అవయవదానంతో 8 మందికి పునర్జన్మ.. విషాదంలోనూ రెండు కుటుంబాల గొప్ప నిర్ణయం

కామారెడ్డికి చెందిన కుడిక్యాల వినయ్, యాదాద్రి భువనగిరికి చెందిన పద్మ ఆండాల అవయవదానంతో 8 మంది రోగులకు ప్రయోజనం కలిగింది. విషాదంలోనూ కుటుంబాలు గొప్ప నిర్ణయం తీసుకున్నాయి.

kudikyala vinay vinay organ donation, padma andalu organ donation
kudikyala vinay vinay organ donation, padma andalu organ donation

తీవ్ర విషాదంలోనూ రెండు కుటుంబాలు తీసుకున్న గొప్ప నిర్ణయం ఎనిమిది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. బ్రెయిన్ డెడ్ అయిన కామారెడ్డి జిల్లాకు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుడిక్యాల వినయ్, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 60 ఏళ్ల పద్మ ఆండాలు అవయవదానంతో ఎనిమిది మందికి ప్రాణదానం చేశారు. కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వారి అవయవాలను అవసరమైన రోగులకు దానం చేశారు.

కుడిక్యాల వినయ్ అవయవదానం

కామారెడ్డి శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన కుడిక్యాల వినయ్ (26) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 16న మెదడు సంబంధిత సమస్యతో ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆయన పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 19న బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. ఈ విషాద సమయంలో వినయ్ తండ్రి కుడిక్యాల మోహన్ అవయవదానానికి ముందుకు వచ్చారు.

వినయ్‌కి చెందిన రెండు కిడ్నీలు, లివర్, గుండె, ఊపిరితిత్తులు దానం చేయడంతో మొత్తం ఐదుగురు అవసరమైన రోగులకు అవయవాలు అందే అవకాశం కలిగింది.

 పద్మ ఆండాలు అవయవదానం

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన జూలూరు నివాసి పద్మ ఆండాలు (60) గృహిణి. సెప్టెంబర్ 17న తీవ్ర జ్వరం కారణంగా మాట్లాడలేని పరిస్థితికి చేరుకుని ఇంటి వద్దే స్పృహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే సెప్టెంబర్ 19న ఆమెను కూడా బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. ఈ సమయంలో ఆమె కుమారుడు పద్మ వినోద్ కుమార్ అవయవదానానికి అంగీకరించారు.

పద్మ ఆండాలు దానం చేసిన రెండు కిడ్నీలు, లివర్ ద్వారా మరో ముగ్గురు రోగులకు ప్రయోజనం కలిగింది.

 విషాదంలోనూ గొప్ప నిర్ణయం

ఒకవైపు కుటుంబ సభ్యుడిని కోల్పోయిన తీవ్ర విషాదం.. మరోవైపు తమ ఆత్మీయుడి అవయవాలతో మరికొందరి జీవితాలను నిలబెట్టాలనే గొప్ప సంకల్పం. ఈ రెండు కుటుంబాలు తీసుకున్న నిర్ణయం అవయవదాన ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పింది.

మరణం తర్వాత కూడా తమ ఆత్మీయుల అవయవాలు మరొకరి జీవితంలో కొనసాగుతాయనే భావనతో కుటుంబ సభ్యులు చేసిన ఈ దానం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. అవసరంలో ఉన్న వారికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించే అవయవదానం ద్వారా చీకటిలో ఉన్న కుటుంబాల్లో మళ్లీ వెలుగులు నింపవచ్చు.

వినయ్, పద్మ ఆండాల కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ మానవతా నిర్ణయం నిజంగా అభినందనీయం.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »