Unified Welfare Card | తెలంగాణలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు ఒకే కార్డులో అందుబాటులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డు’ (Unified Welfare Card) రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర ప్రయోజనం అందుతుందో స్పష్టంగా కనిపించేలా ఈ కార్డును రూపొందించాలని సూచించారు. సమగ్ర సంక్షేమ కార్డు రూపకల్పనపై గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బీ అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టితో పాటు ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి..
రాష్ట్రంలోని అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల వివరాలను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీఎం సూచించారు. ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వచ్చేలా వ్యవస్థ ఉండాలని చెప్పారు. ఈ సమాచారాన్ని కృత్రిమ మేధస్సు (ఏఐ) సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. నిజమైన అర్హులకు ప్రభుత్వ పథకాలు మరింత కచ్చితంగా చేరేలా చేయడమే ఈ కార్డు ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం కూడా సులభమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వేర్వేరు శాఖలు వేర్వేరుగా కార్డులు జారీ చేస్తున్న విధానానికి బదులుగా, ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒకే సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని సీఎం సూచించారు. టెక్నాలజీపై అవగాహన ఉన్న యువ అధికారులను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.
Read Also : నిరుపేదల ప్రాణాలంటే ఎందుకు ఇంత చులకన భావం?.. రేవంత్ సర్కారుపై హరీశ్‌రావు ఫైర్
అన్ని ప్రయోజనాలు పొందుపరచాలి..
ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ సంక్షేమ పథకాలు, విద్యాశాఖ ప్రయోజనాలు, బీమా పథకాల వివరాలు పొందుపరచాలని సీఎం పేర్కొన్నారు. అవసరమైతే ఆధార్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ జారీ చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డుతో అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమాచారం కూడా సేకరించాలని ఐటీ శాఖకు సీఎం ఆదేశించారు.
Read Also : దేశానికి ఆదర్శం మన మహిళలు.. ఇందిరా స్త్రీ శక్తి భవనాల శంకుస్థాపనలో సీఎం రేవంత్‌రెడ్డి
పెన్షన్ డేటా బేస్‌కు చేరే వ్యవస్థ ఉండాలి..
ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ఎక్కడైనా మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయితే ఆ సమాచారం వెంటనే చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరేలా వ్యవస్థ ఉండాలని చెప్పారు. అలాగే ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే కార్మికుల విషయంలో కేరళ అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు, పాస్‌పోర్ట్‌లు, వీసాలకు సంబంధించిన సమాచారం ఒకే వేదికపై అందుబాటులో ఉంటే అక్రమ ఏజెంట్ల మోసాలను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం నిజమైన లబ్ధిదారులకు చేరుతోందా లేదా అన్న విషయాన్ని అంచనా వేసే విధంగా సమగ్ర సంక్షేమ కార్డు వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also : తెలంగాణ రెవెన్యూశాఖలో అదనపు కలెక్టర్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు..!


