ఖమ్మంలో వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతల ఘటనను స్థానికులు ఇప్పటికీ మర్చిపోలేదు. వందల ఇళ్లను కూల్చివేయడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి, మళ్లీ వెలుగుమట్లలో ఇళ్ల నిర్మాణాలకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఖమ్మం నగరంలో మరో ఇళ్ల కూల్చివేత వివాదం తెరపైకి వచ్చింది. శ్రీనివాస్‌నగర్‌లో 600కు పైగా ఇళ్లను తొలగించేందుకు నోటీసులు జారీ చేస్తుండటంతో బాధితులు ఆందోళనకు దిగుతున్నారు.
వెలుగుమట్ల తరహాలోనే మరో వివాదం ఖమ్మం నగరంలోని శ్రీనివాస్‌నగర్‌లో చోటుచేసుకుంటుందా అన్నట్లుగా ఇక్కడ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. 600కు పైగా ఇళ్లను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపడుతుండటంతో తమ ఇళ్లు తమకే కావాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు రోడ్డెక్కుతున్నారు. అసలు శ్రీనివాస్‌నగర్‌లో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కోర్టు ఆదేశాలతో ఇళ్లను తొలగించేందుకు ఖమ్మం నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేస్తోంది. దీంతో బాధితులు రోడ్డెక్కి ఆందోళనలు ప్రారంభించారు. ఖమ్మం నగరంలోని కీలక ప్రాంతాల్లో శ్రీనివాస్‌నగర్ ఒకటి. ఖమ్మం త్రీటౌన్‌లోని వ్యవసాయ మార్కెట్, మౌంట్ ఫోర్ట్, సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలు నాలుగు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. ఇప్పుడు తమను రోడ్డున పడేయవద్దని అధికారులను వేడుకుంటున్నారు.
ఖమ్మం నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ ప్రాంతంలో టింబర్ డిపోలు ఏర్పడ్డాయి. ఆ టింబర్ డిపోల చుట్టూ 80 అడుగుల రహదారి ఏర్పడింది. రహదారి పక్కనే అప్పట్లో పలువురు గుడిసెలు వేసుకున్నారు. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణాలకు నాటి మున్సిపాలిటీ అనుమతులు ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మూడు దశాబ్దాల క్రితమే ఇక్కడ పక్కా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి.
తమ కార్యకలాపాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని టింబర్ డిపోలకు చెందిన ప్రైవేట్ వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు ఈ ఇళ్లను తొలగించేందుకు రెండు నెలల క్రితమే ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల ఇళ్ల తొలగింపునకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ అంశం ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా మారితే.. అధికార కాంగ్రెస్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
“ఇప్పుడు వచ్చి ఇళ్లు తీసేయాలంటే మేము ఎటు పోవాలి సార్? 50, 60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మాలో కొందరు ముసలివాళ్లయ్యారు. కూలి చేసుకుని బతుకుతున్నాం. మా అత్తగార్లు కూడా ముసలివాళ్లయ్యారు. మా అత్త అయితే చనిపోయింది. ఇప్పుడు లేదు. ఇల్లు తీసేస్తే మేమెక్కడికి వెళ్లాలి?” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
చుట్టూ నిర్మాణాలు పెరగడంతో 80 అడుగుల రహదారి కుచించుకుపోయిందని అధికారులు చెబుతున్నారు. ఈ రహదారి కుచించుకుపోవడానికి కారణమైన 629 ఇళ్లను తొలగించాలని రెవెన్యూ అధికారులు ఇప్పటికే కొంతమందికి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో వందల కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
శ్రీనివాస్‌నగర్ అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో మూడు దశాబ్దాలకు పైగా నివాసం ఉంటున్న వారికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో 58 ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలు పొందిన వారికి ప్రస్తుత ప్రభుత్వం తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. దీంతో కొందరు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.
కోర్టు ఆదేశాలతో ఇప్పుడు ఈ ప్రాంతంలోని ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లను రెవెన్యూ అధికారులు రద్దు చేసినట్లు సమాచారం. అయితే తీర్పును అమలు చేయడం లేదని పిటిషన్‌దారులు మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో 15 రోజుల్లో ఇళ్లను తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో 629 మందికి నోటీసులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో బాధితులు ఈ నెల 15న రోడ్డెక్కి ఐదు గంటల పాటు రాస్తారోకో చేశారు.
శ్రీనివాస్‌నగర్ వాసులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిన వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో పోలీసులు సంయమనంతో వ్యవహరించారు.
గత ప్రభుత్వంలో జీవో 58 కింద క్రమబద్ధీకరణ పట్టాలు ఇచ్చే సమయంలో రెవెన్యూ, నగరపాలక సంస్థ, ప్రణాళిక విభాగం అధికారులు పరస్పరం చర్చించకుండానే నిర్ణయం తీసుకోవడం సమస్యగా మారిందని స్థానికులు చెబుతున్నారు. రహదారి 50 అడుగులు ఉన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం, క్రమబద్ధీకరణ పట్టాలు జారీ చేసిన తర్వాత ఆగమేఘాల మీద ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో సమస్య మరింత జటిలమైందని పేర్కొంటున్నారు.
“ఇప్పుడే ఇళ్లు తీసేయమంటే మా పరిస్థితి ఏంటి? మాకు ఎక్కడా ప్లేస్ లేదు. ఎక్కడా ఇల్లు లేదు. ఎక్కడికి వెళ్లాలి? మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. స్కూల్‌కు పంపిస్తున్నాం. కనీసం ఎక్కడైనా ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం లేదు. మా ఇల్లు మాకే ఉండాలి. ఇదే మా పోరాటం. కనీసం సీఎం గారు మాకు స్పష్టంగా చెబితే.. మేము ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కూలిపోయే ఇళ్లలోనే మేము ఉంటున్నాం సార్” అంటూ బాధితులు వాపోతున్నారు.
ఎన్నో ఏళ్ల క్రితమే నిర్మించుకున్న ఈ ఇళ్లకు ఇంటి నంబర్లు ఉన్నాయని, కరెంట్, నల్లా నీటి సౌకర్యాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న వారికి ఓటు హక్కు కూడా ఉందని పేర్కొంటున్నారు. 629 ఇళ్లలో దాదాపు 2 వేల మంది నివాసం ఉంటున్నారని, ఇంతమందికి ఆశ్రయం కల్పిస్తున్న ఇళ్లను కూల్చివేయడం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అంటున్నారు.
గతంలో ఇళ్ల పట్టాలు ఇప్పించిన బీఆర్‌ఎస్ నేత పువ్వాడ అజయ్ ఇప్పుడు బాధితులకు అండగా నిలిచారని, వారి తరఫున కోర్టులో కేసు వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కోర్టు సానుకూలంగా తీర్పు ఇస్తుందన్న నమ్మకం ఉందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆశాభావం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇవి ఆక్రమణలైతే ఇంటి నంబర్లు, నల్లా కనెక్షన్లు, విద్యుత్ మీటర్లు ఎలా ఇచ్చారని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇళ్ల కూల్చివేత నోటీసులను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని బాధితులు, బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతోంది. ఇప్పుడు మూడు రోజుల నుంచి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాత్రికి రాత్రే ఇళ్లు కూలగొట్టాలని కక్ష సాధింపు జరుగుతోంది. మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. చచ్చినా, బతికినా ఇక్కడే ఉంటాం. మా ఇల్లు మాకే కావాలి” అని బాధితులు చెబుతున్నారు.
శ్రీనివాస్‌నగర్‌లో కూల్చివేతలు చేపడితే మరో వెలుగుమట్ల తరహా పరిస్థితి ఏర్పడుతుందని కొందరు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకే ఇళ్లను తొలగిస్తున్నామని రెవెన్యూ శాఖ చెబుతోంది. అయితే 40 ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్న తమకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు లేదా స్థలం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. నగరపాలక సంస్థ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఈ సమస్యకు ఒక కారణంగా మారిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.


