పెద్ద‌ల స‌భ‌కు వైఎస్ ష‌ర్మిల‌.. కాంగ్రెస్ అధిష్టానం యోచ‌న‌..!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)కు రాజ్యసభ (Rajya Sabha) సీటు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. క‌ర్నాట‌క (Karnataka) నుంచి ఆమె పేరును కాంగ్రెస్ అధిష్ఠానం (Congress High Command) పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

YS Sharmila | ఆంధ్ర‌ప్ర‌దేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌కు రాజ్య‌స‌భ సీటు ద‌క్కే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆమెకు రాజ్య‌స‌భ ఇస్తామ‌ని గ‌తంలో ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తాజాగా ఆహామీని నిల‌బెట్టుకునే అవ‌కాశం క‌నిపిస్తున్నాయి. క‌ర్నాట‌క నుంచి త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీపై కాంగ్రెస్ అధిష్ఠానం ముమ్మరంగా చర్చలు జరుపుతుండగా.. షర్మిల పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ జాతీయ నాయకత్వం ఆమెను ఎగువసభకు పంపించే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క‌ర్నాట‌క కాంగ్రెస్ పార్టీకి ఈ సారి ఎగువ స‌భ‌లో మూడు స్థానాలు దక్కే అవకాశం ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర పోటీ నెలకొంది. క‌న్న‌డ సీనియర్ నేతలు బీకే హరిప్రసాద్, రాజీవ్ గౌడ పేర్లు ప‌రిశీలిస్తున్న‌ట్లు వార్త‌లున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ తరఫున గట్టిగా వాదనలు వినిపిస్తున్న అధికార ప్రతినిధులు పవన్ ఖేడా, సుప్రియా శ్రీనటే పేర్లను కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే జాబితాలో ఇప్పుడు వైఎస్ షర్మిల పేరు చేరడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Read Also : ఏపీలో మండుతున్న ఎండలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ముగిసిన ప‌రిమ‌ళ్ న‌త్వానీ ప‌ద‌వీకాలం

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ బలోపేతం చేయాలనే లక్ష్యంతో షర్మిలను పార్టీ ముందుకు తీసుకొచ్చిన రాహుల్ గాంధీ.. ఆమెకు జాతీయ స్థాయిలో కూడా ప్రాధాన్యం కల్పించాలని భావిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో పార్టీకి పెద్దగా బలం లేకపోయినా, షర్మిలను రాజ్యసభకు పంపించడం ద్వారా దక్షిణాది రాజకీయాల్లో కాంగ్రెస్‌కు కొత్త సందేశం వెళ్లే అవకాశం ఉందని నాయకత్వం అంచనా వేస్తోందని సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానీ పదవీకాలం ముగియడంతో ఆయన భవిష్యత్ రాజకీయ అడుగులపై కూడా చర్చ సాగుతోంది. వైఎస్సార్సీపీ మద్దతుతో గతంలో రాజ్యసభకు వెళ్లిన నత్వానీ ఈసారి ఝార్ఖండ్ నుంచి మళ్లీ ఎగువసభలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన, ఈ సారి మాత్రం బీజేపీ మద్దతుతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read Also : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభించనున్న ప్రధాని.. జులై నుంచి సర్వీసులు షురూ..!

మిత్ర‌ప‌క్షాల స‌హ‌కారం కావాల్సిందే..

ఝార్ఖండ్ రాజకీయ సమీకరణాలు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అక్కడ ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకదాన్ని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) తమ కుటుంబానికి చెందిన మహిళా నేతకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. మరో సీటుపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నప్పటికీ, అవసరమైన సంఖ్యాబలం లేకపోవడం ఆ పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. ఝార్ఖండ్ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 16 మంది ఎమ్మెల్యేల మద్దతే ఉండగా.. రాజ్యసభ స్థానం గెలవాలంటే కనీసం 24 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో మిత్రపక్షాల సహకారం లేకుండా కాంగ్రెస్‌కు ఆ సీటు సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క‌ర్నాట‌క కోటాలో షర్మిలకు అవకాశం కల్పిస్తారా? లేక స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇస్తారా? అన్నది కాంగ్రెస్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Read Also : తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. రోజ్‌గార్ మేళాలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ కామెంట్స్‌..

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »