టీవీ మొబైల్, సోషల్ మీడియా వ్యసనంలో చిక్కుకుంటున్న బాల్యానికి ఖమ్మంలోని ప్రభుత్వ పాఠశాల భిన్నమైన దారి చూపుతుంది బాల సాహిత్యం ద్వారా చిన్నారులకు తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేస్తూ వారి చేతే కొత్త కథలు సృష్టింపజేస్తున్నారు. ఈ కృషికి గుర్తింపుగా ఆ పాఠశాల పిల్లలకు ప్రతిష్టాత్మక చాంద్ సితారే బాల సాహిత్యం అవార్డ్ లభించింది.
ఖమ్మం నగరంలోని మోమినన్ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు సయ్యద్ షఫీ విద్యార్థుల్లో పుస్తక పఠన అలవాటును పెంపొందించడంతో పాటు తెలుగు భాష, సాహిత్యంపై ఆసక్తి కలిగించాలనే లక్ష్యంతో బాల సాహిత్య కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లాక టీవీ, రీల్స్‌లో మునిగిపోయే పిల్లలను పుస్తకాల వైపు మళ్లించేందుకు తరగతి గదిలోనే పుస్తకాలమర ఏర్పాటు చేశారు. అనేక బాల సాహిత్య పుస్తకాలను అందుబాటులో ఉంచారు. దీంతో పిల్లలు లైబ్రరీ పీరియడ్ కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
బాల సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న సంస్థలు అందించే ఈ అవార్డు ఖమ్మం ప్రభుత్వ పాఠశాల పిల్లల సృజనాత్మకతకు జాతీయ గుర్తింపు తెచ్చింది. న్యాయ నిర్ణేతలు పిల్లలు రాసిన కథల్లోని సహజత్వం, తెలుగు నుడికారాన్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. టెక్నాలజీని పూర్తిగా దూరం పెట్టడం కాదు.. పుస్తకంతో సమతుల్యం చేయడమే ఈ ప్రయోగ విజయ రహస్యమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి బాల సాహిత్య క్లబ్ ఉండాలని సూచిస్తున్నారు.
పిల్లలతో కథలు రాయించాలనే ఆలోచన ఎలా వచ్చింది?
సయ్యద్ షఫీ మాట్లాడుతూ.. “నేను 2018లో నాగులవంచ పాఠశాలలో పనిచేసినప్పుడు అక్కడ పిల్లలు కథల పుస్తకాల కోసం గుంజుకుంటున్నారు. అరే.. ఇన్ని పుస్తకాలు ఉన్నాగా, కథల పుస్తకాలు ఎందుకు గుంజుకుంటున్నారు.. వీళ్లతోనే కథలు రాయిస్తే ఎలా ఉంటుంది? అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. 2017లో ప్రారంభించి నవంబర్, డిసెంబర్‌లో వర్క్‌షాప్ పెట్టి 80 మందికి ట్రైనింగ్ ఇస్తే కేవలం తొమ్మిది కథలే సెలెక్ట్ అయ్యాయి.
ఆ తొమ్మిది కథలతో డీటీపీ, చైన్ బైండింగ్ చేసి పెడదాం అనుకున్నాను. కానీ తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఈ పుస్తకం వేయిస్తే ఎలా ఉంటుంది? అని ఒక ఆలోచన వచ్చింది. మిత్రుల ఆర్థిక సహకారంతో పుస్తకం వేయించాను. అప్పటివరకు ఇది ముందుకు సాగాలని గానీ, బాల సాహిత్యం చేయాలని గానీ అనుకోలేదు. ఆ పుస్తకంతో ఆగిపోదాం అనుకున్నాను.
దాని తర్వాత రిక్కా బజార్ వచ్చిన తరువాత అక్కడ పిల్లలను చూసిన తర్వాత ఇంత స్కోప్ ఉంది కదా.. ఈ పిల్లలందరినీ ఎంతో కొంతమందిని బాల సాహితీవేత్తలుగా తీర్చిదిద్దితే బాగుంటుందని ఆలోచన మళ్లీ కొనసాగింది. ఆ పుస్తకానికి రాష్ట్ర స్థాయిలో ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఎంతో మంది వాళ్ల ప్రసంగాల్లో ‘ప్రియమైన నమ్మక’ పుస్తకం గురించి ప్రస్తావించడం, రేడియోలో వక్తలు ప్రసంగించడం, ఆ పుస్తకం గురించి మాట్లాడటం నాకు, నా విద్యార్థులకు, ఈ పాఠశాలకు ఎంతో సంతోషం కలిగించిన విషయం” అని తెలిపారు.
తండ్రులపై విద్యార్థులతో పుస్తకం
ఆ తర్వాత తొమ్మిదో తరగతిలో ‘ముఖాముఖి’ అనే ప్రక్రియ ఉంటుందని, దాన్ని విద్యార్థుల తండ్రులతో చేపిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నట్లు షఫీ తెలిపారు. నవంబర్‌లో వర్క్‌షాప్ నిర్వహించి, డిసెంబర్‌లో పుస్తకం రాయడం మొదలుపెట్టి.. డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి, సెలక్షన్ చేసి జనవరిలో పుస్తకాన్ని ఆవిష్కరిస్తానని చెప్పారు.
విద్యార్థులు కథల పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతున్న సమయంలో వారితోనే కథలు రాయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో 2018లో తొలి పుస్తకాన్ని విద్యార్థులతో రాయించి ప్రచురించారు. ఇంగ్లీష్ మీడియం హవాలో తెలుగు కథలు కనుమరుగవుతున్న వేళ ఈ ప్రయోగం భాషకు కొత్త ఊపిరి పోస్తోందని చెబుతున్నారు.
పిల్లల పదజాలం పెరగడం, వ్యాకరణ దోషాలు తగ్గడం, ఊహాశక్తి, నైతిక విలువలు పెరగడం వంటి మార్పులు కనిపించాయని తెలిపారు.
“మా నాన్న హీరో”.. విద్యార్థి అనుభవం
ఓ విద్యార్థి మాట్లాడుతూ.. “నేను ఇప్పటికి రెండు పుస్తకాలలో భాగమై ఉన్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటి పుస్తకం ‘మా నాన్న హీరో’. మా నాన్నతో ఉన్న అనుభవాలు అన్నీ రాసుకున్నాను. మా నాన్న నాతో, మాతో దూరంగా ఉంటారు.
నలభై మంది వరకు రాశారు. ఎనిమిది మందిని సెలెక్ట్ చేశారు. రాసిన వాళ్లందరూ మంచిగా రాశారు. కానీ దాంట్లో మంచి వాళ్లని ఎంచుకోవాలని నలభై మందిలో ఎనిమిది మందిని ఎంచుకున్నారు. ఆ ఎనిమిది మందిలో నేను ఒక్కదాన్ని అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
మా ఇంట్లో కూడా చెప్పాను. ఇలా నేను రాశాను, సెలెక్ట్ కూడా అయ్యానంటే చాలా ఆనందపడ్డారు. బుక్ వచ్చినాక ఇంకా చాలామంది ఆనందపడ్డారు. ఆ బుక్ మా నాన్న వరకు కూడా వెళ్లింది. చదివాడు. ‘చాలా బాగా రాసింది నా కూతురు నా గురించి’ అని అన్నారు.
నేను సెవెంత్ నుంచే రాయాలి, రాయాలని అనుకున్నాను. ఎయిత్‌కి వచ్చాక స్టార్ట్ చేశాను. ఫస్ట్‌లోనే సెలెక్ట్ అయ్యాను. తర్వాత నైన్త్‌లో అన్ని స్కూళ్ల నుంచి ‘బాలల బాట బంగారుమాట’ రాయాలంటే నేను ‘పెద్దలను గౌరవించండి’ అని రాశాను. దాంట్లో కూడా నేను సెలెక్ట్ అయినందుకు ఆనందంగా ఉంది” అని చెప్పింది.
మరో విద్యార్థి మాట్లాడుతూ.. “తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆ పుస్తకం రాశాను. ఆ పుస్తకం రాసేటప్పుడు మా తెలుగు సార్ చాలా ప్రోత్సహించారు. మేము రాయడానికి చాలా రోజులు పట్టింది. సార్ మాకు బాగా గైడెన్స్ చేశారు. రాస్తున్నప్పుడు చాలా సార్లు మిస్టేక్స్ వెళ్లాయి. సార్ గైడెన్స్ చేసి చెప్పారు.
అది రాసిన తర్వాత మా ఇంట్లో వాళ్లు చాలా ఆనందపడ్డారు. మా నాన్న చనిపోయారు. నాన్న గురించి రాసేటప్పుడు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను” అని తెలిపాడు.
“షఫీ సార్ వచ్చిన తర్వాతే బాల సాహిత్యం గురించి తెలిసింది”
మరో విద్యార్థి మాట్లాడుతూ.. “మాకు బాల సాహిత్యం అనేది అసలు ముందుగా తెలియదు. ఈ స్కూల్‌కి షఫీ సార్ వచ్చిన తర్వాతే అవి ఎలా రాయాలో తెలిసింది. అది తెలిసినప్పటి నుంచి మేము రాస్తున్నాము. మొదట రాసిన తర్వాతే ఫస్ట్‌లోనే మేము సెలెక్ట్ అయినందుకు చాలా ఆనందంగా అనిపించింది.
సెలెక్ట్ అయిన తర్వాత అవి చాలా దూరం వరకు వెళ్లాయి. న్యూస్ పేపర్‌లో కూడా మేము వచ్చాం. అప్పుడు మా కుటుంబ సభ్యులు అందరూ చూసారు. చాలా చాలా ఆనందపడ్డారు. చాలా గ్రేట్‌ఫుల్‌గా అనిపించింది” అని చెప్పాడు.
చదివిన కథపై వేదికపై మాట్లాడటం, చర్చించడం ద్వారా భాష పెరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తమ ఊరు, తమ అమ్మమ్మ చెప్పిన కథలను సొంత మాటల్లో రాయడం కూడా పిల్లలకు నేర్పిస్తున్నారు. పిల్లలకు మంచి ఆలోచనలు, విలువలు, మానవీయతను అందించే సాధనంగా బాల సాహిత్యం ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు.
విద్యార్థుల్లో పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా, తెలుగు భాషా సాహిత్యంపై ఆసక్తిని ఒక అభిరుచిగా, రచనను ఒక సృజనాత్మక సాధనంగా మార్చాలనే లక్ష్యంతో బాల సాహిత్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు.


