Kamada Ekadashi: చైత్ర మాసపు తొలి ఏకాదశి ‘కామద’.. విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఈ రోజు ఏం చేయాలో తెలుసా?

2026 కామద ఏకాదశి ముహూర్తం, ఉపవాస నియమాలు మరియు దాన ఫలాల వివరాలు. ఈ పవిత్ర రోజున శ్రీమహావిష్ణువును అర్చిస్తే పాపాలు తొలగి, కోరికలు నెరవేరుతాయి.

Kamada Ekadashi 2026 Dates
Kamada Ekadashi 2026 Dates

హైదరాబాద్: సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి నెలా వచ్చే కృష్ణ పక్షం, శుక్ల పక్ష ఏకాదశులలో భక్తులు నిష్ఠతో ఉపవాసాలు పాటిస్తారు. ఈ పవిత్ర దినం లోకరక్షకుడైన శ్రీమహావిష్ణువుకు అంకితం చేశారు. అయితే, తెలుగు నూతన సంవత్సరం చైత్ర మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని ‘కామద ఏకాదశి’ అని పిలుస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి స్వామివారిని అర్చించడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పటాపంచలై, దైవ ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

2026 కామద ఏకాదశి ముహూర్తం వివరాలు:

  • పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఏకాదశి తిథి సమయాలు ఇలా ఉన్నాయి.
  • ఏకాదశి ప్రారంభం: మార్చి 28, శనివారం (రేపు) ఉదయం 08:45 గంటలకు ప్రారంభమవుతుంది.
  • ఏకాదశి ముగింపు: మార్చి 29, ఆదివారం ఉదయం 07:46 గంటలకు ముగుస్తుంది.
  • వ్రత ఆచరణ: ఉదయ తిథి ప్రాముఖ్యత దృష్ట్యా మార్చి 29, ఆదివారం నాడు కామద ఏకాదశి వ్రతాన్ని పాటించాలి.
  • వ్రత విరమణ (పారణ): మార్చి 30, సోమవారం ఉదయం 06:14 నుండి 07:09 గంటల మధ్య ఉపవాసాన్ని విరమించడం శుభప్రదం.

కామద ఏకాదశి విశిష్టత:

కామద అంటే భక్తుల కోరికలను తీర్చేది అని అర్థం. ఈ పవిత్ర తిథి నాడు భక్తితో ఉపవాసం ఉన్నా లేదా శక్తి మేరకు దానధర్మాలు చేసినా.. తీరని కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దీనివల్ల ఇంట్లో సంపద, ఐశ్వర్యం పెరగడమే కాకుండా మనసులో ప్రశాంతత చేకూరుతుంది.

దానం చేయాల్సినవి :

  • కామద ఏకాదశి నాడు చేసే దానాలకు అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా కింది వస్తువులను దానం చేయడం శ్రేయస్కరం.
  • జల దానం: వేసవి కాలం దృష్ట్యా మట్టి కుండలో స్వచ్ఛమైన నీటిని నింపి దానం చేయడం అత్యుత్తమమైన పని.
  • ధాన్యాలు, పండ్లు: గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలతో పాటు, ఈ సీజన్‌లో లభించే పుచ్చకాయలు, మామిడి పండ్లను దానం చేయడం శుభప్రదం.
  • వస్తు దానం: పేదలకు గొడుగులు లేదా పాదరక్షలు (బూట్లు, చెప్పులు) బహుకరించడం గొప్ప పుణ్యకార్యంగా పరిగణింస్తారు.
  • జ్ఞాన దానం: ఆధ్యాత్మిక లేదా మతపరమైన పుస్తకాలను అవసరమైన వారికి దానం చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి.

జీవితంలోని చీకట్లు తొలగిపోవాలంటే..

ఈ రోజు సాయంత్రం దేవాలయంలో కానీ లేదా ఇంటి వద్ద ఉన్న తులసి కోట దగ్గర కానీ నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని కష్టాలు, చీకట్లు తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం.

Also Read: శనివారం రోజున ఈ తప్పులు చేస్తున్నారా? అయితే కష్టాలు తప్పవు!

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »