Kavitha | తెలంగాణలోని రూ.లక్ష కోట్ల విలువైన భూములను బడాబాబులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం, హైడ్రా, భూ వ్యవహారాలు, నీటి ప్రాజెక్టులు, పవన్ కళ్యాణ్, తెలంగాణ అస్తిత్వం తదితర అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పేదవారికి అన్యాయం చేస్తూ పెద్దవారికి దోపిడీ చేసి పెడుతున్న ప్రభుత్వం గురించి చెబుతా. లక్ష కోట్ల భూములను పెద్దవాళ్లకు అప్పనంగా అప్పగించే కుట్ర జరుగుతోంది. ఆ భూదందా గురించి సాక్ష్యాధారాలతో సహా వరుసగా బయటపెడతా’నని కవిత ప్రకటించారు. హైడ్రాపై కూడా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ‘హైడ్రా అనే బూచి ద్వారా భూదందా ఎవరెవరు చేస్తున్నారో ప్రజల ముందు పెడతాం. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందా చేస్తున్నారు. వాటిని పూర్తి ఆధారాలతో బయటపెడతాం’ అన్నారు.
Read Also : త్యాగాల తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతాం.. ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి..
పేదలపై చర్యలు.. పెద్దలపై మౌనం
కూకట్‌పల్లిలోని మంజీర కాలనీలో పేదల భూములను ఖాళీ చేయిస్తున్న హైడ్రా, మూసీ నది గర్భంలో నిర్మాణాలు చేపడుతున్న వారిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని కవిత ఆరోపించారు. ‘మూసీకి మరకగా మారిన శ్రీ ఆదిత్య బిల్డింగ్‌ను హైడ్రా టచ్ చేయడం లేదు. మేము గతంలో అక్కడ ధర్నా చేసినప్పుడు మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆధారాలు చూపించిన తర్వాత ఇప్పటివరకు ఒక్క మాట మాట్లాడటం లేదు’ అని ఆరోపించారు. శ్రీ ఆదిత్య బిల్డర్స్ వెనుక ఓ ఎంపీ ఉన్నారని, ఆయన పేరు త్వరలోనే బయటపెడతానని చెప్పారు. ప్రేమవతిపేట పెద్ద చెరువులో ఏడు ఎకరాల భూమిని ఆక్రమించి భారీ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ‘ఏడు ఎకరాలు అంటే రూ.700 కోట్ల విలువైన భూమి. అక్కడ 30 అంతస్తుల భవనం కడుతున్నారు. హైడ్రాకు దమ్ముంటే ఆ సంస్థను ముట్టుకోవాలి’ అని సవాల్ విసిరారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఐకాం అనే ఆయుధాల తయారీ సంస్థ కూడా చెరువు భూములను ఆక్రమించిందని ఆరోపించారు. స్థానిక మున్సిపాలిటీ తీర్మానం చేసినప్పటికీ చర్యలు కనిపించడం లేదని విమర్శించారు.
Read Also : రూ.లక్ష కోట్ల కాళేశ్వరం మూడేళ్లకే కుంగిపోయింది.. పునరుద్ధరణ పనులు ప్రారంభించాం : సీఎం రేవంత్
బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే.. కాంగ్రెస్ తలుపులు తెరిచింది
తెలంగాణ సంపద, వనరులు, భూములను బందిపోట్ల మాదిరిగా దోచుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత మండిపడ్డారు. ‘గతంలో ఈ అవినీతికి బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ తలుపులు తెరిచింది. తెలంగాణ వనరులను, సంపదను, భూములను బందిపోట్ల మాదిరిగా దోచుకుంటున్నారు. ప్రాణం పోయినా సరే తెలంగాణలో ఇంచు భూమిని కూడా దోపిడీ కానివ్వం’ అని స్పష్టం చేశారు. అంతేకాకుండా ‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆఖరి బార్. మరో 20 ఏళ్లు బొందపెట్టే విధంగా రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడు. కాంగ్రెస్‌కు ఇదే ఆఖరి సర్కార్ అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన భూముల అంశాన్ని కూడా కవిత ప్రస్తావించారు. ‘తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు అన్నం తినకుండా బాధపడిన పవన్ కళ్యాణ్ ఆ బాధలో ఇక్కడ భూములు కొన్నారు. కానీ కోడికుంట చెరువులో 10 ఎకరాల శిఖం భూమినే కొన్నారు’ అని విమర్శించారు. సర్వే నంబర్ 706లోని భూమి శిఖం భూమేనని నీటిపారుదల శాఖ నోటిఫై చేసిందని పేర్కొంటూ ‘శిఖం భూములు కొన్న పవన్ కళ్యాణ్ వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలి. రైతులకు ఇచ్చిన విధంగానే ఆయనకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. శిఖం భూమి అయితే వాపస్ ఇస్తానని మీరే చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
Read Also : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది.. స్పష్టం చేసిన పవన్ కల్యాణ్
ఆంధ్రా విష కోరల్లోంచి తెలంగాణ సాధించుకున్నాం..
తెలంగాణ అస్తిత్వంపై కూడా కవిత భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ‘ఆంధ్రా విష కోరల్లోంచి తెలంగాణను సాధించుకున్నాం. కచ్చితంగా తెలంగాణ మా జాగీరే. మా హక్కులు, వనరులను దోచుకున్న వారిపై పోరాడి రాష్ట్రం సాధించుకున్నాం. మళ్లీ అదే శక్తులు ఇక్కడ రాజకీయాలు చేయాలని చూడటం సరికాదు’ అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తెలంగాణ మేధావులు, కళాకారులను అవమానిస్తున్నారని ఆరోపించారు. గద్దర్ పేరు ప్రస్తావిస్తూ కళాకారులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పాలమూరు ప్రాజెక్టు, బనకచర్ల ప్రతిపాదన, కృష్ణా-గోదావరి జలాల అంశాలపై కూడా కవిత స్పందించారు. ‘పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి 30 నెలలుగా పాలమూరు ప్రాజెక్టుపై రివ్యూ చేయలేదు. మేము పోరాటాలు చేసిన తర్వాతే సమీక్ష నిర్వహించారు’ అని విమర్శించారు. ‘చంద్రబాబు నాయుడిని కలిసి తెలంగాణకు 200 టీఎంసీల గోదావరి నీళ్లు కావాలని అడగాలి. బనకచర్లకు అంగీకరిస్తే తెలంగాణకు నీటి ద్రోహం చేసినట్టే. భవిష్యత్తులో కృష్ణా నీళ్లు సరిపోవు’ అని తెలిపారు. ఉద్యమకారులకు భూముల కేటాయింపుపై కూడా స్పందించిన కవిత.. ఉప్పల్ భగాయత్, నాదర్‌గుల్ ప్రాంతాల్లోని భూములను ఉద్యమకారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.
Read Also : తెలంగాణ ఎవరి జాగీరు కాదు.. నాలుగు కోట్ల భూమిపుత్రుల రాష్ట్రం.. పవన్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్..!


