుగుతున్నాయని తెలిపారు. గోదావరి జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు అనుసంధానించి 2.5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవనానికి తరలించనున్నట్లు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్యనున్న ప్రాంతాన్ని ప్యూర్ (పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ)గా అభివృద్ధి చేసి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు సీఎం తెలిపారు. ఈ ప్రాంతంలో ఎకో-ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్స్ కంపెనీలు, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు చెప్పారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. శంషాబాద్‌ను బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా రీజినల్ కనెక్టివిటీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్ బయట ప్రాంతాన్ని రేర్ (RARE)గా అభివర్ణిస్తూ, అక్కడ సాగునీరు, వ్యవసాయ పరిశ్రమలు, వ్యవసాయ పరిశోధనలు, పంటల వైవిధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
Read Also : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి నుంచి కొత్తగా వీక్లీ ట్రైన్స్..!
పెట్టుబడులు, గ్లోబల్ గుర్తింపు
గత ఏడాది నిర్వహించిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ద్వారా దాదాపు రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు సీఎం తెలిపారు. SAFRAN – CFM ఇంటర్నేషనల్ ఏరో ఇంజిన్ MRO ఫెసిలిటీ హైదరాబాద్‌లో ఏర్పాటు కావడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఏషియా 2026 సదస్సు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ టాప్ అచీవర్‌గా నిలవడం రాష్ట్ర పురోగతికి సంకేతమని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (GCC) హబ్‌గా మారుతోందని, దేశంలోని మొత్తం GCCల్లో దాదాపు 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని వెల్లడించారు. టూరిజం పాలసీ ద్వారా దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు సీఎం తెలిపారు. దావోస్‌లో ఆవిష్కరించిన నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ద్వారా 2030 నాటికి 5 లక్షల ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తెలంగాణను దేశానికే కాదు ప్రపంచానికి గేట్‌వేగా నిలబెట్టడమే తమ స్వప్నమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ డాక్యుమెంట్ ఈ లక్ష్య సాధనకు మార్గం చూపుతుందని, ప్రజల సహకారం అత్యవసరమని ఆయన అభ్యర్థించారు.
Read Also : చంద్రుడి దక్షిణ ధ్రువంలో మూన్ బేస్ ఏర్పాటు చేయనున్న నాసా.. ప్రైవేటు సంస్థలతో కీలక ఒప్పందాలు..!


