తెలంగాణలో 22-A వివాదాల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా G.O. 59 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని నిర్ణయించింది. ఇంటి నిర్మాణంతో ఉన్న 500 చదరపు గజాలు లేదా అంతకంటే తక్కువ విస్తీర్ణంలోని భూములకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను నెల రోజుల్లోగా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
22-A సమస్యల పరిష్కారానికి మరో కీలక నిర్ణయం
22-A జాబితాతో ముడిపడి ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అపరిష్కృతంగా మిగిలిపోయిన చిన్న ఇళ్ల స్థలాల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. 22-A వివాదాల పరిష్కారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఇది ఏడో కీలక ఉత్తర్వు అని పేర్కొన్నారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నిబంధనల ప్రకారం న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
దరఖాస్తుల పరిశీలనలో కఠిన నిబంధనలు
G.O. 59 కింద దరఖాస్తులను పరిష్కరించే సమయంలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భూమి అసలు రికార్డులు, దరఖాస్తుదారుల అర్హత, క్రమబద్ధీకరణకు ప్రతిపాదించిన భూమి విస్తీర్ణాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
ఇప్పటికే జారీ చేసిన కన్వేయన్స్ డీడ్స్‌కు సంబంధించిన కేసులను కూడా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో అక్రమాలు జరిగినట్లు తేలితే ప్రస్తుత నిబంధనల ప్రకారం వాటిని సమీక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు.
కోర్టు పరిధిలోని భూములపై కీలక సూచనలు
కోర్టు పరిధిలో ఉన్న దరఖాస్తులు, వివాదాస్పద భూములకు సంబంధించిన వ్యవహారాల్లో న్యాయస్థానాల తుది తీర్పులకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలని మంత్రి స్పష్టం చేశారు.
అర్హులైన పేదలకు ప్రయోజనం కల్పించడంతో పాటు, అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించే వారికి అవకాశం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
22-Aలోని సంక్లిష్ట సమస్యలకు ఫాస్ట్ ట్రాక్
నిషేధిత జాబితాతో ముడిపడి ఉన్న 10 నుంచి 12 రకాల సంక్లిష్ట సమస్యలను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
ఆ కమిటీ సిఫారసుల ఆధారంగా ఇప్పటికే G.O. 111, Memo 76కు అనుగుణంగా స్పష్టమైన మెమోలు జారీ చేసి క్షేత్రస్థాయిలో ఉన్న గందరగోళాన్ని తొలగించినట్లు చెప్పారు.
GHMC, HMDA, DTCPతో పాటు మున్సిపల్ అనుమతులు పొందిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఇప్పటికే అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
రిజిస్ట్రేషన్ అడ్డంకులు తొలగించే దిశగా చర్యలు
ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల క్లియరెన్స్‌తో పాటు, నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలను కూడా పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు.
తాజాగా G.O. 59 కింద దరఖాస్తుల పరిష్కారంతో రిజిస్ట్రేషన్ రంగంలో ఉన్న ప్రధాన అవరోధాలు క్రమంగా తొలగిపోతున్నాయని చెప్పారు.
అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రజా పాలనలో సామాన్యులకు రెవెన్యూ సేవలు సులభంగా, పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.