CM Revanth Reddy | దేశానికి ఆదర్శం మన మహిళలేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సచివాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న 8 వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఒకే రోజు, ఒకే సమయంలో 8 వేల భవనాలకు శంకుస్థాపన చేయడం దేశంలోనే సంచలన నిర్ణయమని సీఎం పేర్కొన్నారు. మహిళా సంఘాలకు సొంత భవనాలు ఉండటం అంటే కేవలం సమావేశాల వేదిక కాదని, వారి ఆర్థిక కార్యకలాపాలు, శిక్షణ, వ్యాపార ప్రణాళికలకు శాశ్వత కేంద్రాలుగా మారతాయని తెలిపారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. “మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబం నిలబడుతుంది, కుటుంబం నిలబడితే గ్రామం బలపడుతుంది, గ్రామం బలపడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది” అని అన్నారు.
Read Also : భగీరథ్‌ను అరెస్ట్ చేయలేదు.. లొంగిపోయాడు.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్
రూ.10లక్షలకు రుణాలు పెంపు..
మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.60,472 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించగా, వడ్డీ లేని రుణాలకు రూ.1,390 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మహిళా సంఘాలు చిన్న ఉపాధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా పెద్ద వ్యాపారాల్లోకి రావాలని సీఎం పిలుపునిచ్చారు. రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైతే 100 ఎకరాల వరకు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ధాన్యం కొనుగోలు, నిల్వ, మిల్లింగ్ వ్యవస్థలో మహిళా సంఘాల పాత్ర పెంచనున్నట్లు సీఎం తెలిపారు. సంఘాలే వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. “ఆడబిడ్డలు ప్రతి గింజకు జవాబుదారులుగా ఉంటారు” అని అన్నారు.
Read Also : నిరుపేదల ప్రాణాలంటే ఎందుకు ఇంత చులకన భావం?.. రేవంత్ సర్కారుపై హరీశ్‌రావు ఫైర్
సూపర్ బజార్లు ఏర్పాటు చేయాలని పిలుపు..
పట్టణాల్లో డీమార్ట్, బిగ్‌బజార్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వీటికి తక్కువ ధరకు భూములు లీజుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే వాటాదారుగా ఉంటుందని చెప్పారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల నాలుగు కొత్త డిజైన్లను ఆవిష్కరించారు. ఈ సారి చిలుకపచ్చ రంగులో చీరలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే మహిళా సంఘాల ద్వారా 1000 సోలార్ మెగావాట్ ప్రాజెక్టులు, 1000 బస్సుల కొనుగోలు, పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also : మద్యం ప్రియులకు షాక్ ఇవ్వబోతున్న సర్కారు.. జూన్ నుంచి ధరల పెంపు..!


