Warangal : వరంగల్ ట్రై సిటీలో వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సెప్టెంబర్ 23 ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 25 సాయంత్రం 5 గంటల వరకు వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు. నిమజ్జనం సందర్భంగా భారీ స్థాయిలో శోభాయాత్ర నిర్వహించనున్న నేపథ్యంలో విగ్రహాలను తరలించే మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
భారీ వాహనాలకు మార్గాలు
ములుగు-భూపాలపల్లి వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలి. భూపాలపల్లి-పరకాల నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు ఆరేపల్లి వద్ద ఓఆర్‌ఆర్ ఎక్కి కరుణాపురం, వెంకటాపురం, ఐనవోలు, పున్నేలు క్రాస్ రోడ్ మీదుగా ఖమ్మం రోడ్డుకు చేరుకోవాలి.
భూపాలపల్లి-పరకాల నుంచి నర్సంపేట వైపు వెళ్లే భారీ వాహనాలు కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్పరలు, గొర్రెకుంట మీదుగా వెళ్లాలి. కరీంనగర్ నుంచి ఖమ్మం వైపు వెళ్లే భారీ వాహనాలు చింతగట్టు వద్ద ఓఆర్‌ఆర్‌పైకి వెళ్లి యూటర్న్ తీసుకుని కరుణాపురం, వెంకటాపురం, ఐనవోలు, పున్నేలు క్రాస్ రోడ్ మీదుగా ఖమ్మం రోడ్డుకు చేరుకోవాలి.
ఖమ్మం నుంచి కరీంనగర్, హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలు పున్నేలు క్రాస్ రోడ్, ఐనవోలు ఆర్చ్, వెంకటాపురం, కరుణాపురం మీదుగా వెళ్లాలి. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే భారీ వాహనాలు కరుణాపురం, వెంకటాపురం, ఐనవోలు, పున్నేలు క్రాస్ రోడ్ మీదుగా వెళ్లాలి.
నిమజ్జనం సమయంలో భారీ వాహనాలను నగరంలోకి అనుమతించరు. సిటీ లోపలికి వచ్చే భారీ వాహనాలను నగరానికి అవతలే నిలిపివేయాలి. హైదరాబాద్ నుంచి నర్సంపేట వైపు వెళ్లే భారీ వాహనాలు కరుణాపురం నుంచి ఓఆర్‌ఆర్‌పైకి వచ్చి ఆరేపల్లి, ఆత్మకూరు, కటాక్షపూర్, మల్లంపల్లి మీదుగా నర్సంపేట వెళ్లాలి. నర్సంపేట నుంచి వరంగల్, హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలు మల్లంపల్లి, కటాక్షపూర్, ఆత్మకూరు, ఆరేపల్లి-ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లాలి.
వరంగల్ నగరంలో బస్సులు, ఇతర వాహనాలకు మార్గాలు
ములుగు, పరకాల వైపు నుంచి వచ్చే బస్సులు పెద్దమ్మగడ్డ, కేయూసీ, సీవీపీ అంబేద్కర్ సెంటర్, ఏషియన్ శ్రీదేవి మాల్ మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలి. హన్మకొండ బస్టాండ్ నుంచి ములుగు, కరీంనగర్ వైపు వెళ్లే బస్సులు ఏషియన్ శ్రీదేవి మాల్, అంబేద్కర్ సెంటర్, సీపీఓ, కేయూసీ జంక్షన్ మీదుగా వెళ్లాలి.
హన్మకొండ బస్టాండ్ నుంచి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లే బస్సులు బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్ మీదుగా వెళ్లాలి. వరంగల్ బస్టాండ్ నుంచి హన్మకొండ వైపు వచ్చే బస్సులు చింతల్ బ్రిడ్జి, రంగశాయిపేట్, నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్, ఉర్సుగుట్ట, అదాలత్, బాలసముద్రం రోడ్ మీదుగా హన్మకొండకు చేరుకోవాలి.
కాజీపేట నుంచి వరంగల్ వైపు వెళ్లే కార్లు, ఇతర చిన్న వాహనాలు ఫాతిమా జంక్షన్, వడ్డేపల్లి చర్చి, కేయూసీ జంక్షన్, పెద్దమ్మగడ్డ, ములుగు రోడ్డు, ఎంజీఎం, జెమిని, పోతన జంక్షన్, అండర్ బ్రిడ్జి, హెడ్ పోస్టాఫీస్, వరంగల్ బస్టాండ్, వెంకట్రామ్ సర్కిల్ మీదుగా వెళ్లాలి.
వరంగల్ నుంచి కాజీపేట వైపు వెళ్లే కార్లు, ఇతర చిన్న వాహనాలు వెంకట్రామ్, వరంగల్ బస్టాండ్, హెడ్ పోస్టాఫీస్, అండర్ బ్రిడ్జి, పోతన జంక్షన్, జెమిని, ఎంజీఎం, ములుగు రోడ్డు, పెద్దమ్మగడ్డ, కేయూసీ జంక్షన్, వడ్డేపల్లి చర్చి, ఫాతిమా జంక్షన్ మీదుగా వెళ్లాలి.
వినాయక విగ్రహాల వాహనాలకు మార్గదర్శకాలు
సిద్ధేశ్వర గుండంలో నిమజ్జనం చేసిన తర్వాత వాహనాలు శాయంపేట వైపు వెళ్లే రోడ్డు ద్వారా వెళ్లాలి. శాయంపేట వైపు నుంచి వచ్చే వినాయక విగ్రహ వాహనాలు హంటర్ రోడ్, అదాలత్, హన్మకొండ చౌరస్తా మీదుగా ప్రయాణించాలి.
ఎక్సైజ్ కాలనీ, రెవెన్యూ కాలనీ, వడ్డేపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వినాయక విగ్రహాలను బంధం చెరువులో నిమజ్జనం చేయాలి. చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసిన వాహనాలు ఎనుమాముల రోడ్డు నుంచి నర్సంపేట రోడ్డు వైపు వెళ్లాలి.
నిమజ్జనం రోజున శోభాయాత్ర జరిగే మార్గాల్లో, నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో వాహనాలను నిలుపరాదని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలకు ప్రజలు సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ కోరారు.


