మారుతున్న జీవనశైలి.. పెరుగుతున్న గుండె జబ్బులు.. NFHS నివేదికలో సంచలన విషయాలు..

ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-6 నివేదిక (NFHS-6 Report) దేశ ఆరోగ్య పరిస్థితులపై ఆందోళనకర అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. దేశంలో నమోదవుతున్న మరణాల్లో 60 శాతానికి పైగా అసాంక్రమిక వ్యాధులు (Non-Communicable Diseases), ముఖ్యంగా గుండె జబ్బులు (Heart Disease), మధుమేహం (Diabetes), క్యాన్సర్‌ (Cancer) కారణంగానే సంభవిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. మరోవైపు మహిళల డిజిటల్‌ సాధికారత (Women Digital Empowerment) పెరుగుతున్నప్పటికీ గృహహింస (Domestic Violence), బాల్యవివాహాలు (Child Marriage) ఇంకా సవాల్‌గానే నిలుస్తున్నాయని పేర్కొంది.

Heart Disease
SRS Survey Report | మారుతున్న జీవనశైలి.. పెరుగుతున్న గుండె జబ్బులు

SRS Survey Report | దేశంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఒత్తిడితో కూడిన జీవన విధానం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి. జాతీయ నమూనా రిజిస్ట్రేషన్ వ్యవస్థ (ఎస్‌ఆర్‌ఎస్‌), జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-6) నివేదికలు దేశంలో అసాంక్రమిక వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న మొత్తం మరణాల్లో 60 శాతానికి పైగా గుండె జబ్బులు, క్యాన్సర్‌, మధుమేహం, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల వల్లే సంభవిస్తున్నట్లు సర్వే తేల్చింది. అసాంక్రమిక వ్యాధుల్లో గుండె సంబంధిత సమస్యలే అత్యంత ప్రమాదకరంగా మారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ తరహా మరణాల్లో 32.1 శాతం కేవలం గుండె జబ్బుల కారణంగానే నమోదవుతున్నాయి. మరోవైపు మధుమేహం, ఊబకాయం కేసులు కూడా ఆందోళన కలిగించే స్థాయిలో పెరుగుతున్నాయి. పురుషుల్లో మధుమేహం బాధితుల శాతం 20.9కు చేరుకోగా, మహిళల్లో అది 17.8 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

Read Also : భారతీయ యువతను వెంటాడుతున్న యాంగ్జైటీ.. మూడు దశాబ్దాల్లో భారీగా పెరిగిన సమస్యలు..!

యువత మానసిక ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన..

యువత మానసిక ఆరోగ్య పరిస్థితిపై కూడా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఆత్మహత్యల కారణంగా జరుగుతున్న మరణాలు 19 శాతానికి చేరుకోవడం కలవరపెడుతోంది. ఉద్యోగ ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళనలు ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు. అయితే అంటువ్యాధుల కారణంగా జరిగే మరణాలు క్రమంగా తగ్గడం, రక్తపోటు నియంత్రణలో కొంత మెరుగుదల కనిపించడం సానుకూల అంశాలుగా పేర్కొన్నారు. ఇక మహిళల సామాజిక, ఆర్థిక సాధికారత విషయంలో గణనీయమైన పురోగతి నమోదైనట్లు సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న మహిళల శాతం గత కొన్నేళ్లలో 33.3 నుంచి 64.3 శాతానికి పెరిగింది. డిజిటల్‌ సేవల వినియోగం పెరగడం, స్మార్ట్‌ఫోన్‌ల అందుబాటు విస్తరించడం ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ఈ జాబితాలో కేరళ 87.3 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ 64.8 శాతం, ఆంధ్రప్రదేశ్‌ 63.6 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆర్థిక స్వావలంబన విషయంలో కూడా మహిళలు ముందడుగు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 89 శాతం మంది మహిళలకు సొంత బ్యాంకు ఖాతాలు ఉండటం గమనార్హం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ఖాతాల్లో జమ కావడం, డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు విస్తరించడం వల్ల మహిళల ఆర్థిక భాగస్వామ్యం పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

Read Also : ఆఫ్రికాలో ఎబోలా అవుట్‌ బ్రేక్‌.. ఆ రెండు దేశాలకు వెళ్లొద్దని భారత్‌ సూచన..!

ప్రతి ఐదుగురిలో ఒకరికి బాల్య వివాహం..

అయితే, మరోవైపు కొన్ని సామాజిక సమస్యలు ఇప్పటికీ ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి ఐదుగురు బాలికల్లో ఒకరు ఇంకా బాల్యవివాహం బారిన పడుతున్నట్లు సర్వే పేర్కొంది. ప్రస్తుతం బాల్యవివాహాల శాతం 20 వద్ద కొనసాగుతోంది. అలాగే 22.3 శాతం మంది మహిళలు గృహహింసను ఎదుర్కొంటున్నట్లు నివేదిక వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల్లో గృహహింస సమస్య తెలంగాణలో ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 30.8 శాతం మంది మహిళలు భర్తల నుంచి శారీరక లేదా మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు సర్వే తేల్చింది. మహిళల విద్య, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నప్పటికీ కుటుంబ, సామాజిక స్థాయిలో ఇంకా అనేక సవాళ్లు కొనసాగుతున్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో పాటు సామాజిక అంశాలపై కూడా మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన అలవాట్లు, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపుతో పాటు మహిళల భద్రత, సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. కేంద్ర ప్రభుత్వం రెస్పాన్స్‌ ఇదే..!

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »