జగిత్యాల జిల్లాలో మెడికల్ కళాశాల విద్యార్థుల ఆందోళన రెండో రోజు కూడా కొనసాగింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న “జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. కాలేజ్ ఎక్కడ చిన్నోడా” పాటతో వినూత్నంగా నిరసన చేపట్టారు. పర్మినెంట్ కాలేజ్ బిల్డింగ్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఐదేళ్లుగా మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో సరైన వసతులు లేక రేకుల షెడ్లలోనే తరగతులు నిర్వహిస్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ నుంచి కాలేజీకి ప్రతిరోజూ కాలినడకన వెళ్లాల్సి వస్తోందని, సరైన మెస్, వాష్‌రూమ్ సౌకర్యాలు కూడా లేవని వాపోయారు.
విద్యార్థుల సమస్యలపై మాట్లాడిన వారు.. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే అప్పట్లో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు.. అవసరమైన వసతులు కల్పించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.
మెడికల్ కళాశాలలు ప్రారంభించి ఐదేళ్లు అవుతున్నా ఇప్పటికీ పక్కా భవనాల నిర్మాణం పూర్తి కాలేదని, హాస్టల్ భవనాల నిర్మాణం కూడా పూర్తికాలేదని తెలిపారు. దీంతో ఇప్పటికీ ప్రైవేట్ భవనాలు, రేకుల షెడ్లలోనే తరగతులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ప్రైవేట్ హాస్టల్‌ను దూరంగా ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ప్రతిరోజూ కాలేజీకి నడుచుకుంటూ రావాల్సి వస్తోందని తెలిపారు. కాలేజీ భవనాలు, హాస్టల్ భవనాలు లేక చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్న మెడికో విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు కూడా నిరసన కొనసాగించారు.
అధికారుల నుంచి స్పందన కరవు
రెండు రోజులుగా విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నా ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే, అధికారులు, కళాశాల యాజమాన్యం నుంచి ఎవరూ స్పందించలేదని విద్యార్థులు తెలిపారు. ఒక మెడికల్ కళాశాలలో ఒక బ్యాచ్ నాలుగేళ్లు చదువుతుందని, మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులు ఈ ఏడాది బయటకు వెళ్లే అవకాశం ఉన్నా ఇప్పటికీ వసతులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
“జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. కాలేజ్ ఎక్కడ చిన్నోడా”
జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థుల వినూత్న నిరసన
సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న “జిమ్ జిమ్ తార” పాటతో పర్మినెంట్ కాలేజ్ బిల్డింగ్ నిర్మించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగిన జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులు
— Telugu Scribe (@TeluguScribe) October 8, 2026
కొత్త కాలేజీ భవన నిర్మాణ పనులను త్వరగా చేపట్టడంతో పాటు హాస్టల్ భవనాలను కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ పూర్తయితే ప్రతిరోజూ కాలేజీకి నడుచుకుంటూ వెళ్లే బాధ తప్పుతుందని చెప్పారు.
విద్యార్థుల నిరసన మూడో రోజుకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


