రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS)కు స్పందన పెరుగుతోంది. జులై 17న ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.104.63 కోట్ల విలువైన ప్రీ-ఆథరైజేషన్లకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఈ పథకం ద్వారా వైద్య సేవలు పొందుతున్నారు.
ప్రస్తుతం 778 ప్రైవేట్, 141 ప్రభుత్వ ఆసుపత్రులు కలిపి మొత్తం 919 ఆసుపత్రులు EHSలో ఎంపానెల్ అయ్యాయి. అయితే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య కార్డు చూపించినప్పుడు ఇబ్బందులు పెడుతున్నారని కొందరు లబ్ధిదారులు చెబుతున్నారు.
జులై 17న పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 15,395 చికిత్సలకు అనుమతులు ఇచ్చారు. ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పే నుంచి 1.5 శాతం చొప్పున వాటా జమ కాగా, ప్రభుత్వం మరో 1.5 శాతం మ్యాచింగ్ గ్రాంట్‌గా ఇస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్ల వాటాగా నెలకు రూ.44 కోట్లు, ప్రభుత్వం మరో రూ.44 కోట్లు కలిపి మొత్తం రూ.88 కోట్లు ఆరోగ్య నిధికి చేరుతున్నాయి. ఏడాది బడ్జెట్‌ను ప్రభుత్వం రూ.1,056 కోట్లుగా నిర్ణయించింది.
కుటుంబ సభ్యుల కేసులే ఎక్కువ
ప్రీ-ఆథరైజేషన్లలో ఉద్యోగుల కంటే వారి కుటుంబ సభ్యుల కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించిన 3,192 కేసుల్లో రూ.18.75 కోట్ల విలువైన చికిత్సలకు అనుమతులు ఇచ్చారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సంబంధించిన 5,669 కేసుల్లో రూ.39.52 కోట్లు మంజూరయ్యాయి.
పెన్షనర్లకు రూ.29.27 కోట్ల విలువైన చికిత్సలకు, వారి కుటుంబ సభ్యులకు రూ.17.08 కోట్ల విలువైన చికిత్సలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. 30 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు.
పేమెంట్లు క్లియర్‌గా ఉన్నాయని, బోర్డు సమావేశాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. రూ.3 లక్షలు దాటిన కేసులకు కూడా ఒకే రోజులో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందుకోసం సబ్ కమిటీని ఏర్పాటు చేశామని, ఫోన్ చేసినా అనుమతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రూ.10 లక్షలకు పైబడిన కేసులు కూడా వస్తున్నాయని, EHS కార్యాలయంలో ఎక్కడా ఆలస్యం లేకుండా సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నారని వివరించారు.
OPD సేవలకు కూడా అవకాశం
కొన్ని OPD సేవలకు కూడా ఆరోగ్య పథకం కింద అమౌంట్ ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారని అధికారులు తెలిపారు. దీనిని ట్రస్ట్‌లో అంగీకరించామని చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో OPD వరకు 30 శాతం కన్సెషన్ ఇస్తున్నారని వివరించారు.
OPDలో పరీక్షలు నిర్వహించిన తర్వాత వ్యాధి గుర్తించకపోతే ఆ ఖర్చును ఉద్యోగులే భరించాల్సి ఉంటుందని, వ్యాధి గుర్తిస్తే ఆ మొత్తాన్ని చికిత్స ఖర్చులో కలిపి చెల్లించే అవకాశం ఉంటుందని తెలిపారు.
రూ.3 లక్షల సీలింగ్.. అవసరమైతే మరింత మంజూరు
ప్రభుత్వం ట్రస్ట్ బోర్డుకు పూర్తి అధికారాలు ఇచ్చిందని అధికారులు తెలిపారు. అయితే పథకం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో రూ.3 లక్షల వరకు సీలింగ్ పెట్టినట్లు చెప్పారు. అనారోగ్యం, సర్జరీలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో అదనపు మొత్తం అవసరమైతే ట్రస్ట్ బోర్డు అనుమతి తీసుకుని మరింత మొత్తాన్ని కూడా మంజూరు చేసే అవకాశం ఉందని వివరించారు.
దాదాపు అన్ని ఆసుపత్రులతో ఎంవోయూలు పూర్తయ్యాయని, మరికొన్ని ఆసుపత్రులు పైప్‌లైన్‌లో ఉన్నాయని తెలిపారు. కొన్ని ఆసుపత్రులు ఇంకా ముందుకు రాలేదని, వాటితో కూడా ఎంవోయూలు చేసేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు.
డిజిటల్ హెల్త్ కార్డు లేకపోయినా వైద్యం
డిజిటల్ హెల్త్ కార్డు లేకపోయినా ఎంప్లాయీ ఐడీ, PPO నంబర్‌తో వైద్యం చేయించుకోవచ్చని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 28 నాటికి 12,56,962 కార్డులు అందుబాటులోకి రాగా.. 7,56,210 మంది వాటిని డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఇన్‌పేషెంట్ సేవలకు సంబంధించి 1,816 చికిత్స ప్యాకేజీలు అమల్లో ఉన్నాయి.
అత్యవసర కేసులను వెంటనే తీసుకుంటున్న ఆసుపత్రులు
ఉద్యోగులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా అత్యవసర కేసులను అన్ని ఆసుపత్రుల్లో వెంటనే టేకప్ చేస్తున్నారని TGJAC నాయకత్వం తమ దృష్టికి తీసుకొచ్చిందని అధికారులు తెలిపారు.
కొంతమంది ఉద్యోగుల తల్లిదండ్రులు క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఇమ్యూనోథెరపీ చికిత్స EHSలో ఉందా లేదా అనే సందేహం ఉందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. దీనిపై బసవతారకం ఆసుపత్రి ప్రతినిధులతో కూడా సంప్రదించామని, ఇమ్యూనోథెరపీని కూడా EHS కింద అందించాలని ఉద్యోగుల తరఫున కోరుతామని చెప్పారు.
పాత EHS బకాయిలు రూ.100 కోట్లు పెండింగ్
పాత EHS బకాయిలకు సంబంధించి ఇప్పటివరకు రూ.70 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా రూ.100 కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
ప్రస్తుతం 12 వెల్‌నెస్ కేంద్రాలు పనిచేస్తుండగా.. కొత్తగా మరో 25 వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు.