Retirement | ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మరోసారి పెంచే అవకాశాలపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. నెల్లూరు జిల్లా కావలిలో డిప్యూటీ డీఈవో ఎం హరిప్రసాద్ ఉద్యోగ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన సభలో విద్యాశాఖ మౌలిక సదుపాయాల జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం చేసిన వ్యాఖ్యలు ఉద్యోగుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. హరిప్రసాద్ మరో నాలుగు నెలలు సర్వీసులో కొనసాగి ఉంటే బాగుండేదని.. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శాఖాపరమైన ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని, సర్వీసు పొడిగింపు తమకు అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన రామలింగం.. పైకి అలా చెప్పినా ఉద్యోగ కాలం పెరిగితే ఎక్కువమంది కొనసాగేందుకే ఆసక్తి చూపుతారని వ్యాఖ్యానించారు. తనకు అవకాశం వస్తే 72 ఏళ్ల వయసు వరకు కూడా పనిచేయడానికి సిద్ధమేనని చెప్పడం మరింత చర్చకు దారితీసింది.
ప్రస్తుతం రిటైర్మెంట్ వయసు ఎంత?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు. 2022లో అప్పటి జగన్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అనుభవాన్ని వినియోగించుకోవడం, పెరుగుతున్న సగటు ఆయుష్షు, ఆరోగ్య పరిస్థితుల మెరుగుదల వంటి కారణాలను అప్పట్లో ప్రభుత్వం ప్రస్తావించింది. అంతకుముందు 2014లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. అనుభవజ్ఞులైన సిబ్బందిని మరికొంతకాలం సేవల్లో కొనసాగించడం, కీలక శాఖల్లో సిబ్బంది కొరతను తాత్కాలికంగా అధిగమించడం, పరిపాలనలో అనుభవాన్ని వినియోగించుకోవడం వంటి అంశాలు ప్రభుత్వ ఆలోచనలో ఉండొచ్చని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరోవైపు ఆర్థిక కోణం కూడా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే గ్రాట్యుటీ, పెన్షన్ బకాయిలు, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వంపై భారం పడుతుండడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. రిటైర్మెంట్ వయసు పెంపుతో ఆ భారం కొంతకాలం వాయిదా పడుతుందని గతంలో కూడా చర్చ జరిగింది.
ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు
అయితే, రిటైర్మెంట్ వయసు పెంపు ప్రతిపాదనపై ఉద్యోగుల్లో ఏకాభిప్రాయం లేదనే విషయం గత అనుభవాలే చెబుతున్నాయి. ఒకవైపు ఉద్యోగ భద్రత, జీతభత్యాల కొనసాగింపు కోసం కొందరు సానుకూలంగా చూస్తుండగా.. మరోవైపు యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రత్యేకించి నిరుద్యోగ యువత నుంచి ఈ తరహా నిర్ణయాలపై వ్యతిరేక స్వరాలు వినిపించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కొత్త నియామకాలు ఆలస్యమవుతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు లేవు కానీ.. కీలక హోదాలో ఉన్న ఓ ఉన్నతాధికారి బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. నిజంగా ప్రభుత్వం 65 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు పెంపు దిశగా అడుగులు వేస్తుందా? లేక ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయమేనా? అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.


