హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో రహదారులపైకి నీరు

హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది.

Hyderabad Weather
Hyderabad Weather

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20: హైదరాబాద్‌ను వానలు తడిపేశాయి. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, మలక్‌పేటతో పాటు టోలిచౌకి, షేక్‌పేట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరింది. వర్షంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలకు ఎండ వేడి నుంచి ఉపశమనం లభించింది. అటు జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఈ వర్షం రైతులకు కూడా కొంత ఊరటనిచ్చింది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది.

మధ్యాహ్నం తర్వాత ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం కావడంతో నగరంలో వర్షం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. పెద్ద అంబర్‌పేట్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, మలక్‌పేట ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో రహదారులపై నీరు చేరింది.

హైదరాబాద్‌ వెస్ట్‌ సిటీలోనూ వర్షం కురిసింది. టోలిచౌకి, షేక్‌పేట ప్రాంతాల్లో భారీ వర్షం పడగా.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిసర ప్రాంతాల్లోనూ వాన కురిసింది. బేగంపేట, పారడైజ్‌, పట్నీ, బోయిన్‌పల్లి, చిలకలగూడ ప్రాంతాల్లో వర్షం పడింది. బషీర్‌బాగ్‌, అబిడ్స్‌, నారాయణగూడలో చిరుజల్లులు కురిశాయి. ఉప్పల్‌, బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ ప్రాంతాల్లోనూ వర్షం పడింది.

మరోవైపు వర్షంలోనే ఖైరతాబాద్‌ మహాగణపతిని భక్తులు దర్శించుకున్నారు. ఒకవైపు వర్షం నగరానికి చల్లదనాన్ని తీసుకురాగా.. మరోవైపు గణేష్‌ ఉత్సవాల సందడి ఆహ్లాదకరంగా మారింది.

హైదరాబాద్‌తో పాటు వికారాబాద్‌ జిల్లాలోనూ తేలికపాటి వర్షం కురిసింది. గత మూడు వారాలుగా ఎల్‌నినో ప్రభావంతో ఎండలు తీవ్రంగా ఉండటంతో రైతులు ఆందోళన చెందారు. ప్రస్తుతం కురిసిన వర్షంతో రైతులకు కొంత ఊరట లభించింది. పొలాలకు తేమ అందడంతో సాగు పనులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలతో పాటు నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది.

మరోవైపు వికారాబాద్‌ జిల్లాలోనూ పలుచోట్ల తేలికపాటి వర్షం కురుస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో గత మూడు వారాలుగా ఎండాకాలాన్ని తలపించేలా ఎండలు దంచికొట్టాయి. అయితే ప్రస్తుతం జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాదాపు మూడు వారాల తర్వాత వర్షం కురవడంతో రైతులకు కాస్త ఊరట లభించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా ప్రయాణిస్తూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »