తులసి మొగ్గలను గోళ్ళతో తుంచుతున్నారా? దీనివల్ల కలిగే నష్టాలు ఇవే

చలికాలంలో తులసి మొక్క(Tulasi) ఎండిపోవడానికి కేవలం చలి మాత్రమే కాదు, మనం చేసే చిన్న తప్పులే ప్రధాన కారణం. సరైన నీరు, సహజ పోషకాలు, మొగ్గల కత్తిరింపు, చలి నుంచి రక్షణ వంటి గార్డెనింగ్ నిపుణుల సూచనలు పాటిస్తే తులసి మొక్క ఆరోగ్యంగా, పచ్చగా పెరుగుతుంది.

Tulasi
Tulasi

Tulsi

హైదరాబాద్: హిందూ సంప్రదాయంలో తులసి (Tulsi)మొక్కను కేవలం ఒక మొక్కగా కాకుండా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా, దైవంగా భావిస్తాం. అందుకే ప్రతి ఇంట్లో తులసి కోట ఉంటుంది. అయితే, చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా ఇళ్లలో తులసి ఆకులు నల్లగా మారతాయి. లేదా మొక్క పూర్తిగా ఎండిపోవడం మనం చూస్తుంటాం. దీనికి కేవలం చలి మాత్రమే కారణం కాదు, మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా మొక్కను దెబ్బతీస్తాయి. గార్డెనింగ్ నిపుణుల సూచనల ప్రకారం, తులసిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పాటించాల్సిన సులభమైన పద్ధతులు ఇవే.

నీటి జాగ్రత్త:

తులసి (Tulsi)మొక్క ఎండిపోవడానికి ప్రధాన శత్రువు ఎక్కువగా నీరు పోయడం. భక్తితో కుటుంబ సభ్యులందరూ పెద్ద పాత్రలతో నీళ్లు పోయడం వల్ల వేర్లకు ఫంగస్ సోకి మొక్క కుళ్లిపోతుంది. కాబట్టి, నీళ్లు పోయడానికి చిన్న పాత్రను వాడండి. మట్టిలో తేమ ఎక్కువగా ఉంటే, వెంటనే ఆ కుండీని ఎండ తగిలే చోట పెట్టి, పైపైన మట్టిని కాస్త గీకండి. దీనివల్ల అదనపు తేమ ఆరిపోతుంది.

సహజమైన పోషకాలు:

చలికాలంలో మొక్కలు ఎదుగుదల ఆగిపోయే దశలోకి వెళ్తాయి. ఆ సమయంలో వాటికి శక్తినిచ్చే పోషకాలు అవసరం. మన ఇంట్లో ఉండే టీ ఆకులు దీనికి అద్భుతంగా పనిచేస్తాయి. తాజా టీ ఆకులను ఒకటి లేదా రెండు చెంచాలు మట్టిలో కలిపితే మొక్కకు అవసరమైన నైట్రోజన్ అందుతుంది. అలాగే, ఆవపిండిని నీటిలో కలిపి తయారు చేసిన ద్రవ ఎరువును ప్రతి 15 రోజులకు ఒకసారి కొద్దిగా ఇస్తే మొక్క బలంగా పెరుగుతుంది.

Tulasi
Tulasi

మొగ్గలు, కొమ్మల కత్తిరింపు:

తులసి మొక్కకు మొగ్గలు రాగానే మొక్క తన శక్తిని అంతా వాటి కోసమే ఖర్చు చేస్తుంది. దీనివల్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. అందుకే ఆ మొగ్గలను ఎప్పటికప్పుడు తొలగించాలి. అయితే, వీటిని తొలగించేటప్పుడు గోళ్లను వాడకుండా, సున్నితంగా చేతివేళ్లతో తుంచేయాలి. ఎండిన కొమ్మలను కూడా తీసేయడం వల్ల కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా తయారవుతుంది.

చలి నుంచి రక్షణ:

నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు తులసికి వెచ్చదనం చాలా అవసరం. వీలైనంత ఎక్కువ ఎండ తగిలే చోట మొక్కను ఉంచండి. రాత్రిపూట కురిసే మంచు, చల్లటి గాలుల నుంచి కాపాడటానికి రాత్రి వేళల్లో గోనె సంచులు లేదా కార్డ్‌బోర్డ్ డబ్బాలతో మొక్కను కప్పి ఉంచడం మంచిది.

పసుపుతో ఫంగస్ దూరం:

మొక్క వేర్లకు పట్టే ఫంగస్ లేదా చీమల సమస్యను పోగొట్టడానికి మన వంటింట్లోని పసుపు ఒక అద్భుతమైన మందు. పసుపులో ఉండే యాంటీ-ఫంగల్ గుణాలు మొక్కను రక్షిస్తాయి. కుండీలోని మట్టిని లైట్‌గా తవ్వి కొంచెం పసుపు పొడిని చల్లితే మొక్క ఆరోగ్యంగా, పచ్చగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »