Success
-
సక్సెస్ అనేది టాలెంట్ కన్నా ఎక్కువగా మన రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.
-
మొబైల్ వినియోగాన్ని తగ్గించి, ఏకాగ్రతతో పనిచేస్తే ఫలితాలు వేగంగా వస్తాయి.
-
చిన్న సుఖాలను త్యాగం చేసి క్రమశిక్షణను అలవాటు చేసుకుంటే విజయం తప్పకుండా చేరుకుంటుంది
హైదరాబాద్: ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కోరిక ఉంటుంది. అయితే, అద్భుతమైన తెలివితేటలు, టాలెంట్ ఉన్నా కూడా చాలామంది సక్సెస్ కాలేకపోతుంటారు. దీనికి ప్రధాన కారణం మన దైనందిన అలవాట్లే. మనల్ని వెనక్కి లాగే పనులను వదిలేసి, క్రమశిక్షణతో కూడిన కొత్త మార్గంలో పయనిస్తే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. లక్ష్య సాధనలో మీకు సహాయపడే ఆ 5 కీలక మార్పులు ఇవే..
జీవితాన్ని మార్చే 5 సూత్రాలు:
మొబైల్ వాడకం: ప్రస్తుతం మన సమయాన్ని హరించే అతిపెద్ద శత్రువు సోషల్ మీడియా. ఫోన్ వాడకాన్ని వీలైనంత తగ్గించాలి. ముఖ్యంగా నిద్రలేచిన తర్వాత మొదటి రెండు గంటలు మొబైల్‌కు దూరంగా ఉంటే, ఆ రోజంతా మీ మెదడు ఎంతో చురుగ్గా, ఏకాగ్రతతో పనిచేస్తుంది.
ఏకాంతం: మనం ఎప్పుడూ ఆనందం కోసం ఇతరులపై ఆధారపడుతుంటాం. కానీ ఏకాంతంలో ఉన్నప్పుడే మన అంతరాత్మ మాటను వినగలం. మీ భయాలను, సమస్యలను ఇతరులతో చర్చించే ముందు ఒక కాగితంపై రాసి చూడండి. సమస్య చిన్నదిగా అనిపించడమే కాకుండా, మీకే మంచి పరిష్కారాలు తడతాయి.
క్రమబద్ధమైన ఆలోచనలు: గదిలో వస్తువులు చిందరవందరగా ఉంటే పని చేయలేం, అలాగే మనసులో ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉంటే విజయం సాధించలేం. మీ లక్ష్యాల గురించి ఇతరులకు చెప్పి సమయం వృధా చేయకుండా, ప్రశాంతంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిని అమలు చేయడం మొదలుపెట్టండి.
పనిపై సంపూర్ణ ఏకాగ్రత: రోజులో కనీసం నాలుగు గంటలు అత్యంత ముఖ్యమైన పని కోసం కేటాయించండి. ఆ సమయంలో సంగీతం, పాడ్‌కాస్ట్‌లు వంటి పరధ్యానం కలిగించే పనుల జోలికి వెళ్లొద్దు. నిశ్శబ్దంగా పని చేయడం వల్ల మీ సృజనాత్మకత పెరగడమే కాకుండా, పని నాణ్యత కూడా ఐదు రెట్లు పెరుగుతుంది.
త్యాగం చేయడం: గొప్ప విజయాలు అందుకోవాలంటే కొన్ని చిన్న చిన్న సుఖాలను వదులుకోవాలి. మితిమీరిన విశ్రాంతి, అనవసరమైన స్నేహాలు, బయట తిరగడం వంటి వాటిని తగ్గించుకోవాలి. ఇవి కష్టంగా అనిపించినా, భవిష్యత్తులో మీరు అనుకున్న శిఖరాలను చేరుకోవడానికి ఇవే పునాదులు వేస్తాయి.
సక్సెస్ అనేది అదృష్టం వల్ల వచ్చేది కాదు, మనం అనుసరించే పద్ధతుల వల్ల వచ్చేది. ఈ ఐదు సూత్రాలను మీ జీవితంలో భాగంగా చేసుకుంటే, అతి తక్కువ కాలంలోనే మీరు ఆశించిన మార్పును చూడగలరు.