మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య కొనసాగుతున్న ఆస్తుల వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వ్యవహారంపై తాజాగా వారి తల్లి వైఎస్ విజయమ్మ స్వయంగా స్పందించి అడ్వొకేట్ నోటరీ విడుదల చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నోటరీలో కుటుంబ ఆస్తుల పంపకాలపై విజయమ్మ స్పష్టమైన వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా తన కుమారుడు జగన్ వ్యవహారంపై ఆమె ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
విజయమ్మ పేర్కొన్న వివరాల ప్రకారం, 2009లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ ‘కంబైన్డ్ ఫ్యామిలీ అసెట్స్’గానే ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు ఆస్తుల అధికారిక పంపకం జరగలేదని ఆమె స్పష్టం చేశారు. అలాగే వైఎస్సార్ ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలనే ఉద్దేశం ఉన్నట్లు, ఇది కుటుంబ సభ్యులందరికీ తెలిసిన విషయమని పేర్కొన్నారు.
ఎంవోయూ, ఆస్తులపై స్పష్టత
ఎంవోయూలో వైఎస్ షర్మిలకు కేటాయించిన ఆస్తులన్నీ ఆమెకు న్యాయంగా రావాల్సినవేనని విజయమ్మ వెల్లడించారు. “జగన్ తనకు తక్కువే రాసుకున్నాడు. సరస్వతి సిమెంట్‌తో పాటు ఎంవోయూలో లేని యెలహంక భూమి కూడా షర్మిలదే” అని ఆమె నోటరీలో పేర్కొన్నారు.
IIIT హైదరాబాద్‌లో M.Tech CASE అడ్మిషన్లు ప్రారంభం… మార్చి 31 వరకు అప్లై చేసుకోండి
ఇప్పటివరకు షర్మిలకు ఇచ్చిన డబ్బు కూడా ఆమె వాటాకు సంబంధించిన డివిడెండ్ మాత్రమేనని తెలిపారు.
జగన్‌పై ఆవేదన:
ఆస్తుల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మేనల్లుడు, మేనకోడలికి అన్యాయం చేశాడని విజయమ్మ వ్యాఖ్యానించారు. అయితే ఒక తల్లిగా ఆయన ఎప్పటికైనా న్యాయం చేస్తాడనే ఆశ ఉందని చెప్పారు. షర్మిలకు ఇచ్చిన ఆస్తుల్లాంటివే గతంలో జగన్‌కూ ఇచ్చినప్పటికీ, దాన్ని ఆస్తి పంపకంగా పరిగణించరాదని విజయమ్మ స్పష్టం చేశారు. నిజం ఏమిటో దేవుడికి, తన కుమారుడికి తెలుసని వ్యాఖ్యానించారు.
మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై కూడా విజయమ్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎవరు? దేవుడి న్యాయమే నిజమైన న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలి” అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించవద్దని కూడా ఆమె కోరారు.
రాజకీయ ప్రభావం
ఇప్పటికే రాజకీయంగా వేర్వేరు దారులు ఎంచుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో, విజయమ్మ నోటరీ కొత్త చర్చలకు దారితీసింది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.


