రాష్ట్ర ప్రజలకురేవంత్ గుడ్‌న్యూస్..! | 2 కొత్త పథకాలు

తెలంగాణలో ఇందిరమ్మ భీమా, రాజీవ్ యువ వికాసం పథకాలను నవంబర్ 19న ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతు కుటుంబాలకు రూ.5 లక్షల బీమా రక్షణ, యువతకు స్వయం ఉపాధి కోసం రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపడుతోంది.

Indiramma Bheema
Indiramma Bheema

తెలంగాణలో రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోంది. ఒకవైపు రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకునేందుకు రూ. 5 లక్షల బీమా రక్షణ, మరోవైపు ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకు యువతకు ఆర్థిక చేయూత.. ఇలా కీలక పథకాలను ఒకే రోజున ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

నవంబర్ 19న ఇందిరమ్మ బీమా, రాజీవ్ యువ వికాసం పథకాలను ప్రారంభించనున్నట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ఈ రెండు పథకాలపై లబ్ధిదారుల్లో ఆశలు పెరుగుతున్నాయి.

రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా రక్షణ

తెలంగాణలో రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రైతు మరణిస్తే ఆ కుటుంబం ఒక్కసారిగా ఆదాయాన్ని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే పరిస్థితి ఉంటుంది. పిల్లల చదువులు, కుటుంబ పోషణ, అప్పుల చెల్లింపులు, రోజువారీ ఖర్చులు.. ఇలా ఎన్నో సమస్యలు ఆ కుటుంబాన్ని చుట్టుముడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందిరమ్మ బీమా పథకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. నవంబర్ 19న ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రూ. 5 లక్షల బీమా రక్షణ కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం అని ఆయన వివరించారు.

కులం, మతం, ఆదాయం వంటి అంశాలతో సంబంధం లేకుండా తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికీ బీమా భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని భట్టి విక్రమార్క చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పథకం అమలుకు సంబంధించిన పూర్తి అర్హతలు, కుటుంబాల గుర్తింపు, నమోదు వివరాలు, క్లెయిమ్‌ల పరిష్కారంపై అధికారిక మార్గదర్శకాలు కీలకంగా మారాయి.

ఈ పథకం అమల్లోకి వస్తే కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయం, కూలి పనులు, చిన్నచిన్న వృత్తులపై ఆధారపడే కుటుంబాలకు బీమా రక్షణ ఎంతో అవసరం. అనుకోని ప్రమాదం లేదా కుటుంబ పెద్ద మరణంతో ఆదాయం ఆగిపోయినప్పుడు బీమా పరిహారం ద్వారా ఆ కుటుంబానికి తక్షణ అవసరాలు తీర్చుకోవడంలో తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం

మరోవైపు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని కూడా నవంబర్ 19న ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే నిరుద్యోగులు, చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

కేవలం ఉద్యోగం కోసం వెతికే పరిస్థితి నుంచి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి యువత ఎదగాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు.

రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి విడతలో అర్హులైన లబ్ధిదారులకు రూ. 1 లక్ష వరకు ఆర్థిక సహాయం అందించే దిశగా ఏర్పాట్లు చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచనలు చేశారు.

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న యువతలో తమకు సహాయం ఎప్పుడు అందుతుందనే ఆసక్తి కూడా నెలకొంది.

రెండు పథకాల లక్ష్యం ఒక్కటే

మొత్తంగా నవంబర్ 19న ప్రారంభం కానున్న ఈ రెండు పథకాలు వేర్వేరు వర్గాలకు సంబంధించినవైనా వాటి ప్రధాన లక్ష్యం ఆర్థిక భద్రతను పెంచడం.

ఇందిరమ్మ బీమా ద్వారా కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలకు బీమా రక్షణ కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడాలన్నది ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా చెబుతోంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »