త్యాగాల తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతాం.. ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అమరవీరులకు నివాళులర్పిస్తూ రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం, ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌పై ప్రభుత్వ కార్యాచరణను వివరించారు. రైతు రుణమాఫీ, రైతుభరోసా, ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం సాధించిన విజయాలను ప్రస్తావించారు.

CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన దశాబ్దాల ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది జూన్ 2 తెలంగాణ త్యాగాల చరిత్రను గుర్తు చేసుకోవడంతో పాటు భవిష్యత్‌ దిశగా అడుగులు వేయాల్సిన భావోద్వేగ సందర్భమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి తెలంగాణ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా కవి కాళోజీ చెప్పిన ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అనే మాటలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ హితం, రాష్ట్ర అభివృద్ధి, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

Read Also : దేశానికి ఆదర్శం మన మహిళలు.. ఇందిరా స్త్రీ శక్తి భవనాల శంకుస్థాప‌న‌లో సీఎం రేవంత్‌రెడ్డి

బాధ్యత మరింత పెంచింది..

గత రెండున్నరేళ్లలో జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు చూపిన ఆదరణ తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి పట్ల మరింత నిబద్ధతతో పనిచేస్తున్నామని తెలిపారు. రైతులు, యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తూనే సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, స్వేచ్ఛను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అంటే కొందరి చేతుల్లో అధికారం కాదని, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధిగా పనిచేసే వ్యవస్థ అని సీఎం వ్యాఖ్యానించారు. అందుకే తమ ప్రభుత్వాన్ని కేవలం పరిపాలన చేసే ప్రభుత్వం కాకుండా ప్రజాస్వామ్య ఆశయాలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వంగా భావిస్తున్నామని తెలిపారు.

Read Also : ప్ర‌తి పౌరుడికి స‌మ‌గ్ర సంక్షేమ కార్డు : సీఎం రేవంత్‌రెడ్డి

వ్యవసాయానికే ప్రాధాన్యం

సాగుభూమి, వ్యవసాయం, రైతు తెలంగాణకు ఊపిరి వంటివని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల్లో తెలంగాణను దేశంలో నంబర్‌వన్‌గా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్‌లో రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి కొడంగల్ వరకు హరిత తెలంగాణను నిర్మించాలన్నదే తమ సంకల్పమన్నారు. 2025-26 అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 236.87 లక్షల మెట్రిక్ టన్నులకు చేరి రికార్డు సృష్టించిందని వెల్లడించారు. వరి, మొక్కజొన్న, పత్తి సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పశుసంపద, మత్స్య రంగాలు కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. రైతులపై అప్పుల భారం తగ్గించేందుకు ఒకేసారి రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసినట్లు సీఎం తెలిపారు. ఇందుకోసం రూ.20,616 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసి దాదాపు 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశామని చెప్పారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తూనే, సౌరశక్తితో నడిచే పంపుసెట్లను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. గత రెండున్నరేళ్లలో వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రూ.1.56 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు రూ.27,529 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని, ఈ ఏడాదే ఇప్పటికే రూ.5,700 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

Read Also : మ‌హిళ‌ల‌కు తీపిక‌బురు.. త్వ‌ర‌లోనే మ‌హాల‌క్ష్మి స్మార్ట్‌కార్డులు ఇవ్వ‌నున్న ప్ర‌భుత్వం..!

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు

రైతులు దళారుల బారిన పడకుండా కనీస మద్దతు ధరతో ప్రభుత్వం పంటలను కొనుగోలు చేస్తోందని సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.82,840 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 63.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, రైతుల ఖాతాల్లో రూ.11,903 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. దేశంలో యాసంగి సీజన్‌లో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60 శాతంగా నమోదైందని, ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. మొక్కజొన్న, జొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, ఈ యాసంగిలో 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4 లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేసి రైతులు కొత్త చరిత్ర సృష్టించారని తెలిపారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాను సాధించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంలో ఎలాంటి రాజీ లేకుండా రాజకీయ విజ్ఞతతో ముందుకు సాగుతామని తెలిపారు.

Read Also : ఇక మూడుజోన్లకే దక్షిణ మధ్య రైల్వే.. జూన్‌ నుంచి కొత్త పరిపాలన వ్యవస్థ..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »