రాబోయే ఐదేళ్ల‌లో చుక్క‌లే ఇక‌..! భారీగా పెర‌గ‌నున్న ఉష్ణోగ్ర‌త‌లు..!

ప్రపంచ ఉష్ణోగ్రతలు (Global Temperatures) రానున్న ఐదేళ్లలో రికార్డు స్థాయిలో కొనసాగే ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. 2026-2030 మధ్య కనీసం ఒక ఏడాది భూమి ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌ స్థాయిని దాటే అవకాశాలు 91 శాతం ఉన్నాయని తాజా నివేదిక వెల్లడించింది. ఎల్‌నినో (El Niño), ఆర్కిటిక్‌ వేడిమి (Arctic Warming) ప్రభావంపై ఆందోళనలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

WMO Warns | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రానున్న ఐదేళ్లలో మరింత ఆందోళనకర స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. యూకే మెటాఫీస్‌ రూపొందించిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటుతో పోలిస్తే మరింత వేగంగా పెరుగుతాయని నివేదిక స్పష్టం చేసింది. 2026 నుంచి 2030 మధ్యకాలంలో ప్రపంచ సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవానికి ముందున్న స్థాయిలతో పోలిస్తే 1.3 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్‌ వరకు అధికంగా నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది. ఈ ఐదేళ్లలో కనీసం ఒక సంవత్సరం 2024లో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలను దాటే అవకాశాలు 86 శాతం ఉన్నాయని పేర్కొంది.

Read Also : దశాబ్దంలోనే తొలిసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఏపీలో ప్రతాపం చూపుతున్న భానుడు..!

పారిస్ ఒప్పందంలో..

ఇక 2026-2030 మధ్య కనీసం ఒక ఏడాది అయినా ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌ స్థాయిని దాటే అవకాశాలు 91 శాతం ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇదే పరిస్థితి 2024లో కూడా కనిపించిందని, ఆ ఏడాది ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవానికి ముందున్న స్థాయిల కంటే సుమారు 1.55 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా నమోదైందని వెల్లడించింది. అయితే, ఈ తాత్కాలిక పెరుగుదలని పారిస్‌ వాతావరణ ఒప్పంద ఉల్లంఘనగా ప‌రిగ‌ణించొద్ద‌ని డబ్ల్యూఎంఓ స్పష్టం చేసింది. పారిస్‌ ఒప్పందంలో ఉష్ణోగ్రతల అంచనాలను దీర్ఘకాలిక సగటు ఆధారంగా.. సాధారణంగా 20 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనా వేస్తారని తెలిపింది. నివేదిక ప్రధాన రచయిత డాక్టర్‌ లియోన్‌ హెర్మాన్సన్ మాట్లాడుతూ.. 2026 చివర్లో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. దాని ప్రభావంతో 2027 మరో అత్యంత వేడిగల సంవత్సరంగా నమోదయ్యే అవకాశాలు మరింత పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

Read Also : ఏపీకి పెట్టుబడుల ప్రవాహం.. నెల్లూరులో రూ.3వేలకోట్లకుపైగా ఐఎఫ్‌ఎఫ్‌ పెట్టుబడి..

మ‌రింత తీవ్రంగా మారే ప్ర‌మాదం..

మధ్య ఉష్ణమండల పసిఫిక్‌ మహాసముద్రంలోని నినో 3.4 ప్రాంతంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కూడా 2027, 2028లో ఎల్‌నినో ప్రభావం బలపడే సూచనలు ఇస్తున్నాయని నివేదిక వెల్లడించింది. పారిస్‌ వాతావరణ ఒప్పందం ప్రకారం ప్రపంచ దేశాలు భూమి ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక విప్లవానికి ముందున్న స్థాయిలతో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్‌ లోపే పరిమితం చేయాలని, సాధ్యమైనంత వరకు 1.5 డిగ్రీలకే కట్టడి చేయాలని అంగీకరించాయి. అయితే, 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు కొనసాగితే వాతావరణ మార్పుల ప్రభావం మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తుఫానులు, కరువు, భారీ వర్షాలు, అడవి మంటలు వంటి విపరీత వాతావరణ పరిస్థితులు మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ మార్పులకు తగిన చర్యలు తీసుకోవడం కూడా క్రమంగా కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు తీవ్ర ఉష్ణోగ్రతలు, మంచు కరుగుదల, సముద్ర మట్టం పెరుగుదల వంటి పరిణామాలను ఎదుర్కొంటున్న వేళ తాజా నివేదిక మరింత ఆందోళన కలిగిస్తోంది.

Read Also : హీరా గ్రూప్‌ ఫ్రాడ్‌ కేసు.. నౌహీరా షేక్‌ను అరెస్టు చేసిన ఈడీ..!

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »