తెలంగాణలో ఎన్నో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిని చూసిన తర్వాతే పక్క రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లాలి. ఖచ్చితంగా తెలంగాణలోని ఈ 15 ప్రసిద్ధ క్షేత్రాలు ఏమిటో ఒకసారి చూద్దాం.
1. ములుగు జిల్లా రామప్ప ఆలయం
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయంలో 13వ శతాబ్దపు కాకతీయుల శిల్పకళ ఉట్టిపడుతుంది. శిల్పి రామప్ప పేరుతో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన ఆలయంగా రామప్పకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
2. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం
గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. భక్త రామదాసుతో ఈ క్షేత్రానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.
3. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ
చిలుకూరు బాలాజీ స్వామిని వీసా బాలాజీ అని కూడా పిలుస్తుంటారు. ఉస్మాన్ సాగర్ సమీపంలో ఉన్న ఈ ఆలయంలో హుండీలు ఉండవు. ఇక్కడ వీఐపీ దర్శనాలకు కూడా ప్రాధాన్యత ఉండదు. భక్తులు ఎంతో విశ్వాసంతో స్వామివారిని దర్శించుకుంటారు.
4. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం
గోదావరి, ప్రాణహిత నదుల సంగమం వద్ద ఉన్న కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ఒకే పానవట్టంపై కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు అనే రెండు శివలింగాలు ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. వీటిని జనన, మరణాలకు సంకేతంగా భావిస్తారు.
5. హైదరాబాద్ బిర్లా మందిర్
తెల్లటి రాజస్థానీ మార్బుల్‌తో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బిర్లా మందిర్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని బిర్లా ఫౌండేషన్ నిర్మించింది. ఇక్కడ కూడా హుండీ, వీఐపీ దర్శనాలకు ప్రాధాన్యత ఉండదు.
6. వరంగల్ వేయి స్తంభాల గుడి
వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి కాకతీయుల అద్భుత శిల్పకళకు నిదర్శనం. కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించిన ఈ త్రికూట ఆలయం నక్షత్ర ఆకారంలో ఉండటం ప్రత్యేకత. ఆలయంలోని శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటాయి.
7. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం వాస్తుశిల్పం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నల్లరాతి నిర్మాణాలతో ఆలయానికి ప్రత్యేక రూపాన్ని తీసుకొచ్చారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదాద్రికి ప్రత్యేక స్థానం ఉంది.
8. గద్వాల జిల్లా శ్రీ జోగులాంబ దేవి ఆలయం
గద్వాల జిల్లాలోని అలంపూర్‌లో ఉన్న శ్రీ జోగులాంబ దేవి ఆలయం ప్రసిద్ధ శక్తి క్షేత్రం. 18 శక్తిపీఠాల్లో ఒకటిగా ఈ క్షేత్రానికి విశిష్టత ఉంది. కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది.
9. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం
గోదావరి నది ఒడ్డున ఉన్న బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ప్రముఖ సరస్వతి దేవి ఆలయాల్లో ఇది ఒకటి. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
10. నల్గొండ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం
నల్గొండ జిల్లాలోని ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం శివ, విష్ణు, సూర్య సమేతంగా ఉన్న త్రికూట ఆలయం. ఆలయంలోని శివలింగంపై రోజంతా ఒక నీడ పడటం ఈ ఆలయ ప్రత్యేకతగా చెబుతారు. ఈ ఆలయ నిర్మాణం, శిల్పకళ భక్తులను ఆకట్టుకుంటాయి.
11. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం
వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం చాళుక్యుల కాలం నాటి ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహాశివరాత్రి సమయంలో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు.
12. హైదరాబాద్ కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం
కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయానికి సుమారు 800 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతుంటారు. కాకతీయుల కాలానికి సంబంధించిన ఈ ఆలయం మొఘలుల కాలంలో పునర్నిర్మాణానికి నోచుకుందని చరిత్ర చెబుతుంది. హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.
13. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం
కొండల మధ్య ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. తెలంగాణలోని ప్రముఖ హనుమాన్ క్షేత్రాల్లో ఇది ఒకటి. భక్తులు ఎంతో విశ్వాసంతో స్వామివారిని దర్శించుకుంటారు.
14. వరంగల్ భద్రకాళి ఆలయం
వరంగల్‌లోని భద్రకాళి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన అమ్మవారి క్షేత్రం. ఈ ఆలయానికి ప్రసిద్ధ కోహినూర్ వజ్రంతో సంబంధం ఉందని చరిత్రలో చెబుతుంటారు. వరంగల్ నగరానికి ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
15. సంఘీ టెంపుల్
హైదరాబాద్ సమీపంలోని ఎత్తైన కొండపై ఉన్న సంఘీ టెంపుల్ కూడా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. చోళుల శైలి వాస్తుతో నిర్మించిన ఈ ఆలయం కొండపై నుంచి కనిపించే అందమైన దృశ్యాలతో కూడా ఆకట్టుకుంటుంది.
ఇవే కాకుండా తెలంగాణలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కాబట్టి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు తిరిగే ముందు తెలంగాణలోని ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఒకసారి సందర్శించవలసిందిగా కోరుతున్నాం.


