RBI Currency | దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగదు అవసరం ఇంకా భారీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పట్నా, ముంబయి జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశాల్లో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్టు ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నడం, తక్కువ నిర్వహణ ఖర్చుతో ఉండటమే ఈ ఆలోచనకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణపై ఆర్‌బీఐ ఖర్చు సుమారు రూ.6,372 కోట్లకు పైగా చేరినట్లు సమాచారం. ఇది గత ఏడాదితో పోలిస్తే గణనీయమైన పెరుగుదలగా అధికారులు చెబుతున్నారు.
Read Also : ఆ రెండురోజులు బ్యాంకులు మూతపడుతాయా..? ఎస్‌బీఐ అఫీషియల్ ప్రకటనలో ఏం చెప్పిదంటే..?
నగదు చలామణి తగ్గుతున్నదని భావించినా, వాస్తవానికి మార్కెట్లో క్యాష్ డిమాండ్ ఇంకా బలంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో నగదు చలామణి విలువ రికార్డు స్థాయిలో రూ.42 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా. ఇక మరోవైపు, పాడైపోయిన, చిరిగిన నోట్లను సేకరించడం, వాటిని నాశనం చేయడం కూడా ఆర్‌బీఐకి పెద్ద సవాలుగా మారుతోంది. గత ఏడాదిలోనే దాదాపు 23.8 బిలియన్ పాత నోట్లు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా రూ.100, రూ.500 నోట్లు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పాలిమర్ నోట్లు ప్రవేశపెడితే వాటి ఆయుష్షు ఎక్కువగా ఉండటంతో ఈ సమస్య కొంతవరకు తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2012లోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐదు నగరాల్లో రూ.10 పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది.
Read Also : కేన్స్ రెడ్‌కార్పెట్‌పై మెరిసిన ఐశ్వర్యరాయ్.. అందరి చూపు ఆమె వైపే..!
అయితే, సాంకేతిక పరిమితులు, మౌలిక సదుపాయాల సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ అప్పట్లో నిలిచిపోయింది. ఇప్పుడు అయితే ఏటీఎంలు సహా బ్యాంకింగ్ వ్యవస్థలో సాంకేతిక మార్పులు బాగా అభివృద్ధి చెందడంతో, ఈసారి ఆ ప్రణాళికను మరింత విస్తృతంగా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నా, దేశంలో నగదు వినియోగం తగ్గకపోవడం ఆర్‌బీఐను కొత్త మార్గాల వైపు ఆలోచించేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో పాలిమర్ నోట్లపై ప్రయోగాత్మక దశ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also : తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. రోజ్‌గార్ మేళాలో కేంద్రమంత్రి బండి సంజయ్ కామెంట్స్..


