Ebola Virus | డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణాలను మానుకోవాలని, అత్యవసరమైతేనే వెళ్లాలని పౌరులకు భారత ప్రభుత్వం సూచించింది. ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా కాంగో, ఉగాండాలో వ్యాపిస్తున్న ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ ఎబోలా విస్తరణ నేపథ్యంలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైన హీమరేజిక్ జ్వరానికి కారణమవుతుందని అధికారులు తెలిపారు. ఈ వైరస్‌కు ఇప్పటివరకు ప్రభావవంతమైన టీకా, నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదని సమాచారం. మరణాల రేటు కూడా అధికంగా ఉండటంతో పరిస్థితిని తీవ్రను తెలుపుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐహెచ్‌ఆర్ ఎమర్జెన్సీ కమిటీ ఈ నెల 22న తాత్కాలిక మార్గదర్శకాలు జారీ చేసింది.
Read Also : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం.. నిజామాబాద్‌లో అత్యధికంగా 45.7 డిగ్రీలు..
భారత్‌లో కేసులు నమోదు కాలేదు..
వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో జ్వరం వంటి లక్షణాలను గుర్తించడం, పరీక్షించడం, నివేదిక ఇవ్వడం వంటి చర్యలను కట్టుదిట్టం చేయాలని సూచించింది. అలాగే, ప్రభావిత ప్రాంతాలకు అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని హెచ్చరించింది. కాంగో, ఉగాండా సరిహద్దు దేశాలు అయిన దక్షిణ సూడాన్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలు కూడా హైరిస్క్ ప్రమాద జోన్‌గా గుర్తించింది. వైరస్ వ్యాప్తి అక్కడి నుంచి ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి భారత్‌లో ఎబోలా వైరస్ కేసులు ఏవీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ముందస్తు జాగ్రత్తగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్థానిక ఆరోగ్య మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఉన్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలు పూర్తిగా నివారించాలని ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది.
Read Also : ధాన్యానికి అనుగుణంగా లారీల సంఖ్య పెంచాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
ఎబోలా లక్షణాలు..
ఎబోలా సోకిన రెండు నుంచి 21 రోజుల మధ్య లక్షణాలు బయటపడుతాయి. అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరం, అలసటకండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, దద్దుర్లువ్యాధి ముదిరిన తర్వాత కాలేయం, మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. ముక్కు, నోరు, కళ్ళు, మలం ద్వారా రక్తం కారుతుంది. వైరస్ ఇప్పటికే వైరస్ సోకిన జంతువుల (గబ్బిలాలు, చింపాంజీలు) రక్తం, కణజాలం, శరీర నుంచి వచ్చే ద్రవాల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఒకసారి మనిషికి సోకిన తర్వాత, రోగి రక్తం, ఇతర శరీర ద్రవాలు (ఉమ్మి, చెమట, వీర్యం) ఇతరులకు తగలడం ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. రోగి ఉపయోగించిన దుస్తులు, సిరెంజీల ద్వారా కూడా వైరస్ సోకుతుంది. ఎబోలా సోకిన వారికి ప్రత్యేకమైన యాంటీవైరల్ మందులు అందుబాటులో ఉన్నప్పటికీ.. వ్యాధిని ముందుగానే గుర్తిస్తే మెరుగైన వైద్య సహాయం అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. రోగులను తాకకుండా ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు.
Read Also : గంటకు 280 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ట్రైన్ ఇదే..! బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ రివీల్..!


